ఒకే దోమ.. రెండు వ్యాధులు..హైదరాబాద్లో డెంగ్యూ, చికున్​గున్యా గుబులు

ఒకే దోమ.. రెండు వ్యాధులు..హైదరాబాద్లో డెంగ్యూ, చికున్​గున్యా గుబులు

సిటీ ప్రజల్లో డెంగ్యూ గుబులు రేపుతోంది. ఈ జ్వరాలే చికున్​గున్యాకు దారి తీస్తున్నాయని వైద్యులు చెబుతున్నారు. ట్రాపికల్ ఫీవర్ ప్యానెల్ పరీక్షల్లో ఇది నిర్ధారణ అయ్యిందని అంటున్నారు. ఇటీవల అధికంగా జ్వరం, కీళ్లనొప్పులు ఉన్న రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించగా, వారిలో పలువురికి  ​చికున్​గున్యా ఉన్నట్లు తేలింది.

సికింద్రాబాద్​, వెలుగు : ఏడిస్ ఈజిప్టి దోమ రెండు రకాల వ్యాధులకు కారణమమవుతోంది. ఈ దోమ కాటుతో డెంగ్యూ జ్వరం వస్తుందని అందరికీ తెలిసిందే. అయితే, ఈ వ్యాధి లక్షణాలు ముదిరి చికున్​గున్యాగా మారుతోంది. అకస్మాత్తుగా జ్వరం రావడం, తలనొప్పి, కళ్ల కింద వాపు, చర్మంపై రాషెస్​ ఏర్పడటం డెంగ్యూ ఫివర్​ లక్షణాలు. విపరీతమైన జ్వరం, కడుపునొప్పి, తరచూ వాంతులు రావడం, ముక్కు నుంచి రక్తం కారడం, తీవ్రమైన అలసట,ప్లేట్​లెట్స్​ కౌంట్ తగ్గడం వంటివి చికున్​గున్యా లక్షణాలు.

డెంగ్యూ నెగెటివ్​గా వస్తున్నప్పటికీ.. 

అయితే, డెంగ్యూ సోకిన చాలా మందిలో ఆ వ్యాధిని ఎదుర్కొనేందుకు అవసరమైన రోగనిరోధక శక్తిని పెంపొందించే యాంటీబాడీలు ఉంటాయని నల్లకుంటలోని ఫీవర్​ఆస్పత్రి వైద్యులు తెలిపారు. కానీ, చికున్​గున్యా వైరస్​ను ఎదుర్కొనేంతగా శరీరంలో యాంటీబాడీలు ఉండవని అంటున్నారు. అటువంటి వారు ఏడిస్ ఈజిప్టి దోమ కాటుతో చికున్​గున్యాకు గురయ్యే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. జ్వరంతో పలువురికి డెంగ్యూ పరీక్షలో​ నెగెటివ్​గా వస్తున్నప్పటికీ.. ఇతర లక్షణాలు ఉన్నట్లైతే చికున్​గున్యాగా నిర్ధారించి చికిత్సలు అందిస్తున్నట్లు వివరించారు. నగరంలో 10 రోజులుగా ప్రతిరోజూ 3 నుంచి -4 చికున్ గున్యా కేసులు నమోదవుతున్నాయని పేర్కొన్నారు. చికున్​గున్యా సోకిన వారికి  భవిష్యత్తులో దీర్ఘకాలిక ఆర్థ రైటిస్ వచ్చే ప్రమాదం ఉందని అభిప్రాయపడుతున్నారు. వర్షాకాలం ప్రారంభం కావడంతో కాలనీలు, బస్తీల్లో దోమలు వృద్ధి చెందకుండా ఫాగింగ్​చర్యలను జీహెచ్ఎంసీ ముమ్మురం చేయాలని, ప్రజలు సైతం పరిసరాల్లో నీరు నిల్వకుండా పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచిస్తున్నారు. వ్యాధి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని చెబుతున్నారు.