- ఇప్పటి వరకు 23 డెంగీ, రెండు మలేరియా కేసులు నమోదు
- పెరుగుతున్న సీజనల్ వ్యాధులు
- గ్రామాల్లో మారని పారిశుద్ధ్యం తీరు
- కలుషిత నీరు, అపరిశుభ్రతతోనే వ్యాధుల వ్యాప్తి
- జిల్లాలో 110 హైరిస్క్ గ్రామాలుగా గుర్తింపు
ఆదిలాబాద్, వెలుగు : జిల్లాలో సీజనల్ వ్యాధులు జోరందుకున్నాయి. డెంగీ, డయేరియా, మలేరియా, ఇతర వైరల్ ఫీవర్లతో జనాలు ఆస్పత్రుల పాలవుతున్నారు. ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లోని ప్రజలు వైరల్ఫీవర్లతో తీవ్ర ఇబ్బందులు పడుతూ ఆస్పత్రులకు క్యూ కడుతున్నారు. జిల్లాలో కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షాలతో పల్లెల్లో పారిశుద్ధ్యం పడకేసింది. ఆదిలాబాద్ రిమ్స్ హాస్పిటల్ కు వారం రోజుల నుంచి దాదాపు 100 కేసులు సీజనల్ వ్యాధులకు సంబంధించే వస్తున్నాయి. జ్వరం, ఒళ్లునొప్పులు, దగ్గు వంటి వాటితో ఎక్కువగా హాస్పిటల్ కు వస్తున్నారు. దీంతో ఉదయం నుంచి ఓపీ దగ్గర రోగులు బారులు తీరుతున్నారు.
విలవిల్లాడుతున్న ఏజెన్సీ మండలాలు
జిల్లా వ్యాప్తంగా ప్రస్తుతం డెంగీ కేసులు భయపెడుతున్నాయి. గత ఆరు నెలల్లో మొత్తం 23 కేసులు నమోదు కాగా.. ఈ ఒక్క నెలలోనే ఐదు కేసులు నమోదయ్యాయి. రెండు మలేరియా, వెయ్యికి పైగా వైరల్ ఫీవర్లు, 8500 డయేరియా కేసులు నమోదయ్యాయి. ముఖ్యంగా ఏజెన్సీ మండలాలైన ఇంద్రవెల్లి, ఉట్నూర్, గాదిగూడ, సిరికొండ, నార్నూర్ గుడిహత్నూర్ ప్రాంతాల్లో డెంగీతో పాటు వైరల్ ఫీవర్ కేసులు విజృంభిస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా గతంలో నమోదైన డెంగీ, డయేరియా, మలేరియా కేసులను పరిగణలోకి తీసుకొని మొత్తం110 గ్రామాలను హైరిస్క్‌గా గుర్తించారు.
ఈ నేపథ్యంలోనే జిల్లాలో ఇప్పటికే ర్యాపిడ్ రెస్పాన్స్ టీంను ఏర్పాటు చేశారు. వీరితో పాటు ప్రత్యేకంగా ఏజెన్సీ మండలాల 16 పీహెచ్‌సీల పరిధిలో ర్యాపిడ్ ఫీవర్ సర్వే నిర్వహిస్తున్నారు. ఈ సర్వే సెప్టెంబర్ వరకు కొనసాగుతుందని అధికారులు చెబుతున్నారు. జ్వరాల మందులతోపాటు ఈ సీజన్లోనే పాముకాటు ప్రమాదాలు సైతం ఎక్కువగా ఉండటంతో.. వాటికి విరుగుడైన యాంటీ స్నేక్ వీనమ్ ను అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు.
కార్మికుల సమ్మెతో..
ప్రతి ఏడాది ఈ సీజన్లో ఏజెన్సీ గ్రామాలన్నీ వ్యాధుల బారిన పడుతున్నాయి. ముఖ్యంగా కలుషిత నీటితోపాటు రోడ్లు, డ్రైనేజీలు లేకపోవడంతో పరిసరాలు అపరిశుభ్రంగా మారి మలేరియా, డెంగీ కేసులు నమోదవుతున్నాయి. దీనికితోడు ప్రస్తుతం గ్రామ పంచాయతీ కార్మికులు సమ్మెలో ఉండటంతో పరిస్థితి అధ్వానంగా మారింది. పట్టణ శివారు ప్రాంతాలు కూడా అపరిశుభ్రంగానే కనిపిస్తు
న్నాయి. దోమ తెరల పంపిణీ, మురికి గుంతల్లో వేసే గంబూసియా చేపలు, యాంటీ లార్వా, ఆయిల్ బాల్స్, క్లోరినేషన్ ప్రక్రియ, ఫాగింగ్ చేయడంతోపాటు గిరిజన ప్రాంతాల్లో ప్రత్యేక ప్రణాళిక వంటి కార్యక్రమాలు ఇంకా కనిపించడం లేదు.
అప్రమత్తంగా ఉన్నాం..
సీజనల్ వ్యాధుల నియంత్రణ పట్ల వైద్యారోగ్యశాఖతో పాటు ఇతర అధికారులతో సమావేశం నిర్వహించి తగిన ఏర్పాట్లు చేశాం. ఇప్పటికే అన్ని పీహెచ్‍సీల్లోని సిబ్బందిని వ్యాధులపై అప్రమత్తం చేశాం. ఏజెన్సీ గ్రామాల్లో ఫీవర్ సర్వే జరుగుతోంది. అన్ని పీహెచ్‌సీల్లో మందులు అందుబాటులో ఉంచాం. --------------------నరేందర్ రాథోడ్, డీఏంహెచ్ఓ, ఆదిలాబాద్