- జిల్లాలో క్రమంగా పెరుగుతున్న కేసులు
- ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు 248 కేసులు నమోదు
- రికార్డుల్లోకి ఎక్కని మృతుల వివరాలు
‘‘ఖమ్మం రూరల్ మండలంలో నెల రోజుల వ్యవధిలో ఇద్దరు మహిళలు డెంగీతో చనిపోయారు. ఏదులాపురానికి చెందిన ఏర్పుల సునీత(33) డెంగీతో బాధపడుతూ మంగళవారం మృతి చెందింది. గతనెలలో మద్దులపల్లి అంగన్వాడీ సెంటర్లో హెల్పర్‌గా పనిచేస్తున్న కుక్కల నగ్మ(30) డెంగీతో చనిపోయింది. నాలుగు రోజులు తీవ్ర జ్వరంతో బాధపడిన ఆమె ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది.’’
ఖమ్మం, వెలుగు : ఖమ్మం జిల్లాలో డెంగీతోపాటు విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. పట్టణాలు, గ్రామాలు అనే తేడా లేకుండా అన్నిచోట్ల జర్వబాధితులు పెరుగుతున్నారు. ఈ ఏడాది ఇప్పటి వరకు 248 మంది డెంగీ బారినపడ్డారు. జనవరి నుంచి జులై నెలాఖరు వరకు 33 కేసులు రాగా, ఒక్క ఆగస్టు నెలలోనే 65 కేసులు నమోదయ్యాయి. ఇక సెప్టెంబర్ లో ఇప్పటి వరకు 150కి పైగా డెంగీ కేసులు నమోదైనట్టు అధికారులు చెబుతున్నారు. కొంత మంది ప్రైవేట్ హాస్పిటళ్లకు వెళ్తుండగా, ఎక్కువ శాతం మంది సమీపంలోని ఆర్ఎంపీల వద్దే ట్రీట్ మెంట్ తీసుకుంటున్నారు.
ఇంకొందరు డైరెక్ట్ గా మెడికల్ షాపుల నుంచి మందులు తెచ్చుకొని వాడుతున్నారు. ప్రభుత్వాస్పత్రుల్లో ఔట్ పేషెంట్ల సంఖ్య భారీ పెరిగింది. నార్మల్డేస్లో జిల్లా కేంద్రంలోని ప్రభుత్వాస్పత్రికి డెయిలీ 700 నుంచి 800 ఔట్పేషెంట్లు వచ్చేవారు. ఈ నెలలో ఆ సంఖ్య వెయ్యి దాటుతోంది. ఒక్కోరోజు 2 వేల ఓపీలు ఉంటున్నాయని అధికారులు చెబుతున్నారు.
డెయిలీ 6 నుంచి 7 మందికి పాజిటివ్
జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారులు చెబుతున్న ప్రకారం ప్రస్తుతం డెయిలీ 6 నుంచి 7 డెంగీ పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా జనవరి నుంచి ఇప్పటి వరకు 11,553 మందికి టెస్టులు నిర్వహించగా 248 మందికి పాజిటివ్వచ్చినట్టు అధికారులు చెబుతున్నారు. గడిచిన వారం రోజుల్లో 68 శాంపిల్స్ తీసుకోగా 4 కేసులు నమోదయ్యాయి. గత వారం 1,824 శాంపిల్స్ తీసుకోగా 59 మందికి పాజిటివ్అని తేలింది.
అయితే డెంగీ కారణంగా చనిపోతున్న వారి వివరాలు రికార్డుల్లోకి ఎక్కట్లేదనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒక్క ఖమ్మం రూరల్ మండలంలోనే నెలరోజుల వ్యవధిలో ఇద్దరు మహిళలు చనిపోయిగా, అధికారులు మాత్రం వారు వేర్వేరు అనారోగ్య కారణాలతో చనిపోయారని చెబుతున్నారు.
అవగాహన కల్పిస్తున్నా..
జిల్లాలో విష జ్వరాలు వ్యాపించకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇండ్లు, కాలనీల్లో డ్రైడే పాటించడంపై అవగాహన కల్పిస్తున్నారు. మైకుల ద్వారా ప్రచారం చేస్తున్నారు. జ్వరాలు ఎక్కువగా నమోదవుతున్న గ్రామాల్లో, ఆయా మండలాల పీహెచ్‌సీల సిబ్బందితో ప్రత్యేక హెల్త్ క్యాంపులు నిర్వహిస్తున్నారు. ఖాళీ ప్లాట్లలో నీరు నిల్వలేకుండా చూసుకోవాలని ప్లాట్ల యజమానులకు రెవెన్యూ సిబ్బందితో నోటీసులు అందజేస్తున్నారు.
గత నెలలో కురిసిన వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాల్లో నీరు నిల్వకావడం, వాతావరణ మార్పుల కారణంగా జ్వరాల వ్యాప్తి పెరిగిందని అధికారులు చెబుతున్నారు. జ్వర లక్షణాలు కనిపిస్తే డాక్టర్లను సంప్రదించి చికిత్స తీసుకోవాలని, సొంత వైద్యం చేసుకోవద్దని సూచిస్తున్నారు.