నల్గొండ అర్బన్ , వెలుగు: నల్లగొండ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ లిమిటెడ్ ఆధ్వర్యంలో జనవరి 1వ నుంచి ఫిబ్రవరి 29వ వరకు డిపాజిట్ల సేకరణ మాస ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి తెలిపారు. సోమవారం నల్గొండలోని తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ... రైతులు, కస్టమర్ల శ్రేయస్సు కోసం బ్యాంకు నిరంతరం కృషి చేస్తుందని, ఇప్పటికే డీసీసీబీ పరిధిలో 665 కోట్ల డిపాజిట్లు ఉన్నాయన్నారు.
ఈ ఆర్థిక సంవత్సరానికి ఇంకా మూడు నెలల వ్యవధి ఉన్నప్పటికీ రూ. 103 కోట్ల గ్రోత్ పెరిగిందన్నారు. ఈ ఏడాది రూ. 23 కోట్ల గోల్డ్ లోన్లను ఖాతాదారులకు అందించామని, ఓవరల్‌గా రూ. 302 కోట్ల గోల్డ్ లోన్లు ఉన్నాయన్నారు. ఏ బ్యాంకులో లేనివిధంగా గ్రాముకు రూ. 4,500 చొప్పున రుణాలు ఇస్తున్నామని చెప్పారు. ధన సమృద్ధి డిపాజిట్ కాలపరిమితి 333 రోజులకు గాను 7.75 శాతం వడ్డీ, ధనవర్ష డిపాజిట్ లో 111 రోజుల కాలపరిమితికి 6.50 శాతం వడ్డీ అందిస్తున్నామన్నారు.
అనంతరం డీసీసీబీ క్యాలెండర్, డైరీని ఆయన ఆవిష్కరించారు. సమావేశంలో డైరెక్టర్లు పాశం సంపత్ రెడ్డి, గుడిపాటి సైదులు, అంజయ్య, రాఘవాచారి, రాంచందర్, జయరాం, బంటు శ్రీను, కరుణ, అనురాధ తదితరులున్నారు.