యాదాద్రిలో బయటపడుతున్న డెంగీ, టైఫాయిడ్ కేసులు
హాస్పిటల్స్‌లో పెరుగుతున్న పేషెంట్లు
యాదాద్రి, వెలుగు : యాదాద్రి జిల్లాలో విషజ్వరాల బారిన పడుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. జిల్లాలోని ప్రతి మూడు ఇండ్లలో ఒక ఇంట్లో జ్వర బాధితులే కనిపిస్తున్నారు. దీంతో హాస్పిటళ్లకు రోగుల తాకిడి పెరిగింది. గత నెలతో పోలిస్తే ప్రస్తుతం హాస్పిటళ్లలో ఓపీ చూపించుకునే వారి సంఖ్య డబుల్ అయ్యింది. చౌటుప్పల్ సీహెచ్‌సీకి రోజుకు 150 మంది వరకు ఓపీ చూపించుకుంటుండగా ప్రస్తుతం ఆ సంఖ్య 250కి చేరుకుంది. ఆలేరులో 200, భువనగిరి ఏరియా హాస్పిటళ్లలో 500 దాటుతోంది. మరో వైపు ఇన్‌పేషెంట్లు కూడా పెరిగిపోతుండడంతో హాస్పిటళ్లలో బెడ్లు ఫుల్ అవుతున్నాయి.
డెంగీ కలకలం
యాదాద్రి జిల్లాలో డెంగీ కలకలం మొదలైంది. గడిచిన రెండేండ్లలో జిల్లాలో కేసుల సంఖ్య ఎక్కువగానే నమోదైంది. అయితే ఈ ఏడాది ప్రారంభం నుంచి ఈ నెల 20 వరకు మూడు కేసులే నమోదు కావడంతో ఆఫీసర్లు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. కానీ ఈ వారంలో రామన్నపేట మండలంలో రెండు డెంగీ కేసులు బయటపడ్డాయి. దీంతో ఒక్కసారిగా కలకలం మొదలైంది. వాస్తవానికి డెంగీని నిర్ధారణ చేసే టెస్ట్ సౌకర్యం యాదాద్రి జిల్లాలోని సర్కార్ హాస్పిటల్స్‌లో లేదు. దీంతో ఇక్కడ సేకరించిన శాంపిల్స్‌ను హైదరాబాద్‌కు పంపితే అక్కడ టెస్ట్ చేసి అది డెంగీయా..
కాదా అని కన్ఫర్మ్ చేస్తున్నారు. అయితే కొందరు వ్యక్తులు ప్రైవేట్ హాస్పిటల్స్‌లో ర్యాపిడ్ టెస్టులు చేయించుకుంటున్నారు. ర్యాపిడ్ టెస్ట్ డెంగీ కన్మర్ఫ్ కానప్పటికీ ప్రైవేట్ హాస్పిటల్స్ మాత్రం రోగులకు డెంగీ సోకిందంటూ ట్రీట్‌మెంట్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
వందల్లో టైఫాయిడ్ బాధితులు
యాదాద్రి జిల్లాలో టైఫాయిడ్ బాధితుల సంఖ్య పెరుగుతోంది. రోజురోజుకు జ్వర బాధితులు పెరుగుతుండడంతో టెస్ట్‌ల కోసం హాస్పిటల్స్‌క్యూ కడుతున్నారు. దీంతో పాటు జ్వరం, వాంతులు, విరేచనాలతో బాధపడుతూ చాలా మంది హాస్పిటల్స్‌కు వస్తున్నారు. ఇన్‌పేషెంట్ల సంఖ్య పెరగడంతో సర్కార్ హాస్పిటల్స్‌లో బెడ్స్ నిండిపోతున్నాయి. జిల్లాకు హైదరాబాద్ దగ్గర్లో ఉండడంతో చాలా మంది ట్రీట్‌మెంట్ కోసం అక్కడికి వెళ్తున్నారు. విషజ్వరాలు పెరుగుతుండడంతో ప్రజలకు అవగాహన కల్పించాల్సిన హెల్త్ ఆఫీసర్లు కేసుల సంఖ్యను దాచి, అంతా బాగుందన్నట్లు చూపే ప్రయత్నం చేస్తున్నారని పలువురు విమర్శిస్తున్నారు.