
- వైద్యుల నిర్లక్షమే కారణమంటూ బంధువుల ఆందోళన
రంగారెడ్డి, వెలుగు: సరైన వైద్యం చేయకపోవడంతోనే తమ బిడ్డ మృతి చెందాడని ఆరోపిస్తూ ఆస్పత్రి ముందు కుటుంబసభ్యులు, బంధువులు ఆందోళనకు దిగారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం రాయపోల్ గ్రామానికి చెందిన ఖానాపురం మహేశ్, ప్రవళికకు 8 నెలల కుమారుడు ప్రజ్వల్ ఉన్నాడు. ప్రజ్వల్‌కు జ్వరం రావడంతో మంచాల రోడ్డులో ఉన్న రవి కృష్ణ చిల్డ్రన్స్ హాస్పిటల్ కు శనివారం తీసుకెళ్లారు. డెంగ్యూ ఫీవర్ వచ్చిందని అడ్మిట్చేసుకున్న డాక్టర్లు.. ఆదివారం ఉదయం టెస్టులు చేయగా రక్తంలో ప్లేట్లెట్స్ భారీగా పడిపోయాయని అర్జెంట్‌గా హైదరాబాద్ తీసుకెళ్లాలని చెప్పారు. హైదరాబాద్ కు తరలిస్తుండగా మార్గమధ్యలోనే బాలుడు మృతి చెందాడు. దీంతో శనివారం అడ్మిట్ చేసుకున్న డాక్టర్లు అందుబాటులో లేకపోవడంతోపాటు ఆదివారం వరకూ ఎలాంటి టెస్టులు చేయకుండా కాలయాపన చేశారని కుటుంబసభ్యులు ఆరోపించారు. ఈ మేరకు తన బిడ్డ మృతికి ఆస్పత్రిదే బాధ్యత అంటూ పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. ఇబ్రహీంపట్నం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇవ్వడంతో వెనక్కితగ్గారు.