మూసీ ప్రక్షాళనకు ముందడుగు

మూసీ ప్రక్షాళనకు ముందడుగు
  •     స్వచ్ఛందంగా RB–X ఇండ్లను కూల్చుకున్న నిర్వాసితులు
  •     ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రశాంతంగా కూల్చివేతలు 
  •     స్థానిక ఎమ్మెల్యే, కార్పొరేటర్ల సహకారం
  •     జియాగూడ ‘డబుల్’ ​ఇండ్లకు మరో 10 కుటుంబాలు
  •     ఇండ్లు ఖాళీ చేసేందుకు ముందుకొచ్చిన మరో 151 కుటుంబాలు

హైదరాబాద్ సిటీ, వెలుగు : మూసీ ప్రక్షాళనకు ముందడుగు పడింది. మొదటి దశలో భాగంగా ‘RB–X’ మార్క్​చేసిన ఇండ్లను మంగళవారం నిర్వాసితులే స్వచ్ఛందంగా కూల్చుకున్నారు. మలక్​పేట నియోజకవర్గం చాదర్​ఘాట్​లోని శంకర్ నగర్, వినాయక వీధి, రసూల్ పురా, మూసానగర్​తదితర ప్రాంతాల్లో నిర్వాసితులు ఉదయం నుంచే కూల్చివేతలు ప్రారంభించారు. తాము ఖాళీ చేసిన ఇండ్లను ఇతరులు ఆక్రమించే అవకాశం ఉందని చెబుతూ.. స్థానిక ఎమ్మెల్యే మహ్మద్​బిన్ బలాల, కార్పొరేటర్ల సహకారంతో కూల్చేశారు. 

ఇరుకు సందులు కావడంతో బుల్డోజర్లు వెళ్లే పరిస్థితి లేక కూలీలను పెట్టి కూల్చివేత చేపట్టారు. ఇప్పటికే ఇక్కడివారిని చంచల్‌‌గూడలోని డబుల్​బెడ్‌‌రూమ్​ఇండ్ల సముదాయానికి తరలించారు. మరికొంతమందిని తరలించేందుకు అధికారులు వాహనాలను ఏర్పాటు చేశారు. మంగళవారం ఓ వైపు కూల్చివేతలు కొనసాగుతుండగా, మరోవైపు నిర్వాసితులు మలక్​ పేటలోని పిల్లిగుడిసెలు ‘డబుల్’ ఇండ్లకు తరలివెళ్లారు. 

దర్వాజాలు, కిటికీలు, వైర్లు, స్విచ్ బోర్డులు, ఐరన్​ఇతర పనికొచ్చే వస్తువులను తీసుకున్నారు. వివిధ పార్టీలకు చెందిన స్థానిక నాయకులు కూల్చివేతలను పరిశీలించారు. చెదురుమొదురు ఘటనలు మినహా ఇండ్ల తొలగింపు ప్రశాంతంగా జరిగింది. ఖాళీ చేసిన ఇండ్ల తొలగింపు దాదాపు పూర్తయిందని రెవెన్యూ అధికారులు తెలిపారు. 

స్పాట్​లోనే 151 కుటుంబాలకు పట్టాలు

మలక్​పేట నియోజకవర్గంలోని శంకర్​నగర్, మూసానగర్, వినాయక వీధి, రసూల్​పురా(చోటాబ్రిడ్జి) ప్రాంతాల్లో సర్వే చేయడానికి హైదరాబాద్​జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మూడు స్పెషల్​టీమ్స్​ను నియమించారు. హిమాయత్​ నగర్, షేక్​పేట, మారేడుపల్లి తహసీల్దార్లతో టీమ్స్​ఏర్పాటు చేశారు. వీరంతా151 ఇండ్లను గుర్తించి ‘RB–-X’ మార్క్​వేశారు. 

నిర్వాసితులతో మాట్లాడి డబుల్​బెడ్​రూమ్​ఇండ్లకు వెళ్లేందుకు ఒప్పించారు. కోరుకున్న చోట ఇండ్ల పట్టాలను అందించారు. స్పాట్​లోనే 151 కుటుంబాలకు పట్టాలు పంపిణీ చేశారు. గడిచిన మూడు రోజుల్లో ఐదారు కుటుంబాలు మినహా అందరూ డబుల్​బెడ్​రూమ్​ఇండ్లకు తరలివెళ్లినట్లు అధికారులు తెలిపారు. 

మరో 10 కుటుంబాలు

ఇప్పటివరకు మలక్​ పేట, నాంపల్లి మండలాల పరిధిలోని174 కుటుంబాలకు డబుల్ బెడ్​రూమ్​ఇండ్ల పట్టాలు అందాయి. ఇందులో శంకర్​ నగర్, మూసా నగర్​, వినాయక వీధి, రసూల్​ పురా ప్రాంతం నుంచి 133 కుటుంబాలు పిల్లిగుడిసెలలోని ఇండ్లకు, మరో 16 కుటుంబాలు ప్రతాపసింగారంలోని ఇండ్లకు వెళ్లాయి. నాంపల్లి మండలంలోని చంద్రకిరణ్ బస్తీకి చెందిన మరో 10 కుటుంబాలు మంగళవారం డబుల్​ఇండ్లకు వెళ్లాయి. 

మరో 5 కుటుంబాలు ఇతర సమస్యల వల్ల ఇంకా నిర్ణయం తీసుకోలేదని అధికారులు వెల్లడించారు. డబుల్​ఇండ్లకు వెళ్లిన వారి సమస్యల పరిష్కారానికి గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేశామని కలెక్టర్ అనుదీప్ తెలిపారు.

ఎవరైనా ఆక్రమిస్తారని.. 

మేము సోమవారమే ‘డబుల్’ ఇండ్లకు వెళ్లాం. ఇక్కడ ఖాళీగా ఉన్న మా ఇండ్లను మళ్లీ ఎవరైనా ఆక్రమిస్తారనే భయంతో మేమే దగ్గరుండి కూలగొట్టిస్తున్నం. కూలగొట్టగా మిగిలిన రేకులు, పైపులు, ఇనుప సామానును సేకరిస్తున్నం. 

- ఇస్మాయిల్, శంకర్​నగర్

‘డబుల్’ ఇల్లు బాగుంది

ప్రభుత్వం ఇచ్చిన డబుల్​బెడ్​రూమ్​ఇల్లు బాగుంది. అధికారులు కరెంట్, నీళ్ల కనెక్షన్లు ఇచ్చారు. సామాన్లు తీసుకురావడావకి ట్రాన్స్​పోర్టు వెహికల్​పెట్టారు. ఇంకా నీళ్లు వదలడం లేదు. మాకు అక్కడ నీళ్లు ఎప్పుడూ వస్తుండేది. ఈ ఒక్క సమస్య పరిష్కరిస్తే చాలు. 

- హజారబేగం, పిల్లిగుడిసెలు