అసమ్మతి గళంపై వేటు మంచిది కాదు

ఇటీవల రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయాలకు సంబంధించి కొన్ని అనూహ్య పరిణామాలు జరిగాయి. ముఖ్యంగా రెండు రాష్ట్రాల సీఎంలు, అసమ్మతి నాయకులకు మధ్య జరిగిన సంఘటనలు జనం దృష్టిని ఎక్కువగా ఆకర్షించాయి. తెలంగాణలో సీఎం కేసీఆర్, మాజీ మంత్రి ఈటల రాజేందర్ మధ్య ఆసక్తికరమైన పోరాటం నడుస్తోంది. హుజూరాబాద్ ఉప ఎన్నిక వరకూ ఇది కొనసాగే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇదే సమయంలో ఏపీలో సీఎం జగన్మోహన్‌ రెడ్డి, ఎంపీ రఘు రామ కృష్ణంరాజు మధ్య పెద్ద డ్రామా నడుస్తోంది. ఇది నేషనల్ మీడియాలో కూడా సెన్సేషన్ అయింది. ఒక గొప్ప రాజకీయ నాయకుడు ప్రతీకారం లాంటి కారణాలతో వివాదాలను వ్యక్తిగతంగా మారకుండా చూసుకోవాలి. లేదంటే రెబల్స్‌ నుంచి ఊహించని ఎదురుదెబ్బలు తప్పవు.అసమ్మతివాదులను పార్టీ నుంచి బహిష్కరించడం ప్రమాదకరం. ఎందుకంటే వారిలో ఎవరు మీ ప్లేస్​లోకి వస్తారో మీకు తెలియదు. బహిష్కరించబడిన అసమ్మతివాదులు ప్రతీకారం తీర్చుకుని, ప్రధాని లేదా ముఖ్యమంత్రిని ఓడించిన చాలా సందర్భాలు మన దేశ చరిత్రలో ఉన్నాయి.

ఇందిరాగాంధీ: 1977లో ఇందిరా గాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు బాబూ జగజ్జీవన్‌రామ్, ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం హెచ్ఎం బహుగుణ కాంగ్రెస్ పార్టీని వీడారు. తమను ఇందిరాగాంధీ అవమానించారంటూ వారిద్దరూ 1977 ఫిబ్రవరి 2న పార్టీకి రాజీనామా చేశారు. కాంగ్రెస్ పార్టీ వారిద్దరిపై ద్రోహులుగా ముద్రవేసే ప్రయత్నం చేసింది. అయితే 1977లో ఇందిరాగాంధీ ఓడిపోవడానికి జగజ్జీవన్‌రామ్, బహుగుణ ప్రధాన కారణమని రాజకీయ విశ్లేషకులు చెబుతుంటారు. ఆ తర్వాత నుంచి ఇందిరకు భయపడే వారి సంఖ్య తగ్గింది.

రాజీవ్‌గాంధీ – వీపీ సింగ్: 1985లో రాజీవ్‌గాంధీ ప్రధానమంత్రి అయ్యారు. అయితే 1987 నాటికి రాజీవ్, అప్పటి ఆర్థిక మంత్రి వీపీ సింగ్ మధ్య బోఫోర్స్ స్కామ్ కారణంగా విభేదాలు మొదలయ్యాయి. వాటిని పరిష్కరించడానికి ఆసక్తి చూపని రాజీవ్.. వీపీ సింగ్‌ను పార్టీ నుంచి బహిష్కరించారు. ఆ పరిణామాలతో సింగ్ పని అయిపోతుందని ఆయన భావించారు. కానీ, 1989 డిసెంబర్‌‌లో రాజీవ్‌ గాంధీని ఓడించి మరీ వీపీ సింగ్ ప్రధానమంత్రి పీఠం ఎక్కారు.

మమతాబెనర్జీ: 1999లో మమతాబెనర్జీ ప్రత్యర్థులు ఆమెను కాంగ్రెస్ పార్టీ నుంచి బహిష్కరించేలా చేశారు. చివరికి తనను పార్టీ నుంచి బహిష్కరించొద్దని సోనియాగాంధీని కూడా మమతా బెనర్జీ కోరారు. అయితే ఎవరూ ఆమెను పట్టించుకోలేదు. దీంతో సొంతంగా పార్టీ పెట్టిన మమత 2011 నుంచి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా చక్రం తిప్పుతున్నారు. అదే సమయంలో బెంగాల్లో కాంగ్రెస్ పార్టీ తుడిచిపెట్టుకుపోయింది.

హిమంత బిశ్వశర్మ: 2016 వరకూ హిమంత బిశ్వశర్మ అస్సాంలో కాంగ్రెస్ గవర్నమెంట్‌లో మినిస్టర్‌‌గా ఉన్నారు. ఆ టైమ్​లో సీఎం తరుణ్ గొగోయ్ తనను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆయన రాహుల్‌‌‌‌ గాంధీకి కంప్లైంట్ చేశారు. అయితే ఆయనను రాహుల్‌‌‌‌ గాంధీ పట్టించుకోలేదు. దీంతో హిమంత కాంగ్రెస్​ను వీడి బీజేపీలో చేరారు. 2016లో అస్సాంలో కాంగ్రెస్ ఓటమికి కారణమయ్యారు. 2021లో రెండోసారి బీజేపీని గెలిపించి అస్సాం సీఎం సీటులో కూర్చున్నారు.

సహనం వహించాలి

రెబల్స్​ విషయంలో లీడర్లు కచ్చితంగా సహనం ప్రదర్శించాలి. రఘు రామకృష్ణం రాజు లేదా ఈటల రాజేందర్.. ముఖ్యమంత్రులను శాశ్వతంగా దెబ్బతీస్తారా అనేది మరొక విషయం. కానీ, ముఖ్యమంత్రులు సహనం, వ్యూహం, వివేకం ద్వారా ఇలాంటి పరిస్థితులను తప్పించగలగాలి. కె.కామరాజ్ వంటి గొప్ప కాంప్రమైజర్లు ఏం చేశారో ఇప్పటి ముఖ్యమంత్రులు చదవాలి. కామరాజ్ నాడార్ ‘‘కామరాజ్ ప్లాన్” సృష్టికర్త. దీని ద్వారా లాల్ బహదూర్ శాస్త్రి, జగజ్జీవన్ రామ్ వంటి వందలాది మంది సీనియర్ లీడర్లు రాజీనామా చేయవలసి వచ్చింది. అయితే వారిలో ఒక్కరికి కూడా కామరాజ్‌‌‌‌‌‌‌‌పై కోపం రాలేదు. ముఖ్యమంత్రులు నేర్చుకోవలసిన ఇలాంటి కొన్ని పాఠాలు ఉన్నాయి. సమస్య ఏమిటంటే.. పొగడ్తలు కురిపించే వారు చెప్పే మధురమైన మాటలు ఇష్టపడటం వల్ల ముఖ్యమంత్రులు ఇబ్బందుల్లో పడుతుంటారు. తన కిరీటాన్ని పోగొట్టుకున్న ప్రతి చక్రవర్తికి యుద్ధానికి వెళ్లడం లేదా తెలివి తక్కువ పనులు చేయడం వంటి కొన్ని కారణాలు ఉన్నాయి. అలనాటి కవి కాళిదాసు చెప్పిన మాటల కంటే కూడా పొగడ్తలు కురిపించే వారి మాటలు గొప్ప సంగీతంలా రాజకీయ నాయకులు భావిస్తారు. ఇలాంటి రాజకీయ హాస్య నాటకాల్లో రెండు రకాలైన పొగడ్తలు కురిపించే వారు ఉంటారు. తెలివైన వారు నిశ్శబ్దంగా ఉంటారు. నిశ్శబ్దంగా తల వంచుతారు. కానీ, ధైర్యంగా ఉండే వారు నాయకుడికి ఎన్నో ఇబ్బందులు కలిగించడానికి తమ 
మాటలను, శక్తిని ఉపయోగిస్తారు.

పొగడ్తలే దెబ్బ తీస్తున్నయ్ 

లీడర్లు చాలా తెలివైన వారు. కానీ ప్రతి ఒక్కరూ పొగడ్తలకు పడిపోతుంటారు. ప్రస్తుత పరిస్థితుల్లో నాయకుడికి వ్యతిరేకంగా మరింత కుట్రలు, అల్లర్లు సృష్టించే అవకాశం పొగడ్తలతో పడేసే వాళ్లకు లభిస్తుంది. కొన్నిసార్లు, ఇది చాలా ఫన్నీగా మారుతుంది. ఎందుకంటే ఇలాంటి వారు సృష్టించే ఇబ్బందుల్లో పెద్ద నాయకులు కూడా పడుతుంటారు. ఇదే సమయంలో తిరుగుబాటుదారులు మంచి పని చేస్తున్నారని వారికి కూడా రహస్యంగా చెబుతుంటారు. 1991లో పీవీ నరసింహారావు ప్రధానమంత్రి అయిన తర్వాత సీనియర్ కాంగ్రెస్ లీడర్ శివరాజ్‌ పాటిల్‌ను లోక్‌సభ స్పీకర్ చేశారు. పాటిల్ స్ట్రెయిట్ ఫార్వార్డ్​గా ఉండే మనిషి. ప్రభుత్వం తమకు నచ్చినట్టుగా చేయడానికి ఆయన అంగీకరించలేదు. కొందరు మినిస్టర్లు శివరాజ్ పాటిల్‌ను తప్పించాలని పీవీని కోరారు. వారికి పీవీ ‘‘ఆయనను తప్పించడం ద్వారా వచ్చే ఎక్కువ వివాదాల కంటే ఇప్పుడు చిన్న ఇబ్బందులు ఎదుర్కోవడం బెటర్‌‌’ అని సమాధానం చెప్పారు.

రెబల్స్‌‌‌‌‌‌‌‌తో సీఎంల ప్రతిష్టకు దెబ్బే

బహిష్కరణకు గురైన చాలా మంది రెబల్ లీడర్లు తమ పార్టీని వదిలి పెట్టిన తర్వాత చేసిన ప్రయత్నాల్లో సక్సెస్ కాలేకపోయారు. కానీ, పార్టీని విడిచిపెట్టినప్పుడు మాత్రం చాలా వివాదాలను సృష్టిస్తారు. ఇది పార్టీ నాయకుడికే డ్యామేజీ. రెండు తెలుగు రాష్ట్రాల్లో రఘు రామకృష్ణం రాజు, ఈటల రాజేందర్ రెబల్స్​గా మారిన తర్వాత ముఖ్యమంత్రుల ప్రతిష్ట దెబ్బతింది. సాధారణంగా అందరూ భావించేది ఏమిటంటే.. రాజకీయాల్లో ఒక మంత్రిపై వేటు వేస్తే, అతను జనానికి దూరమైపోతాడని. కానీ, ఆంధ్ర, తెలంగాణలో ఇద్దరు హైప్రొఫైల్ రెబల్స్ ముఖ్యమంత్రులపై నేరుగా ఎటాక్ చేస్తున్నారు. ఇది వారి ఇమేజ్‌‌‌‌‌‌‌‌ను దెబ్బతీస్తోంది. వారి పార్టీల్లోని చాలా మంది సభ్యులు కూడా రహస్యంగా సంతోషిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో నాయకుల మనస్సు-ఆలోచనలు అంతా ఇలాంటి దాడులపై దృష్టి పెడతాయి.

- పెంటపాటి పుల్లారావు, 
పొలిటికల్ ఎనలిస్ట్