
వానాకాలం..వర్షాలతో పాటు..సీజనల్ వ్యాధులను వెంటపెట్టుకు వస్తుంది. ఈ వర్షాకాలంలో చాలా మంది జ్వరాల బారినపడతారు. మలేరియా, టైఫాయిడ్, చికున్ గున్యా, డెంగ్యూ వంటి జ్వరాలు జనాన్ని పట్టిపీడిస్తాయి. అయితే ఇందులో డెంగ్యూ జ్వరం అనేది చాలా ప్రమాదకరమైనది. ఈ వ్యాధి వచ్చిందంటే ఏర్పడకుండానే మన శరీరంలోని తెల్ల రక్తకణాలు భారీగా పడిపోతాయి, ఫలితంగా మనిషి ప్రాణాలు పోయేంత ప్రమాదం ఏర్పడుతుంది. డెంగ్యూ జ్వరం అనేది దోమల ద్వారా సంక్రమించే వైరల్ ఇన్ఫెక్షన్. ప్రత్యేకంగా ఈడిస్ ఈజిప్టి అనే దోమ ద్వారా డెంగ్యూ వ్యాధి వ్యాపిస్తుంది. దీనిని ఎల్లో ఫీవర్ మస్కిటో అనే పేరుతోనూ పిలుస్తారు. కాబట్టి..ఈ వర్షాకాలంలో మీతో పాటు..మీ పిల్లలను డెంగ్యూ నుంచి రక్షించుకోవాలంటే కొన్ని ముఖ్యమైన చర్యలు తీసుకోవాల్సిందే.
డెంగ్యూ వ్యాధి ఎలా వస్తుంది
డెంగ్యూ వైరస్ కలిగి ఉన్న దోమలు మనల్ని కుట్టడం ద్వారా డెంగ్యూ జ్వరం వస్తుంది. ఈ జ్వరం వచ్చిన వారిలో వైరస్ వారి శరీర రోగ నిరోధక వ్యవస్థపై ఎటాక్ చేస్తుంది. దీని వల్ల ప్లేట్‌లెట్ల సంఖ్య బాగా తగ్గిపోతుంది. దీంతో శరీర రోగ నిరోధక వ్యవస్థకు ఆ వైరస్‌పై పోరాడే శక్తి తగ్గుతుంది. క్రమంగా వైరస్ తీవ్రత ఎక్కువై జ్వరం పెరుగుతుంది. ఇది ప్రాణానికే ముప్పు.
డెంగ్యూ వ్యాధి లక్షణాలు
- డెంగ్యూ వచ్చిన వారిలో సహజంగానే 3 నుంచి 5 రోజుల వరకు ఆ లక్షణాలు కనిపించవు.
- కొందరికి ఆ జ్వరం వచ్చిన వెంటనే పలు లక్షణాలు కనిపిస్తాయి.
- డెంగ్యూ వచ్చిన వారికి 104 ఫారెన్‌హీట్ డిగ్రీల జ్వరం ఉంటుంది.
- తలనొప్పి, కండరాలు, ఎముకలు, కీళ్ల నొప్పులు బాగా ఉంటాయి.
- వికారంగా వాంతులు వచ్చినట్లు అనిపిస్తుంది. కొందరిలో వాంతులు కూడా అవుతాయి.
- కళ్ల వెనుక నొప్పిగా ఉన్నట్లు అనిపిస్తుంది. ఉమ్మినీటి గ్రంథులు వాపునకు లోనై కనిపిస్తాయి. శరీరంపై కొందరిలో ఎర్రగా దద్దుర్లు కూడా వస్తాయి
రెండో సారి డెంగ్యూ బారిన పడితే..
- డెంగ్యూ జ్వరం రెండో సారి లేదా మూడో సారి వచ్చిన వారిలో కొందరికి ప్రాణాంతక పరిస్థితులు ఏర్పడుతాయి. అలాంటి వారిలో ప్లేట్‌లెట్ల సంఖ్య వేగంగా తగ్గుతుంటుంది. అలాగే తీవ్రమైన జ్వరం ఉంటుంది.
- తీవ్రమైన కడుపునొప్పి, ఆగకుండా వాంతులు కావడం, చిగుళ్లు, ముక్కు నుంచి రక్తస్రావం అవడం, మూత్రం, మలం, వాంతిలో రక్తం పడడం జరుగుతుంది.
- చర్మం కింద గాయాలు కావడం, రక్తస్రావం కనిపించడం, శ్వాస తీసుకోవడం ఇబ్బంది అవడం లేదా వేగంగా శ్వాస తీసుకోవడం, చల్లని చర్మం, తీవ్రమైన అలసట, విసుగు ఉంటాయి.
- పై లక్షణాలు కనిపిస్తే డెంగ్యూ జ్వరం తీవ్రత ఎక్కువగా ఉందని అర్థం చేసుకోవాలి. ఏమాత్రం నిర్లక్ష్యం, ఆలస్యం చేయకుండా వెంటనే వైద్యున్ని కలిసి పరీక్షలు చేయించుకుని చికిత్స తీసుకోవాలి.
డెంగ్యూ వ్యాధి నుంచి కోలుకునే మార్గాలు
- డెంగ్యూ వ్యాధి సోకితే తప్పనిసరిగా ఆసుపత్రికి వెళ్లాలి. హైడ్రేటెడ్‌గా ఉండాలి. పుష్కలంగా నీరు తాగాలి. రోజుకు కనీసం 3- నుంచి 4 లీటర్ల నీరు తాగాలి. కొబ్బరినీరు కూడా తాగాలి. డెంగ్యూ జ్వరం వచ్చినప్పుడు రోగి శరీరం డీహైడ్రేషన్‌కు గురికాకుండా చూసుకోవాలి.
- ప్లేట్ లెట్ల సంఖ్య పెంచే బొప్పాయి, కివీస్ వంటి పండ్లు తినాలి. డెంగ్యూ జ్వరంతో బాధపడుతున్నట్లయితే ఆకు కూరలు ఎక్కువ తినాలి. ఆరోగ్యకరమైన, సమతుల్య ఆహారం తీసుకోవాలి. పోషకాలు ఎక్కువగా ఉండే, సులభంగా జీర్ణమయ్యే ఖిచ్డీ, ఓట్మీల్, కాయధాన్యాలు వంటి ఆహారాలను తీసుకోవడం మంచిది. సరిపడా విశ్రాంతి తీసుకోవాలి.
- డెంగ్యూ దోమలు ముఖ్యంగా ఉదయం 7 నుండి 9 గంటల సమయం వరకు, అలాగే సాయంత్రం 5 నుండి 6 గంటల మధ్య ఎక్కువగా కుడతాయి. కాబట్టి ఈ సమయంలో కుట్టే దోమలపై జాగ్రత్తగా ఉండాలి. ఈ దోమలు చీలమండలు, మోచేతుల దగ్గర ఎక్కువగా కుడతాయి. కాబట్టి ఇది కూడా గమనించాలి. అవసరమైతే, ఆ భాగాల్లో దోమలు కుట్టకుండా మీరు దోమల క్రీములు కూడా రాసుకోవచ్చు.
డెంగ్యూ రాకుండా ఉండడానికి ఏం చేయాలంటే..
డెంగ్యూ జ్వరానికి ఎలాంటి వ్యాక్సిన్ లేదు. అయితే దోమలు కుట్టకుండా జాగ్రత్తగా ఉండటం చాలా అవసరం. దోమలు కుట్టడం వలన డెంగ్యూ వస్తుంది అని గుర్తించి తప్పకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.ముఖ్యంగాచిన్న పిల్లలు దోమలు కుట్టకుండా చూసుకోవాలి.
- ఇంటి ఆవరణలో, మీ ఇంట్లో ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉండేటట్లు చూసుకోవాలి.
- దోమలు కుట్టకుండా ఉండడానికి క్రీమ్ రాసుకోవాలి. దోమలు మీ ఇంట్లో ఉండకుండా ఉండడానికి దోమల మందు, లిక్విడ్స్ లాంటివి వాడాలి.
- బయటకు వెళ్ళినప్పుడు పొడవు చేతులు ఉండే షర్ట్, కుర్తీస్ లాంటివి వేసుకోవాలి. సాక్సులు కూడా ధరించి వెళ్లాలి. దీంతో కాళ్ళకి, చేతులకి దోమలు కుట్టవు.
- ఇంట్లో మస్కిటో నెట్స్ వంటివి వాడాలి. దీని వల్ల దోమలు కుట్టకుండా జాగ్రత్త పడొచ్చు.
- దోమలు ఎక్కువగా సంచరించే చోట్ల నుండి నీళ్లు తెచ్చుకోవద్దు.
- ఇంట్లో పాత సామాన్లు ముఖ్యంగా పాత టైర్లు, క్యాన్స్, పూల కుండీలు మొదలైన వాటిలో నీళ్లు ఎక్కువగా చేరిపోతాయి. వీలైనంతవరకు పాత సామాన్లని నీళ్ళు తగలకుండా ఉంచుకోవాలి. అక్కడ దోమలు ఎక్కువగా చేరుతాయి. దీని వల్ల దోమలు పెరిగే అవకాశం ఉంది.
- ఇంట్లో వాడే కూలర్‌లో నీళ్లు ఎప్పటికప్పుడు మారుస్తూ ఉండాలి. ఇంట్లో పెంపుడు జంతువులకు ఉపయోగించే డిష్‌లో నీళ్లు ఎక్కువగా చేరుతాయి. వాటిని కూడా శుభ్రంగా పొడిగా ఉంచుకోవాలి.
- ఇంట్లో ఎవరైనా డెంగ్యూ బారిన పడితే మిగిలిన కుటుంబ సభ్యులు కూడా సురక్షితంగా ఉండాలి. దోమలు కుట్టకుండా వీలైనంత జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం.