తెలంగాణలో డెంగ్యూ దడ!.. పెరుగుతున్న కేసులు

  • ఈ సారి మనకు ముప్పు ఎక్కువే
  • రెండేండ్లకోసారి విజృంభిస్తుందంటున్న డాక్టర్స్​
  • ఈ ఏడాది ఇప్పటికే2,359 మందికి డెంగ్యూ పాజిటివ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌
  • వారంలోనే 7 నుంచి 10 శాతానికి పెరిగిన టెస్ట్ పాజిటివ్ రేట్​


హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో డెంగ్యూ దడ పుట్టిస్తున్నది. ఈ సారి కేసులు ఎక్కువగా నమోదయ్యే ప్రమాదం ఉన్నదని డాక్టర్లు అంచనా వేస్తున్నారు. ప్రతి రెండేండ్లకోసారి డెంగ్యూ విజృంభిస్తున్నదని, ఆ లెక్కన ఈసారి ఎక్కువగా ఉండొచ్చని చెబుతున్నారు. అధికారిక లెక్కలు ఎలా ఉన్నా 2022తో పోలిస్తే నిరుడు డెంగ్యూ తీవ్రత తక్కువగానే ఉందంటున్నారు. ఈ సారి ప్రభావం ఎక్కువగా ఉండొచ్చునని హెచ్చరిస్తున్నారు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (డబ్ల్యూహెచ్​వో) వంటి సంస్థలు కూడా దేశంలో ఈ సారి డెంగ్యూ ప్రభావం ఎక్కువగా ఉంటుందని ఇప్పటికే అలర్ట్​ చేశాయి. డాక్టర్ల అంచనా వేసినట్టే ఇప్పటికే రాష్ట్రంలో వేల మంది జ్వరాల బారిన పడ్డారు. ఈ ఏడాది ఇప్పటివరకూ చేసిన టెస్టుల్లో 2,359 మందికి డెంగ్యూ పాజిటివ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా తేలినట్టు ప్రజారోగ్యశాఖ లెక్కలు చెబుతున్నాయి. 

ఇందులో జూన్‌‌‌‌లో 380 కేసులు వస్తే, జులైలో తొలి 12 రోజుల్లోనే 445 కేసులు నమోదయ్యాయి. అయితే, అధికారికంగా చెప్పే లెక్కల కంటే పదుల రెట్లు కేసులు ఎక్కువగా ఉంటాయని డాక్టర్లు చెప్తున్నారు. కేసుల రిపోర్టింగ్‌‌‌‌లో ప్రజారోగ్య విభాగం సరైన లెక్కలు చూపడం లేదని, దాని వల్ల వ్యాధి తీవ్రతను జనాలు తెలుసుకోలేకపోతున్నారన్న విమర్శలు ఉన్నాయి. 

పది శాతం మందికి పాజిటివ్‌‌‌‌

ప్రజారోగ్యశాఖ లెక్కల ప్రకారం ప్రస్తుతం రోజూ సగటున 800 మందికి రాష్ట్రంలో డెంగ్యూ టెస్టులు చేస్తున్నారు. ఇందులో సగటున పది శాతం మందికి పాజిటివ్ వస్తున్నది. ఈ వారం రోజుల్లో వరుసగా 9.71, 11.45, 9.33, 10.04, 9.67 చొప్పున టీపీఆర్‌‌‌‌‌‌‌‌(టెస్ట్ పాజిటివ్ రేటు) నమోదైంది. అంతకుముందు వారం టీపీఆర్‌‌‌‌‌‌‌‌ 7 శాతం కంటే తక్కువగా రికార్డయింది. ఇది ఇంకా ఎక్కువయ్యే ప్రమాదం ఉందని డాక్టర్లు చెబుతున్నారు. డెంగ్యూ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఇటీవలే మున్సిపల్​ డిపార్ట్‌‌‌‌మెంట్ అవగాహన కార్యక్రమాలను ప్రారంభించింది. అయితే, గతంలో మాదిరిగా ఫీవర్ ఓపీ కౌంటర్లను నిర్వహించాలని డాక్టర్లు సూచించారు. గతంలో వర్షాకాలంలో ప్రభుత్వ దవాఖాన్లలో ప్రత్యేకంగా ఫీవర్ ఓపీ కౌంటర్లను నిర్వహించేవారు. తద్వారా పేషెంట్లకు దవాఖాన్లలో వెయిటింగ్ పీరియడ్‌‌‌‌ను తగ్గించడంతో పాటు ఒకరి నుంచి ఒకరికి రోగాలు వ్యాపించకుండా ఈ చర్యలు కొంతవరకు ఉపయోగపడ్డాయి.

జ్వరం వస్తే డెంగ్యూనేనా?

ఈ వానాకాలం సీజన్​లో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఏదో రూపంలో ఫీవర్ రావొచ్చు. అయితే,  ప్రతీ జ్వరాన్ని డెంగ్యూ అనుకొని భయపడకూడదు అని డాక్టర్లు చెబుతున్నారు. జ్వరంతోపాటు చలిగా అనిపించడం, విపరీతమైన ఒళ్లు నొప్పులు, తలనొప్పి, వాంతులు, ఆకలి వేయకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తే అది డెంగ్యూ అవ్వొచ్చని అంటున్నారు. ఒక్కోసారి జ్వరం లేకపోయినా విపరీతమైన ఒళ్లు నొప్పులు, అలసిపోయినట్టు అనిపించడం, శరీరంపై దద్దుర్లు రావడం, బీపీ తగ్గిపోవడం వంటి లక్షణాలు కనిపిస్తే అప్పుడు కూడా పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తున్నారు. రక్త పరీక్ష చేయించుకుంటే డెంగ్యూ అవునో, కాదో తేలిపోతుంది. దీన్ని ఎంత త్వరగా గుర్తిస్తే ట్రీట్​మెంట్​ అంత ఈజీ అవుతుంది. 

ఆలస్యం వద్దు

మిగతా జ్వరాలతో పోలిస్తే డెంగ్యూలో మరణాలు ఎక్కువగా సంభవిస్తుంటాయి. దానికి కారణం ప్లేట్ లెట్లు పడిపోవడం. రక్తంలో రక్తకణాలతో పాటు ప్లేట్ లెట్స్ కూడా ఉంటాయి. ఇవి శరీరానికి గాయం అయినప్పుడు రక్తం గడ్డకట్టేలా చేస్తాయి. ఇవి లేకపోతే శరీరంలో ఇంటర్నల్ బ్లీడింగ్ జరుగుతుంది. మామూలుగా ఒక వ్యక్తిలో ఇవి 1.5 లక్షల నుంచి 4.5 లక్షల వరకు ఉంటాయి. డెంగ్యూ సోకినప్పుడు వీటి సంఖ్య తగ్గిపోతుంది. ఒక్కోసారి డెంగ్యూను గుర్తించే సరికే పరిస్థితి చేయిదాటిపోవచ్చు. వైరస్ ప్రభావాన్ని తగ్గించడానికి డాక్టర్లు ట్రీట్​మెంట్​ చేస్తారు. కానీ ప్లేట్ లెట్ల సంఖ్యను పెంచడానికి ఎలాంటి  ట్రీట్​మెంట్​ అందుబాటులో లేదు. శరీరమే ఇమ్యూనిటీ సాయంతో ప్లేట్లెట్లను పెంచుకోవాలి. ప్లేట్ లెట్ల సంఖ్య ఇరవై వేల కంటే తక్కువకి పడిపోతే డాక్టర్లు కొత్త ప్లేట్ లెట్లను ఎక్కిస్తారు. అప్పటికీ శరీరం సరిగ్గా రెస్పాండ్ అవ్వలేకపోతే పరిస్థితి సీరియస్ అవుతుంది. అందుకే, ముందే టెస్టులు చేయించుకుని, ట్రీట్‌‌‌‌మెంట్ తీసుకుంటే పరిస్థితి విషమించకుండా జాగ్రత్త పడొచ్చునని డాక్టర్లు సూచిస్తున్నారు.

దోమలతోనే వ్యాధులు

డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా, జికా వంటి వ్యాధులన్నీ దోమల వల్లే వస్తాయి. అందుకే ఈ సీజన్‌‌‌‌లో దోమలు కుట్టకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.  పిల్లలను స్కూల్‌‌‌‌కు పంపించేటప్పుడైనా, ఇంట్లోనైనా ఫుల్ స్లీవ్ డ్రెస్సులు వేయాలి. దోమ తెరలు ఉపయోగించాలి. ఇంట్లో, ఇంటి చుట్టు పక్కల నీటి నిల్వ లేకుండా చూసుకోవాలి. దగ్గు, జలుబు, జ్వరం వంటి లక్షణాలు ఉంటే డాక్టర్లను సంప్రదించి, ట్రీట్‌‌‌‌మెంట్ తీసుకోవాలి.
- డాక్టర్ కరుణ, పీడియాట్రిషన్, హైదరాబాద్

తీవ్రత పెరిగే ప్రమాదం

దేశంలో డెంగ్యూ తీవ్రత ఈసారి పెరిగింది. మన రాష్ట్రంలో ప్రస్తుతానికి కంట్రోల్‌‌‌‌లోనే ఉన్నప్పటికీ, తీవ్రత పెరిగే ప్రమాదం ఉంది. ఇప్పుడిప్పుడే దవాఖాన్లకు కేసులు 
వస్తున్నాయి. గత పదేండ్ల ప్యాటర్న్‌‌‌‌ చూస్తే ప్రతి రెండేండ్లకోసారి డెంగ్యూ తీవ్రత  ఎక్కువగా ఉంటోంది. ఈసారి కూడా ఆ ప్రమాదం ఉండొచ్చు. జనాలు జాగ్రత్తగా ఉండాలి.
- డాక్టర్ కిరణ్ మాదాల, సైంటిఫిక్ కమిటీ, ఇండియన్ మెడికల్ అసోసియేషన్‌‌‌‌

లక్షణాలు ఇవే..

డెంగ్యూ జ్వరం దోమల ద్వారా సంక్రమించే వైరల్ వ్యాధి. ప్రధానంగా ఈడిస్ ఈజిప్టి దోమల ద్వారా వ్యాపిస్తుంది. డెంగ్యూ సోకిన సమయంలో అధిక జ్వరం, తీవ్రమైన తలనొప్పి, కీళ్లు, కండరాల నొప్పి, దద్దుర్లు, ఫ్లూ వంటి లక్షణాలుంటాయి. వైరస్ తీవ్రత ఎక్కువగా ఉంటే ప్లేట్‌‌‌‌లెట్స్ పడిపోవడం, ఇంటర్నల్ బ్లీడింగ్ వంటి లక్షణాలు కూడా ఏర్పడుతాయని డాక్టర్లు చెప్తున్నారు.