బషీర్ బాగ్, వెలుగు : స్వాతంత్ర్య సమరయోధురాలు, నైటింగేల్ ఆఫ్ ఇండియాగా ప్రసిద్ధి చెందిన సరోజినీ నాయుడు భర్త డాక్టర్ ముత్యాల గోవిందరాజులు నాయుడు సమాధి కూల్చివేతకు గురైంది. హైదర్ గూడ ముత్యాలబాగ్ లోని ఆర్కేఎస్ అపార్ట్ మెంట్ ప్రాంగణంలో ఉన్న ముత్యాల గోవిందరాజులు, ఆయన కుటుంబ సభ్యుల సమాధులను అపార్ట్ మెంట్ సొసైటీ సభ్యులు కూల్చివేశారు.
ఈ విషయంపై ముత్యాల బాగ్ బస్తీకి చెందిన అనిల్ నారాయణగూడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. గోవిందరాజులు నాయుడు, ఆయన కుటుంబ సభ్యుల సమాధులు ఉన్న స్థలాన్ని గతంలో డెవలప్మెంట్కు ఇచ్చారని చెప్పారు. మొదట్లో భూములన్నీ గోవిందరాజులు కుటుంబం పేరుపైనే ఉండేవని, కొందరు పేదలకు పంచిపెట్టడంతో వారి ఇంటి పేరున ముత్యాలబాగ్బస్తీ ఏర్పడిందన్నారు. అపార్ట్ మెంట్ నిర్మాణం కంటే ముందు నుంచే సమాధులు ఉన్నాయని, తాజాగా వాటిని తొలగించి, సదరు భూమిని కబ్జా చేసేందుకు అపార్ట్ మెంట్ సొసైటీ సభ్యులు కుట్ర పన్నారని ఆరోపించారు.
మహనీయుల సమాధులకు రక్షణ లేకపోవడం బాధాకరమని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని అనిల్ ఫిర్యాదులో కోరారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన నారాయణగూడ పోలీసులు అక్కడి సీసీ టీవీ ఫుటేజ్, హార్డ్ డిస్క్ లను స్వాధీనం చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.