- ఈ నెల జీజీహెచ్‌లో ఇప్పటిదాకా 103 కేసులు
- ప్రైవేటులో ఇంతకు మూడింతలు
- పెరుగుతున్న మరణాలు
- వైరల్ జ్వరాలతో వణికిపోతున్న ప్రజలు
నిజామాబాద్, వెలుగు : నిజామాబాద్ జిల్లాలో డెంగీ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. ఈ నెలలో ఇప్పటి వరకు కేసుల సంఖ్య 103 దాటగా మరణాలు నమోదు కావడం కలకలం రేపుతోంది. గవర్నమెంటు, ప్రైవేటు హాస్పిటళ్లు బాధితులతో నిండిపోతున్నాయి. పరిస్థితి చక్కదిద్దే చర్యలు ఆఫీసర్లు తీసుకోవడం లేదు. పల్లె ప్రజలకు అవగాహన కల్పించడంలో కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. మరో పక్క చిన్నా పెద్దాతేడా లేకుండా వందల మంది వైరల్ జ్వరాలతో అవస్థపడుతున్నారు.
ప్రతి రోజు డెంగీ నమోదు
జిల్లా హాస్పిటల్‌కు ఈ నెలలో 11వ తారీఖు మినహాయిస్తే ప్రతి రోజూ డెంగీ కేసులు వచ్చాయి. ఎలీజా టెస్ట్‌తో నిర్థారించాక బాధితులకు ట్రీట్మెంట్ అందిస్తున్నారు. ఇక ప్రైవేటు హాస్పిటల్లో చికిత్స పొందుతున్న వారు మూడు వందలు ఉంటారని అంచనా. ట్రీట్మెంటు స్టార్ట్ చేసిన కేవలం మూడు రోజులకు ఇందల్వాయి మండలం తిర్మన్‌పల్లికి చెందిన గాండ్ల సంజీవ్ (20) అనే యువకుడు మంగళవారం చనిపోయాడు. అప్పటికే తల్లిదండ్రులు సుమారు రూ.లక్షన్నర ఖర్చు చేశారు. జక్రాన్‌పల్లి మండలం అర్గుల్ గ్రామానికి చెందిన లక్ష్మీ డెంగీ లక్షణాలతో మృతి చెందింది. అంతకు ముందు ఎడపల్లి మండలంలో యువకుడు చనిపోయాడు.
బోధన్ మండలం కొప్పర్తి క్యాంపునకు చెందిన లక్ష్మయ్య (68) అనే వృద్ధుడు మరణం అంచులదాకా వెళ్లి చికిత్సతో కోలుకున్నాడు. సుమారు రూ.2 లక్షలు ట్రీట్మెంట్కు ఖర్చు చేశారు. అయితే డెంగీ మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఒక్క నిజామాబాద్ జీజీహెచ్ లో వైరల్ జ్వరపీడితులు ఇప్పటిదాకా 525 మంది నమోదయ్యారు. ప్రతి వంద మందిలో కనీసం 15 మంది వైరల్ జ్వరాలతో బాధపడుతున్నట్టు తెలుస్తోంది. జిల్లాలోని మిగితా అన్ని గవర్నమెంటు హాస్పిటల్స్, ప్రైవేటు కలిపితే వైరల్ బాధితులు రెండు వేల దాకా ఉండొచ్చు.
అలర్ట్ కాని యంత్రాంగం
వైద్య, మున్సిపల్, పంచాయతీ శాఖలు ఏకకాలంలో సమన్వయంతో పనిచేస్తేనే ప్రస్తుత పరిస్థితి గట్టెక్కే వీలుంది. డెంగీ కేసులు వస్తున్న ఏరియాల విజిట్ ను ఆఫీసర్లు దాదాపు మరిచారు. మీడియా ప్రశ్నించినప్పుడు ఏదో చేస్తామని చెబుతున్నారు తప్పితే ఇప్పుడున్న ఎమర్జెన్సీ వాతావరాణాన్ని సరిచేసేందుకు పూనుకోవడంలేదు. ఈ వర్షాకాలంలో మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీలు దోమల మందు పిచికారీ చేయలేదు. వర్షం నీటి గుంతలను తక్షణం పూడ్చేస్తే దోమల ఆవాసం తగ్గుతుందనే విషయాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు.
సొంత ఇంటి ఖాళీ జాగాలలో నీరు నిలువ ఉండకుండా ఓనర్లకు నోటీసులు ఇస్తామని ఇటీవల భారీ వర్షాలు కురిసినప్పుడు మున్సిపల్ కమిషనర్లందరూ ప్రకటించారు. ఎవరూ అమలు చేయలేదు. డెంగీ కేసులు రిజిస్టర్ అయిన ప్రాంతాలలో దోమల నిర్మూలనకు స్పెషల్ డ్రైవ్ నిర్వహించడంతో పాటు ప్రజలకు అవగాహన కల్పించాలి. కానీ ఆఫీసర్లు ఇవేమి పట్టించుకోకపోవడంతో దోమలు విజృంభిస్తున్నాయని ఆరోపణలు వస్తున్నాయి.
హెల్త్ ఆఫీసర్లు ఎక్కడ..?
వర్షాకాలంలో హెల్త్ ఆఫీసర్ల రోల్ అత్యంత కీలకం. హోటల్స్‌తో పాటు బయట ఆహార పదార్థాల విక్రయాలను పరిశీలించాల్సింది వారే. నగర పాలక సంస్థతో పాటు బోధన్, ఆర్మూర్, భీంగల్ మున్సిపాలిటీల్లో ఆ పోస్టులు ఏండ్ల తరబడి ఖాళీగా ఉన్నాయి. మినరల్ వాటర్ పేరుతో అనుమతులు లేకుండా వందల సంఖ్యలో నడుస్తున్న నీటి ప్లాంట్ల నీటి నాణ్యతను పరిశీలించే ఆఫీసర్లు లేకుండా పోయారు. వైరల్ జ్వరాల నుంచి కోలుకోవడానికి పరిశుభ్రమైన నీటిని తాగాలని డాక్టర్లు సూచిస్తున్నారు.