ఇంటింటి సర్వేకు సిద్ధమవుతోన్న సర్కార్

రాష్ట్రంలో  డెంగీ కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. గ్రేటర్‌‌ హైదరాబాద్‌‌లో జులైలో 542, ఆగస్టులో 1,827 కేసులు నమోదయ్యాయి. ఇక రాష్ట్రవ్యాప్తంగా ఈ కేసుల సంఖ్య ఐదు వేలకు పైనే ఉంది. అర్బన్ ఏరియాల్లో డెంగీ కేసులు అధికంగా నమోదవుతున్నందున, గ్రేటర్ హైదరాబాద్‌‌, మున్సిపాలిటీల్లో డోర్‌‌‌‌ టు డోర్‌‌‌‌ సర్వే చేపట్టాలని సర్కారు నిర్ణయించింది.

హైదరాబాద్, వెలుగు: డెంగీ భయపెడుతున్నది. రోజురోజుకూ కేసులు పెరిగిపోతున్నాయి. గ్రేటర్‌‌‌‌ హైదరాబాద్‌‌‌‌లో జులైలో 542, ఆగస్టులో 1,827 కేసులు నమోదయ్యాయి. ఇక రాష్ట్రవ్యాప్తంగా ఈ కేసుల సంఖ్య 5 వేలకు పైనే ఉంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో మరోసారి ఇంటింటి సర్వేకు సర్కార్‌‌‌‌‌‌‌‌ సిద్ధమవుతోంది. అర్బన్ ఏరియాల్లో డెంగీ కేసులు అధికంగా నమోదవుతున్నందున, గ్రేటర్ హైదరాబాద్‌‌‌‌, మున్సిపాలిటీల్లో డోర్‌‌‌‌‌‌‌‌ టు డోర్‌‌‌‌‌‌‌‌ సర్వే చేపట్టాలని నిర్ణయించింది. ఆరోగ్య, మున్సిపల్ శాఖ అధికారులతో మంత్రులు హరీశ్‌‌‌‌రావు, కేటీఆర్‌‌‌‌‌‌‌‌ సోమవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అధికారులు, సిబ్బంది కలిసి ఇంటింటికీ వెళ్లి డెంగీపై అవగాహన కల్పించాలని ఆదేశించారు. అలాగే జ్వర బాధితులను దవాఖాన్లకు తరలించి, టెస్టులు చేయించడం ద్వారా తొలి దశలోనే వ్యాధి నివారణ చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇంటింటి సర్వే, ప్రతి ఆదివారం పరిశుభ్రత కోసం పది నిమిషాలు కార్యక్రమాల్లో ప్రజాప్రతినిధులను, ఇతర శాఖల అధికారులు, సిబ్బందిని, సామాజిక కార్యకర్తలను, స్కూల్, కాలేజీ పిల్లలను భాగస్వాములను చేయాలని సూచించారు.

జాగ్రత్త పడకుంటే ఇంకా పెరుగుతయ్

హరీశ్‌‌‌‌రావు మాట్లాడుతూ.. ‘‘గ్రేటర్ హైదరాబాద్‌‌‌‌లో జులైలో 542, ఆగస్ట్‌‌‌‌లో 1,827 డెంగీ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా కేసుల సంఖ్య 5 వేలు దాటింది. మలేరియా కేసులు 450 దాటినయి. జాగ్రత్తలు తీసుకోకపోతే కేసులు మరింత పెరిగే ప్రమాదం ఉంది. ప్రివెన్షన్ చర్యలు తీసుకోవాలి” అని సూచించారు. జీహెచ్‌‌‌‌ఎంసీ ఎంటమాలజీ విభాగంలో 1,600 మంది సిబ్బంది ఉన్నారని, వారితో కలిసి పనిచేయాలని ఆరోగ్యశాఖ అధికారులను ఆదేశించారు. జ్వరం వస్తే నిర్లక్ష్యం చేయొద్దని, వెంటనే వెళ్లి సమీప ప్రభుత్వ దవాఖానలో డాక్టర్‌‌‌‌‌‌‌‌ను కలవాలని ప్రజలకు సూచించారు. ప్రభుత్వ దవాఖాన్లలో టెస్టులకు అవసరమైన పరికరాలు, రీఏజెంట్స్‌‌‌‌, మందులు, ప్లేట్‌‌‌‌లెట్ సెపరేషన్ మిషన్లు సహా అన్నీ అందుబాటులో ఉన్నాయన్నారు.

కార్డన్ సెర్చ్‌‌‌‌లా ఫీవర్​ సర్వే

జీహెచ్ఎంసీ కమిషనర్లు, జోనల్, డిప్యూటీ కమిషనర్లు ఏయే వార్డుల్లో డెంగీ కేసులు ఎక్కువ ఉన్నాయో గుర్తించి, నివారణకు ప్లాన్లు రూపొందించాలని కేటీఆర్ ఆదేశించారు. ప్రతి ఆదివారం పరిశుభ్రత కార్యక్రమంలో పాల్గొనే ఇండ్లకు స్టిక్కర్లు అంటించాలని సూచించారు. పోలీసులు కార్డన్ సెర్చ్ చేసినట్టు, జీహెచ్‌‌‌‌ఎంసీ పరిధిలోని అన్ని కాలనీల్లో జ్వర సర్వే నిర్వహించాలన్నారు.

నిర్లక్ష్యాన్ని సహించం: హరీశ్

ఆరోగ్యశాఖకు పేరు తెచ్చేలా ప్రతిఒక్కరూ పనిచేయాలని, పనిచేయని వారిపై చర్యలు తప్పవని మంత్రి హరీశ్‌‌‌‌రావు హెచ్చరించారు. ప్రజలకు వైద్యం కల్పించడంలో నిర్లక్ష్యం చేయొద్దన్నారు. ఈమధ్య జరిగిన ఘటనలపై ఎంక్వైరీ జరుగుతోందని, భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా బాధ్యులపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామన్నారు. ఆశాలు, ఎన్ఎంలు, హెల్త్ సూపర్ వైజర్లు, మెడికల్ ఆఫీసర్లు, డీప్యూటీ డీఎంహెచ్‌‌‌‌వోలు, డీఎంహెచ్‌‌‌‌వోలతో మంత్రి టెలికాన్ఫరెన్స్‌‌‌‌ నిర్వహించారు. పేదలకు మెరుగైన వైద్యం అందించేందుకు ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేయాలని సూచించారు. సర్జరీలు చేయించుకుని డిశ్చార్జ్ అయిన వారి ఇండ్లకు వెళ్లి, వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకోవాలని సూచించారు.