హడావుడి కూల్చివేతలు.. ప్రైవేట్​ కోసమేనా?

నిజామాబాద్,వెలుగు: జిల్లా కేంద్రంలో ప్రగతిభవన్, పాత కలెక్టరేట్, డ్వాక్రా బజార్, ఇరిగేషన్ క్వార్టర్స్, ఎండీవో ఆఫీసుల కూల్చివేతపై ఇప్పడు సర్వత్రా చర్చ జరుగుతోంది. ఈ స్థలాన్ని ఎలా వాడుకుంటారన్నది చెప్పకుండానే హడావుడిగా కూల్చివేతలు చేపట్టడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జిల్లా కేంద్రంలో ఉన్న ఒకే ఒక కలెక్టరేట్​స్టేడియాన్ని కూల్చి వేయడాన్ని క్రీడా సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. ఇక్కడ కళాభారతి పేర ఆడిటోరియాన్ని నిర్మించాలన్న ప్రతిపాదన ఉన్నట్టు చెబుతున్నారు. డ్వాక్రా బజార్ తదితర ఆఫీసులను కూల్చిన స్థలాన్ని ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టేందుకే రాత్రికి రాత్రి కూల్చి వేతలు చేపట్టారని అంటున్నారు. ఈ స్థలాన్ని  మల్టీప్లెక్స్‌‌ల కోసం లీజ్‌‌కు ఇస్తారని చాలా కాలంగా ప్రచారం సాగుతోంది. నగరం నడిబొడ్డున ఉన్న అత్యంత విలువైన ఈ భూములను ప్రైవేట్​పరం కానివ్వకుండా చూడాలని  ప్రజా సంఘాల నేతలు, నగర ప్రముఖులు కోరుతున్నారు.      ​   

ఒక్కొక్కటిగా...

గత నెల 28న మంత్రి ప్రశాంత్ రెడ్డి, ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, అర్బన్ ఎమ్మెల్యే గణేశ్‌‌ గుప్తా నగర అభివృద్ధిపై సమీక్షించారు. ఈ మీటింగ్‌‌ తర్వాత నిజామాబాద్ పాత కలెక్టరేట్ ప్రాంతంలో ఏడాది కింద నిర్మించిన నవదుర్గ ఆలయం మినహా మిగిలిన కట్ట డాలను కూల్చివేయడం మొదలుపెట్టారు. కలెక్టరేట్ ప్రాంగణంలోని అన్ని ఆఫీస్‌‌లను ఇది వరకే కొత్త కలెక్టరేట్‌‌కు తరలించారు. జిల్లా స్పోర్ట్స్ అథారిటీ ఆఫీస్‌‌నూ మార్చేందుకు యత్నించారు. కానీ  ఒలింపిక్ సంఘంతో పాటు ప్లేయర్స్ మినీస్టేడియంను తరలించొద్దని ఆందోళనకు దిగారు. స్కౌట్ అండ్ గైడ్స్ బిల్డింగ్, డ్వాక్రా బజార్‌‌‌‌లను తొలగింపునకు ఏర్పాట్లు చేస్తున్నారు. పాత కలెక్టరేట్‌‌ను ఆనుకుని ఉన్న బ్యాంక్‌‌ను కూడా ఖాళీ చేయాలని ఆదేశించారు.  ప్రస్తుతానికి ఒక్క తెలంగాణ నాన్ గెజిటెడ్ ఆఫీసర్ల భవనం మినహాయించారు. కలెక్టర్ క్యాంప్ కార్యాలయం, ఆఫీసర్ క్లబ్, సీపీ క్యాంప్ కార్యాలయాలను కూడా తరలించే యోచనలో ఉన్నట్లు చర్చ జరుగుతుంది. మరో వైపు రైల్వే స్టేషన్ పక్కన ఆర్టీసీ న్యూ బస్టాండ్ నిర్మాణానికి ఆర్టీసీ సన్నాహాలు చేస్తోంది. ఇక్కడ ఉన్న ఆర్‌‌‌‌అండ్‌‌బీ, ఎస్ఈ క్యాంప్, ఓల్డ్ పంచాయతీ ఆఫీస్‌‌లను ఖాళీ చేయిస్తున్నారు. మున్సిపల్ పక్కనే ఉన్న నిజామాబాద్ ఎంపీడీవో, ఎంఆర్సీ, నీటి పారుదల శాఖ కార్యాలయాలను ఖాళీ చేయించారు. మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్‌‌ను న్యూ బిల్డింగ్‌‌లోకి షిఫ్ట్ చేయునున్నారు. 

ప్రైవేట్ పరం చేసేందుకు కుట్ర? 

నిజామాబాద్‌‌కు రూ.100 కోట్లు మంజూరు చేసిన సీఎం కేసీఆర్ సీటీ డెవలప్‌‌మెంట్‌‌పై ప్రత్యేక దృష్టి సారించారు. ఈ నేపథ్యంలో స్థలాల కేటాయింపు, నిర్మాణాల వ్యవహారాలు రాజధానిలోనే ఫైనల్ అవుతున్నట్లు తెలుస్తోంది. నిజామాబాద్‌‌లోని కార్పొరేట్ బిజినెస్ సంస్థలు,​ ప్రైవేట్ ఎంటర్ టైన్‌‌మెంట్‌‌ బిజినెస్ పెద్దలకు ఈ స్థలాలు కేటాయిస్తారనే ఆరోపణలు ఉన్నాయి. ఎల్లమ్మగుట్ట చౌరస్తాలోని డ్వాక్రా బజార్ వెనుక ప్రాంతాన్ని 66 ఏళ్ల లీజుకు ఇవ్వాలని పదేళ్ల నుంచి ప్రభుత్వం వద్ద ప్రతిపాదనలు ఉన్నాయి. తాజాగా ఓల్డ్ కలెక్టరేట్ ఖాళీ అవుతున్న నేపథ్యంలో  ఏ స్థలమైనా కేటాయించాలని సదరు వ్యక్తి కోరినట్లు తెలుస్తోంది. ఓ జాతీయ పార్టీ నేతను తమ పార్టీలోకి ఆకర్శించేందుకు ఎల్లమ్మ గుట్ట వైపు ఉన్నన స్థలాన్ని షాపింగ్ మాల్ కేటాయించేందుకు రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. సీఎం కేసీఆర్ జిల్లా పర్యటనకు వచ్చి కళాభారతి ఆడిటో రియానికి శంకుస్థాపన చేస్తే కానీ జిల్లా కేంద్రంలో రూ.కోట్ల విలువ చేసే స్థలాల్లో ఏఏ నిర్మాణాలు చేపడుతారు ఎవరికి కేటాయిస్తారనేది తేలుతుంది.  

అపోహలు వద్దు..

సర్కార్ ఆఫీస్‌‌ల కూల్చివేతలపై అపోహాలు వద్దు. ఓల్డ్ కలెక్టరేట్​స్థానంలో కళాభారతి నిర్మిస్తాం. కూల్చి వేసిన స్థలాల్లో ప్రజోపయోగకర నిర్మాణాలను చేపడుతాం. ప్రైవేట్ వ్యక్తులకు స్థలాలను అప్పగింత ప్రచారం అవాస్తవం.  
- సి.నారాయణరెడ్డి, నిజామాబాద్‌‌ కలెక్టర్​ 

ఉద్యమిస్తాం..

ఎలాంటి జీవోలు లేకుండా జిల్లాలోని సర్కారీ ఆఫీస్‌‌లను కూల్చడం దారుణం. మినీ స్టేడియం తరలింపును అడ్డుకునేందుకు ఇప్పటికే పోరాటం చేస్తున్నాం. సర్కార్ స్థలాలను ప్రైవేట్ పరం చేస్తే ఉద్యమిస్తాం.
- రమేశ్‌‌బాబు, సీపీఎం జిల్లా ప్రధాన కార్యదర్శి