కోతులకు ఆహారం వేస్తే ఇక కేసులే

కోతులకు ఆహారం వేస్తే ఇక కేసులే
  • అది ఫారెస్ట్ యాక్ట్ 1967 ప్రకారం నేరం
  • సహజ జీవనశైలిని కోల్పోతున్న వానరాలు
  • పండ్లు, కాయగూరల్లోని పెస్టిసైడ్స్​తో హాని 
  • కొత్త రోగాలతో మృత్యువాతపడుతున్న వైనం

మంచిర్యాల, వెలుగు: వానరాలను హనుమంతుడికి ప్రతీకగా భావిస్తుంటాం. దేవుడిపై భక్తిని కోతులపై ప్రదర్శిస్తుంటాం. వాటికి పండ్లు, కాయగూరలు, బిస్కట్లు, బ్రెడ్ వంటివి ఆహారంగా అందిస్తుంటాం. కొందరు ఫొటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టి మురిసిపోతారు. కానీ ఇలా కోతులకు ఆహారం వేయడం ఫారెస్ట్ యాక్ట్ 1967 ప్రకారం నేరమని ఆ శాఖ అధికారులు చెబుతున్నారు. చట్ట ప్రకారం బాధ్యులపై కేసులు నమోదు చేయడం, ఫైన్లు వేయడమే కాకుండా జైలు శిక్ష కూడా పడుతుందని హెచ్చరిస్తున్నారు. 

సహజ జీవనశైలికి విరుద్ధం 

కోతులు సాధారణం అడవిలో లభించే పండ్లు, దుంపలు తింటూ ఆకలి తీర్చుకుంటాయి. అడవుల్లో పండ్ల చెట్లు అంతరించిపోతుండడంతో వానరాలకు ఆహారం కరువైంది. ఆకలి తీర్చుకునేందుకు ఊళ్లలోకి వస్తున్నాయి. ఇండ్లు, షాపుల్లోకి చొరబడి కనిపించిన వస్తువులను ఎత్తుకెళ్తున్నాయి. దీనికితోడు కొంతమంది జంతు ప్రేమికులు, హనుమాన్ భక్తులు కోతులకు ఆహారంగా అరటిపండ్లు, పుచ్చకాయలు, దోసకాయలు, సంత్రాలు, టమాటాలు, క్యారెట్, బిస్కట్లు, బ్రెడ్, పుట్నాలు వంటివి అందిస్తున్నారు. జీవకారుణ్యం పేరిట అడవుల్లోకి ఆహారం తీసుకెళ్లి కోతుల గుంపులు ఉన్న దగ్గర వేస్తున్నారు. అయితే ఇలాంటి ఫుడ్​కు అలవాటుపడ్డ కోతులు వాటి సహజ జీవనశైలిని కోల్పోతున్నాయి. అడవుల్లో పండ్ల కోసం అన్వేషించడం మర్చిపోయి.. జనాలు వేసే ఆహారం కోసం రోడ్లపై బారులుతీరి ఎదురుచూస్తున్న దృశ్యాలు చాలాచోట్ల కనిపిస్తున్నాయి.   

జన్నారం, జైపూర్ అడవుల్లో.. 

మంచిర్యాల జిల్లా కవ్వాల్ టైగర్ జోన్ పరిధిలోని జన్నారం అడవుల్లో, జైపూర్, భీమారం మండలాల్లోని రిజర్వ్ ఫారెస్టులో రోడ్లపై కోతులకు ఆహారం వేసే స్పాట్స్​ను ఫారెస్టు ఆఫీసర్లు గుర్తించారు. అలాగే ర్యాలీ అడవిలో సైతం కొంతమంది కోతులకు ఆహారం అందిస్తున్నట్టు అధికారుల దృష్టికి వచ్చింది. ఇక మంచిర్యాల–చెన్నూర్ రూట్​లోని జైపూర్, భీమారం మండలాల పరిధిలో నేషనల్ హైవే 63పై ఎక్కడ చూసినా కోతుల గుంపులే కనిపిస్తుంటాయి. జన్నారం ఫారెస్టు పరిధిలోని నిర్మల్, ఆదిలాబాద్ రూట్లలో కూడా ఇదే పరిస్థితి. జనాలు వేసే తిండికి అలవాటుపడి దారిలో వచ్చిపోయే వాహనాల వెంట పడుతుంటాయి. ఆహారం దొకరని సంద ర్భాల్లో బైక్​లపై వెళ్తున్నవారిపై దాడులు చేసిన ఘటనలు కూడా ఉన్నాయి. అలాగే ఆహారం కోసం వాహనాల వెంటపడుతూ వాటి కిందపడి చనిపోతున్నాయి. 

కేసులు పెడుతున్న అధికారులు

కోతులకు ఆహారం వేస్తూ వాటి సహజ జీవనశైలిని దెబ్బతీయడమే కాకుండా పండ్లు, కాయగూరల్లో ఉండే పెస్టిసైడ్స్ కారణంగా పలురకాల రోగాలు వచ్చి మృత్యువాతపడుతున్నాయి. దీనిని కంట్రోల్ చేయడానికి ఫారెస్టు అధికారులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఫారెస్ట్ యాక్ట్ 1967 సెక్షన్ 20 ప్రకారం రిజర్వ్ ఫారెస్ట్​లోకి అక్రమంగా చొరబడడమే కాకుండా వన్యప్రాణుల హ్యాబిటేషన్​ను డిస్ట్రబ్ చేసిందుకు ట్రెస్​పాస్ కేసులు నమోదు చేస్తున్నారు. 

రూ.2వేల నుంచి రూ.4వేల వరకు ఫైన్లు వేస్తున్నారు. యానిమల్ ఫ్రెండ్స్ ట్రస్ట్ పేరిట జైపూర్, భీమారం ఫారెస్ట్​లో కొన్నేండ్లుగా కోతులకు ఆహారం అందిస్తున్న మంచిర్యాలకు చెందిన పద్మ సందేశ్ అనే యువకుడిపై కేసు నమోదు చేశారు. అలాగే ఇటీవల జైపూర్ సెక్షన్​లో రెండు కేసులు, భీమారం సెక్షన్​లో మరో కేసు పెట్టారు. పాత మంచిర్యాల సెక్షన్ పరిధిలోని తిమ్మాపూర్ బీట్​లో మంచిర్యాల హమాలివాడకు చందిన మిరియాల శివ, గడ్డం జగన్ కోతులకు ఆహారం అందించినందుకు వారిపై కేసు రిజిస్టర్ చేయడమే కాకుండా రూ.4వేల జరిమానా విధించారు. 

కృత్రిమంగా ఆహారం అందించొద్దు 

కొంతమంది వ్యక్తులు, ఎన్జీవోల ప్రతినిధులు అడవుల్లోకి వెళ్లి కోతులకు పండ్లు, కాయగూరలే కాకుండా బిస్కట్లు, బ్రెడ్ వంటి ఆహారం అందిస్తున్నారు. కోతులు వాటిని తింటూ సహజ జీవనశైలిని కోల్పోతున్నాయి. పెస్టిసైడ్స్ వల్ల రోగాలబారినపడి చనిపోతున్నాయి. ఇలా కోతులకు ఆహారం వేయడం చట్టరీత్యా నేరం. బాధ్యులపై కేసులు నమోదు చేయడంతో పాటు ఫైన్లు వేస్తున్నాం. ఎట్టిపరిస్థితుల్లో కోతులకు కృత్రిమంగా ఆహారం అందించవద్దు.

అత్తె సుభాష్​ (లక్సెట్టిపేట ఎఫ్ఆర్వో), రామకృష్ణ సర్కార్ (జైపూర్ ఎఫ్ఎస్వో)