- ప్రమోషన్ తర్వాత ఏర్పడిన ఖాళీలు ఫిలప్
నిజామాబాద్, వెలుగు: ఎస్జీటీలకు స్కూల్అసిస్టెంట్ప్రమోషన్ల తర్వాత మిగిలిన వారి ట్రాన్స్ఫర్లను డీఈవో దుర్గాప్రసాద్ సోమవారం పూర్తి చేశారు. ఈ క్రమంలో మొత్తం 1,321ఎస్టీజీలు బదిలీ అయ్యారు. జీవో 25 ప్రకారం 19 మంది స్టూడెంట్స్‌కు ఒక టీచర్ లెక్కన వెకెన్సీలు చూపి ట్రాన్స్ఫర్ ఆర్డర్స్ జారీ చేశారు. బదిలీ అయ్యే టీచర్ స్థానంలో మరొకరురాని సందర్భంలో వారిని ఎట్టి పరిస్థితిలో రిలీవ్ చేయొద్దని ఎంఈవోలను ఆదేశించారు.
రిటర్మెంట్‌కు మూడేళ్ల సర్వీసు మాత్రమే ఉన్న ఎస్టీజీలకు ట్రాన్స్ఫర్ నుంచి మినహాయింపునిచ్చారు. ఒక బడిలో జూన్1కి కనీసం రెండేండ్లు పనిచేసిన టీచర్లకు బదిలీకి ఎలిజిబిలిటీ ఫిక్స్ చేసి, ఎనిమిదేండ్లు దాటిన ఎస్జీటీలకు తప్పనిసరి ట్రాన్స్ఫర్ అమలు చేశారు. సీనియారిటీ లిస్టును ఆన్లైన్లో ప్రదర్శించి బదిలీ చేసిన టీచర్లకు వెబ్ ఆప్షన్లో వారు కోరిన స్కూల్స్ ఎలాట్ చేశారు. దీంతో తొమ్మిదేండ్ల నుంచి నానుతూ వచ్చిన ఎస్జీటీల ప్రమోషన్లు పూర్తికాగా ట్రాన్స్ఫర్లూ ముగిశాయి.
846 మందికి ప్రమోషన్ బెనిఫిట్
జిల్లాలో లోకల్ బాడీస్, గవర్నమెంట్ కలిపి 693 ప్రైమరీ, 116 అప్పర్ ప్రైమరీ, 230 హైస్కూల్స్ ఉన్నాయి. గత సెప్టెంబర్ నెలలో గెజిటెడ్ హెచ్ఎంలు, స్కూల్ అసిస్టెంట్ల ట్రాన్స్ఫర్లు జరిగాయి. ఫలితంగా ఏర్పడిన ఖాళీలను అర్హతగల ఎస్జీటీలకు ప్రమోషన్లు ఇచ్చి నింపాలని ఆఫీసర్లు నిర్ణయించారు. అయితే ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎంలకు పదోన్నతుల విషయంలో వివాదం తలెత్తగా తరువాతి ప్రక్రియ మొత్తం ఆగిపోయింది.
దీనిని సక్సెస్‌ఫుల్‌గా హ్యాండిల్ చేయాలని విద్యాశాఖ ఆఫీసర్లను గవర్నమెంట్ ఆదేశించడంతో కదలిక వచ్చింది. ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎంలతో పాటు తొమ్మిదేండ్లుగా ప్రమోషన్ కోసం ఎదురుచూసిన భాషా పండిత్, పీఈటీలకు మేలు చేసేలా నిర్ణయాలు వెలువడ్డాయి. ఎస్జీటీలు, పీఈటీ, భాషా పండిత్‌లు మొత్తం 846 మంది ప్రమోషన్లు పొంది కొత్త బడులలో జూన్ 20న జాయిన్ అయ్యారు. దీంతో జిల్లాలో అప్పటికే వెకెంట్గా ఉన్న 394 టీచర్ పోస్టులకు తోడు ప్రమోషన్లతో ఏర్పడిన ఖాళీలు కలిపి ప్రైమరీ స్కూళ్లలో మొత్తం 1,321 ఖాళీలు ఏర్పడ్డాయి. వాటిని సోమవారం ట్రాన్స్ఫర్లతో సర్దుబాటు చేశారు.
భారీ కసరత్తు
టీచర్ల ప్రమోషన్‌ల టైంలో కొన్ని ఆరోపణలు రావడంతో ఎస్జీటీల బదిలీ విషయంలో ఆఫీసర్లు జాగ్రత్తలు పాటించారు. జూన్ 1 కటాఫ్‌తో ఒక స్కూల్లో కనీసం రెండేండ్ల సర్వీస్ పూర్తి చేసుకొని ట్రాన్స్ఫర్ కావాలనుకుంటున్న టీచర్లు దరఖాస్తు చేసుకోడానికి విడిగా సమయం ఇచ్చారు. డీఈవో దుర్గాప్రసాద్ సీనియారిటీ లిస్టును ప్రిపేర్ చేసి డీఎస్‌ఈకి (స్కూల్ డైరెక్టరేట్)కు పంపారు. లిస్టుపై అభ్యంతరాలు తెలపడానికి టీచర్లకు డీఎస్ఈ రెండు రోజుల సమయం ఇచ్చి ఆమోదం తెలిపాకే ఫైనల్ ట్రాన్స్ఫర్ ఆర్డర్స్ సోమవారం విడుదల చేశారు.
19 మంది స్టూడెంట్స్‌కు ఒక టీచర్ ప్రామాణికంగా నిర్ణయాలు తీసుకునప్పటికీ బదిలీ అయిన టీచర్ స్థానంలో కొత్తగా మరొకరు రాని పక్షంలో రిలీవ్ చేయకుండా ఎంఈవో, హెడ్మాస్టర్లకు అధికారాలు ఇచ్చారు. అలా ఎంత మంది ఉన్నారనే సంగతి మంగళవారం తేలనుంది. సోమవారం నాటి ట్రాన్స్‌ఫర్స్‌పై కూడా అభ్యంతరాలు తెలపడానికి రెండు రోజుల ఛాన్స్ ఇచ్చారు.
వీవీలతో తాత్కాలిక చెక్
ఎస్జీటీల ప్రమోషన్, ట్రాన్స్ఫర్స్ తరువాత ఇంకా ఖాళీలున్నాయి. హైస్కూల్స్, అప్పర్ ప్రైమరీ, ప్రైమరీ పాఠశాలల్లో ఖాళీలు కొత్త భర్తీలతోనే నిండుతాయి. డీఎస్సీ నిర్వహణకు గవర్నమెంట్ ఒకపక్క సన్నాహాలు చేస్తోంది. అయితే కొత్త టీచర్ల అపాయింట్మెంట్ పూర్తయ్యేదాకా విద్యావాలంటీర్లతో భోదనపరమైన ఇబ్బందులు అధిగమించే ఆలోచనతో ఉంది.