మహబూబ్​నగర్​లో కూల్చివేతలు

మహబూబ్​నగర్​లో కూల్చివేతలు
  • ప్రభుత్వ భూమిలో కట్టిన 78 ఇండ్లు తొలగించిన ఆఫీసర్లు
  • గత ప్రభుత్వ హయాంలో గజాల లెక్కన అమ్ముకున్న బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ లీడర్లు

మహబూబ్‌‌‌‌నగర్‌‌‌‌, వెలుగు: పాలమూరు జిల్లా కేంద్రంలో ఆక్రమణలపై రెవెన్యూ ఆఫీసర్లు చర్యలు ప్రారంభించారు. పట్టణంలోని సర్వే నంబర్‌‌‌‌ 523లో 2014 నుంచి ఆక్రమణలు జరుగుతున్నాయని రెవెన్యూ ఆఫీసర్లకు, ప్రజావాణిలో కలెక్టర్లకు పలుమార్లు ఫిర్యాదులు అందాయి. దీంతో నెల రోజులుగా విచారణ చేసిన ఆఫీసర్లు కబ్జా చేసిన స్థలంలో మొత్తం 78 ఇండ్లు కట్టినట్లు తేల్చారు. వీటికి ఎలాంటి పర్మిషన్లు, పట్టాలు లేకపోవడంతో గురువారం తెల్లవారుజామున కూల్చివేతలు ప్రారంభించారు.

ఉదయం విషయం తెలుసుకున్న ప్రజలు ఘటనాస్థలానికి చేరుకున్నారు. ప్రభుత్వం పట్టాలు ఇచ్చిన తర్వాతే తాము ఇండ్లు నిర్మించుకున్నామని, నోటీసులు ఇవ్వకుండా ఇండ్లను ఎలా కూల్చివేస్తారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం కలెక్టరేట్‌‌‌‌ వద్దకు వెళ్లి ధర్నా నిర్వహించారు.

ఫేక్ పట్టాలతో అమ్మకం

మహబూబ్‌‌‌‌నగర్‌‌‌‌లోని క్రిస్టియన్‌‌‌‌పల్లి వద్ద సర్వే నంబర్‌‌‌‌ 523లో 96.28 ఎకరాలు ఉండగా, ఇందులో 83.28 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఇందులో 16 ఎకరాలను డబుల్‌‌‌‌ బెడ్‌‌‌‌రూం ఇండ్లకు కేటాయించగా, ఖాళీగా ఉన్న .జాగాలో 75 మంది దివ్యాంగులకు ఇండ్ల పట్టాలు ఇచ్చారు. ఆయా వర్గాల శ్మశానవాటికల కోసం నాలుగు ఎకరాలు, పలు కుల సంఘాల కోసం మరికొంత స్థలం కేటాయించగా.. ఇంకా 50 ఎకరాల భూమి మిగిలి ఉంది. ఈ భూములు జిల్లా కేంద్రానికి సమీపంలో ఉండడం, ఇక్కడి నుంచే భారత్‌‌‌‌ మాల నేషనల్‌‌‌‌ హైవే ప్లాన్‌‌‌‌ రావడంతో ఎకరం భూమి రూ.3.5 కోట్ల నుంచి రూ.4 కోట్ల వరకు పలుకుతున్నది. ఇక్కడి సర్కార్‌‌‌‌ భూమిపై కన్నేసిన కొందరు బీఆర్ఎస్​ లీడర్లు.. ఎవరికీ అనుమానం రాకుండా ఫేక్‌‌‌‌ పట్టాలు సృష్టించి 100, 120, 150, 200 గజాల చొప్పున అమ్మేశారు.

అప్పట్లో మహబూబ్‌‌‌‌నగర్‌‌‌‌ అర్బన్‌‌‌‌ తహసీల్దార్‌‌‌‌ ఆఫీస్‌‌‌‌లో పనిచేసిన కొందరు సిబ్బంది వీరికి సహకరించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ ఆక్రమణలపై ప్రతిపక్షాలు ఆందోళనకు దిగడంతో స్పందించిన ఆఫీసర్లు 2021లో కొన్ని ఇండ్లను కూల్చేశారు. అయితే అప్పుడు కూల్చిన ఇండ్ల వద్దే మళ్లీ ఇప్పుడు కొత్తగా నిర్మాణాలు వెలిశాయి. ఈ విషయంపై ఇటీవల అధికారులకు ఫిర్యాదులు అందాయి. స్పందించిన ఆఫీసర్లు ఎంక్వైరీ చేశాయి. విచారణలో ఎవరికీ పట్టాలు లేవని తేలడంతో ఇండ్లను కూల్చేశారు.

3.30 ఎకరాలు కబ్జా చేశారు

సర్వే నంబర్‌‌‌‌ 523లోని 3.30 ఎకరాల భూమిని ఆక్రమించి తాత్కాలిక నిర్మాణాలు చేపట్టారని మహబూబ్‌‌‌‌నగర్‌‌‌‌ అర్బన్‌‌‌‌ తహసీల్దార్‌‌‌‌ ఘన్సీరాంనాయక్‌‌‌‌ పేర్కొన్నారు. ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణాలపై ఫిర్యాదులు రావడంతో రెండు టీంలు నెల రోజుల పాటు విచారణ చేశాయన్నారు. 70 నిర్మాణాలు అక్రమంగా ఉన్నట్లు గుర్తించి వాటిని కూల్చివేశామని చెప్పారు.

కొందరు వ్యక్తులు ప్రజల నుంచి డబ్బులు వసూలు చేసి ఇక్కడ నిర్మాణాలు చేసుకోవాలని ప్రోత్సహిస్తున్నట్లు తెలిసిందని, వారిపై కూడా ఎంక్వైరీ చేస్తున్నామన్నారు. జిల్లా కేంద్రంలోని ఏనుగొండ వద్ద ఉన్న సర్వే నంబర్‌‌‌‌ 25లో కూడా ఆక్రమణలు జరుగుతున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయని, ఎంక్వైరీ చేసి చర్యలు తీసుకుంటామని చెప్పారు.