
డిప్రెషన్ అనేది ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందిని ప్రభావితం చేసే ప్రధాన మానసిక ఆరోగ్య సమస్య. ఇది సాధారణంగా దీర్ఘకాలిక నిరాశ, ఆసక్తి కోల్పోవడం, మానసిక శక్తిలేమి వంటి లక్షణాలతో వ్యక్తమవుతోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదికల ప్రకారం దాదాపు 5% మంది పెద్దలు డిప్రెషన్‌ను ఎదుర్కొంటున్నారు. దీని ప్రభావం వ్యక్తిగత జీవితంతోపాటు కుటుంబ, ఉద్యోగ, సామాజిక సంబంధాలపై కూడా స్పష్టంగా కనిపిస్తుంది.
దీన్ని నిర్లక్ష్యం చేస్తే కుంగుబాటు, ఆత్మహత్యకు దారితీసే ప్రమాదం పెరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. డిప్రెషన్‌ను సమర్థవంతంగా ఎదుర్కొనడానికి ముందుగా దీని లక్షణాలను గుర్తించడం చాలా ముఖ్యం. నిరాశ, ఆసక్తి కోల్పోవడం, ఏకాగ్రత లోపం, శక్తి తగ్గిపోవడం, చిరాకు, ఆందోళన, నిద్రలేమి, భోజనపు అలవాట్లలో మార్పు, అపరాధ భావం, ఆత్మహత్య ఆలోచనలు వంటి లక్షణాలు కనిపిస్తాయి.
దీన్ని అధిగమించడానికి మానసిక నిపుణుల సహాయం తీసుకోవడం, అవసరమైనప్పుడు మందుల ద్వారా చికిత్స పొందడం అవసరం. జీవన శైలిలో మార్పులు కూడా ఎంతో సహాయపడతాయి. శారీరక వ్యాయామం, పోషకాహారం, సరైన నిద్ర, ధ్యానం, యోగా వంటి సాధనాలు మానసిక ఉల్లాసాన్ని పెంచుతాయి.
కుటుంబ సభ్యులు, స్నేహితుల మద్దతు డిప్రెషన్‌ను అధిగమించడానికి చాలా అవసరం. ఒంటరిగా ఉండకుండా, మన భావోద్వేగాలను నమ్మదగినవారితో పంచుకోవడం ద్వారా మనోస్థైర్యాన్ని పెంచుకోవచ్చు. చిన్న చిన్న విజయాలను లక్ష్యంగా పెట్టుకుని ముందుకుసాగడం ద్వారా మానసిక సామర్థ్యాన్ని తిరిగి పొందవచ్చు. మానసిక ప్రశాంతత, జీవనశైలి మార్పులతో డిప్రెషన్‌ను పూర్తిగా అధిగమించవచ్చు. మన ఆరోగ్యానికి ప్రాధాన్యతనిస్తూ, అవసరమైతే వైద్యనిపుణులను సంప్రదించడం ద్వారా మానసిక ప్రశాంతతను పొందగలుగుతాం.
- డా. కృష్ణ కుమార్ వేపకొమ్మ-