హైదరాబాద్, వెలుగు: ఈ సంవత్సరం ఎన్నికలు జరగనున్న మహారాష్ట్ర, హర్యానా, జమ్మూకాశ్మీర్, జార్ఖండ్, ఢిల్లీలో ‘ఓట్ ఫర్ ఓపీఎస్’ కొనసాగించాలని నేషనల్ మూవ్మెంట్ ఫర్ ఓల్డ్ పెన్షన్ స్కీం (ఎన్ఎంఓపీఎస్) తీర్మానించింది. ఈ మేరకు ఆదివారం ఎన్ఎంఓపీఎస్ సెక్రటరీ జనరల్ స్థితప్రజ్ఞ ఢిల్లీలోని సుర్జీత్ భవన్ లో జరిగిన నేషనల్ ఎగ్జిక్యూటివ్ సమావేశంలో స్పష్టం చేశారు. స్థితప్రజ్ఞ మాట్లాడుతూ.. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పెన్షన్ సంస్కరణలో కూడా 99,77,165 మంది ఉద్యోగుల నుంచి వసూలు చేసిన రూ.10.53 లక్షల కోట్ల పెన్షన్ నిధులు కార్పొరేట్ల చేతుల్లోకి వెళ్లనున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
సంపద కొద్ది మంది దగ్గర కేంద్రీకృతం అవుతున్నదని, సంపద సృష్టించే వాళ్లు వృద్ధాప్యంలో కనీస పెన్షన్‌కు కూడా నోచుకోలేకపోతున్నారన్నారు. సెప్టెంబర్ 26న దేశంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో యూపీఎస్, ఎన్పీఎస్కు వ్యతిరేకంగా ప్రదర్శనలు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు మీడియాకు తెలిపారు. దేశవ్యాప్తంగా ఎన్ పీఎస్ ను రద్దు చేసి.. ఓల్డ్ పెన్షన్ స్కీం అమలు చేయాలని కోరుతూ డిసెంబర్ 15న నేషనల్ మూవ్మెంట్ ఫర్ ఓల్డ్ పెన్షన్ స్కీం కన్వెన్షన్‌ను ఢిల్లీలో నిర్వహించనున్నట్లు వెల్లడించారు.