ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మళ్లీ డెంగ్యూ డేంజర్​ బెల్స్!

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మళ్లీ డెంగ్యూ డేంజర్​ బెల్స్!
  • ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పెరుగుతున్న జ్వరాలు
  • హైరిస్క్​ గ్రామాల్లో  వైద్య క్యాంపుల ఏర్పాటు 
  • పరిశుభ్రత పాటించాలంటున్న అధికారులు 
  • ముందస్తు చర్యలు తీసుకోవాలని కోరుతున్న ప్రజలు 

ఖమ్మం, వెలుగు : ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పలు గ్రామాల్లో మళ్లీ డెంగ్యూ, విష జ్వరాలు వ్యాపిస్తున్నాయి. క్రమంగా ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులకు జ్వర పీడితుల రాక పెరుగుతోంది. ఈ ఏడాది ఇప్పటికే ఉమ్మడి జిల్లాలో 200కు పైగా డెంగ్యూ కేసులు నమోదైనట్లు తెలుస్తోంది. కానీ అధికారులు మాత్రం వైరల్​ ఫీవర్​గా  చెబుతున్నారు. మంచుకొండ, చింతకాని, వల్లభి, ఎంవీపాలెం, పెద్దగోపతి పీహెచ్​సీల పరిధిలో 15 గ్రామాల్లో పది మందికి పైగా డెంగ్యూ బాధితులున్నారు. తిరుమలాయపాలెం మండలం జల్లేపల్లిలో 20 మందికి పైగా జ్వరంతో బాధపడుతున్నారు. ఎక్కువ కేసులు వచ్చిన గ్రామాలను గుర్తించి వైద్యశాఖ అధికారులు ప్రత్యేక వైద్య క్యాంపులు నిర్వహిస్తున్నారు. 

ఔట్​ పేషెంట్ల సంఖ్య పెరుగుతోంది.. 

ఖమ్మం జిల్లాలో గత వారం రోజుల నుంచి ఒక్కో పీహెచ్​సీకి రోజూ 100 మందికి పైగా ఔట్ పేషెంట్లు వస్తున్నారు. వీరిలో జ్వరం, ఇతర లక్షణాలున్న 20 నుంచి 30 మంది వరకు యావరేజీగా బ్లడ్ శాంపిల్ సేకరించి టెస్టులకు పంపిస్తున్నారు. ఖమ్మంలోని ప్రభుత్వాస్పత్రికి గత నెల వరకు రోజుకూ యావరేజీగా వెయ్యికి లోపు ఔట్ పేషెంట్ల సంఖ్య నమోదు అవుతుండగా, ఈ నెలా మొదటి నుంచి మాత్రం ఓపీ సంఖ్య 1500 వరకు పెరిగింది. 

నిర్లక్ష్యంతోనే.. 

వర్షాకాలంలో పారిశుధ్యాన్ని నిర్లక్ష్యం చేయడం, మురుగునీరు నిలిచిపోవడం, మిషన్​ భగీరథ నీళ్ల పైప్​ లైన్లు డ్యామేజీ కారణంగా కలుషిత నీరు రావడం, ఇలాంటి కారణాల వల్ల​ రోగాల బారిన పడుతున్నారు. శుభ్రత లేక దోమల వ్యాప్తి పెరుగుతోంది. ఈ పరిస్థితి కల్లూరులో ఎక్కువగా ఉంది. రెండేళ్ల కింద కల్లూరులోని అంబేద్కర్​ కాలనీలో 60కి పైగా డెంగ్యూ కేసులు నమోదు కావడంతో ప్రత్యేక క్యాంపులను ఏర్పాటు చేశారు. మళ్లీ అలాంటి పరిస్థితి రాకుండా అధికారులు ముందు జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నారు. అధికారులు మాత్రం ప్రతి ఒక్కరూ పరిసరాలు శుభ్రంగా ఉండేలా చూసుకోవాలని సూచిస్తున్నారు. 

కొన్ని కేసులు పరిశీలిస్తే.. 

ఐదు రోజుల కింద ఖమ్మంలోని రాధాకృష్ణ నగర్​ లో నివసించే డాక్టర్​నాగారపు దిలీప్​(35) డెంగ్యూతో చికిత్స పొందుతూ చనిపోయారు. వారం రోజుల పాటు జ్వరానికి మందులు వాడినప్పటికీ తగ్గకపోవడంతో రక్త పరీక్షలు చేయించారు. డెంగ్యూ అని నిర్ధారణ కాగా ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్చి చికిత్స చేస్తుండగా  ఇంటర్నల్ ఆర్గాన్స్ డ్యామేజీ అయ్యి సోమవారం చనిపోయాడు.  ఖమ్మం జిల్లాలోని కారేపల్లి మండలం బస్వాపురంలో రెండు వారాల నుంచి వైరల్ ఫీవర్స్ తో ఇబ్బంది పడుతున్నారు. ప్రతి ఇంటికీ జ్వర పీడితులు ఉన్నారు.

కాళ్లు చేతుల నొప్పులు, కొందరికి కాళ్లు వాపులు కూడా రావడంతో ఇబ్బంది పడుతున్నారు.  బస్వాపురం గ్రామానికి చెందిన భానోత్ హనుమ అతడి కుమారుడు, కూతురు 12 రోజులుగా జ్వరం ఒళ్లు నొప్పులతో బాధపడుతూ కారేపల్లి ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందారు. జ్వరం వచ్చిన తర్వాత మందులు వాడినప్పుడు తగ్గి మళ్లీ వస్తుండటంతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. కామేపల్లి మండలంలో ఇప్పటివరకు మూడు డెంగ్యూ కేసులు నమోదయ్యాయి. రాయిగూడెంలో మార్చి నెలలో ఒక కేసు, లాల్య తండాలో ఏప్రిల్ నెలలో ఒక కేసు, పండితాపురంలో జూన్ 26న ఒక డెంగ్యూ కేసు 
నమోదైంది.

చర్యలు తీసుకుంటున్నాం.. 

వర్షాల కారణంగా సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందుతున్నాయి. జిల్లాలో డెంగ్యూ, విషజ్వరాలు వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకుంటున్నాం. జ్వరాలన్నీ డెంగ్యూ అని ప్రజలు ఆందోళన చెందవద్దు. ఎలీషా టెస్ట్ ద్వారా నిర్థారించిన తర్వాత డెంగ్యూ కేసులను నిర్ధారిస్తున్నాం. ఎక్కడైనా జ్వరాలు ఎక్కువగా నమోదైతే ప్రత్యేక వైద్యశిబిరాలను ఏర్పాటుచేస్తున్నాం.

మాలతి, డీఎంహెచ్​వో, ఖమ్మం