అక్రమంగా వెళితే అరెస్ట్ చేయరా ఏంటీ.. సంకెళ్లు వేస్తారు : కేంద్ర మంత్రి జయశంకర్

అక్రమంగా వెళితే అరెస్ట్ చేయరా ఏంటీ.. సంకెళ్లు వేస్తారు : కేంద్ర మంత్రి జయశంకర్

భారతీయులను అమెరికా నుంచి ఇండియాకు తరలించే విషయంలో.. అమెరికా అధికారులు వ్యవహరిస్తున్న తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. యుద్ధ విమానాల్లో తరలించటం.. చేతులు, కాళ్లకు సంకెళ్లు వేస్తున్న తీరును జనం అంతా తప్పుబడుతుంటే.. కేంద్ర విదేశాంగ మంత్రి జయశంకర్ మాత్రం పార్లమెంట్ సాక్షిగా సమర్ధించుకున్నారు. 

అక్రమంగా వెళితే అరెస్ట్ చేయకుండా ఉంటారా.. సంకెళ్లు అనేవి అమెరికా పాలసీ అంటూ అమెరికాకు వత్తాసు పలికారు...అమెరికా భారతీయ అక్రమ వలసదారులకు కాళ్లకు సంకెళ్ళేసి పంపిస్తున్నారని.. దీనిపై కేంద్రం స్పందన ఏంటని కాంగ్రెస్ ప్రశ్నించగా... అక్రమ వలసదారులకు సంకెళ్లు వేయడం అమెరికా ఫెడరల్ పాలసీ అని మంత్రి జైశంకర్ బదులిచ్చారు.  అమెరికాలో అక్రమంగా ఉన్న వలసదారులను స్వదేశాలకు పంపడం కొత్తేమీ కాదని.. అక్రమ వలసలను ఎవరైనా అడ్డుకుంటారని అన్నారు. 

2009 నుంచే యూఎస్ వలసలను అడ్డుకుంటోందని.. అక్రమంగా ఉన్న అన్ని దేశాలవారిని యూఎస్ వెనక్కు పంపుతోందని అన్నారు. ఆప్ కి బార్ ట్రంప్ సర్కార్ అంటూ ఊదరగొట్టిన మోడీ ఇప్పుడేం చేస్తారంటూ నిలదీసింది కాంగ్రెస్. కొలంబియా వంటి చిన్న దేశం కూడా ట్రంప్ కి షాక్ ఇస్తే.. కేంద్రం ఏం చేస్తోందంటూ ప్రశ్నించింది కాంగ్రెస్. వలసదారులను తీసుకెళ్లిన యూఎస్ మిలిటరీ ప్లేన్ ను కొలంబియా తిప్పి పంపిందని.. కొలంబియా లాగా మనం ఎందుకు పంపలేదని నిలదీసింది కాంగ్రెస్.

ALSO READ | సముద్రంలో 12 గంటలు.. 45 కిలోమీటర్ల నడక.. దారిలో శవాలు.. ఇన్ని తిప్పలు పడ్డారా..?

అక్రమ వలసదారుల కాళ్లకు సంకెళ్ళేయటం అమానవీయమని ఆప్ పేర్కొంది. భారతీయులపై అమెరికా అమానుషంగా వ్యవహరిస్తోందని మండిపడింది ఆప్. మన విదేశాంగ విధానం సరిగా లేదని.. అమెరికా అనాగరికంగా ప్రవర్తిస్తోంటే కేంద్రం ఏం చేస్తోందంటూ మండిపడ్డాయి విపక్షాలు.