
నస్పూర్, వెలుగు: విద్యార్థుల కోసం వేసవి విజ్ఞాన శిబిరం ఏర్పాటు చేశామని మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని సైన్స్ కేంద్రంలో ఏర్పాటు చేసిన సైన్స్ వేసవి శిబిరాన్ని- డీఈవో ఎస్.యాదయ్య, సైన్స్ అధికారి మధుబాబుతో కలిసి ప్రారంభించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. నిత్య జీవితంలో సైన్స్ ఎంతగా ఉపయోగపడుతుందో విద్యార్థులు నిశితంగా గమనించాలని, వాటి వెనుక ఉన్న సూత్రాలను అర్థం చేసుకోవాలన్నారు.
సైన్స్సూత్రాలను తెలుసుకునేందుకు ఈ శిబిరం ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ఎండల నేపథ్యంలో జాగ్రత్తలు పాటించాలని విద్యార్థులకు సూచించారు. ఇప్పటి వరకు 186 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారని, వారిలో 120 మందికి అవకాశం కల్పించామని చెప్పారు. కార్యక్రమంలో జిల్లా సెక్టోరల్ అధికారులు చౌదరి శ్రీనివాస్, సత్యనారాయణమూర్తి, జిల్లా ఉమ్మడి పరీక్షల విభాగం కార్యదర్శి మహేశ్వర్రెడ్డి, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.