
- పదుల సంఖ్యలో ఉద్యోగులు.. ఏండ్లుగా రెన్యువల్
- సొంత స్థానాలకు వెళ్లరు.. పోస్టు వెకెన్సీ చూపించరు
- సిబ్బంది కొరతతో కష్టంగా ఆలయాల నిర్వహణ
- ప్రమోషన్ల విషయంలోనూ మిగతా ఉద్యోగులకు నష్టం
- పదోన్నతుల కోసం పలువురి ఎదురుచూపులు
హైదరాబాద్, వెలుగు:దేవాదాయశాఖలో డిప్యూటేషన్లపై వచ్చిన వారు ఏండ్లుగా కుర్చీ వదలడం లేదు. ఒక్కసారి ప్రధాన కార్యాలయంలో అడుగు పెట్టారంటే ఇక రిటైర్ మెంట్ దాకా అక్కడే తిష్ట వేస్తున్నరు. దీంతో మాతృసంస్థలో పోస్టు ఖాళీతో అక్కడ ఇబ్బందులు ఎదురవుతుండగా.. వాస్తవానికి ఇక్కడ పోస్టు ఖాళీ అయినా భర్తీ చేయలేని.. దాన్ని వెకెన్సీగా చూపించలేని పరిస్థితి.
ఇట్ల ఏండ్ల తరబడి డిప్యూటేషన్ పైనే ప్రధాన కార్యాలయంలో కొనసాగుతుండటంతో ఆలయాల్లో సిబ్బంది కొరతతో నిర్వహణ, భక్తులకు సరైన సౌలత్లు కల్పించడంలో ఇబ్బందులు ఎదురువుతున్నాయి. అలాగే ఏండ్లుగా ప్రమోషన్ కోసం వేచిచూస్తున్న వారికి డిప్యూటేషన్‌పై కొనసాగతున్న వారితో అడ్డంకులు ఏర్పాడుతున్నాయి.
రెండు దశాబ్దాలుగా తిష్ట
ప్రభుత్వం ఎండోమెంట్లో నియామకాల ప్రక్రియ ఆలస్యం చేయడం.. పని చేస్తున్న సిబ్బంది ప్రమోషన్ పొందడం, రిటైర్మెంట్ తో పోస్టులు ఖాళీ కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాల్లో ఉద్యోగుల కొరత ఉంది. దీనికితోడు ఉన్న సిబ్బందిని కూడా హెడ్ ఆఫీసు కు తీసుకొచ్చి డిప్యూటేషన్ పై కొనసాగిస్తుండటంతో అక్కడ ఆలయాల్లో పనిచేసేవారు కరవైయ్యారు. దీంతో భక్తులకు సౌకర్యాలు కల్పించేదెవరు..? అక్కడ కార్యనిర్వహణ ఎలా..? అనే సందేహాలు కలుగుతున్నాయి. ఒకరు కాదు ఇద్దరు కాదు పదుల సంఖ్యలో ఉద్యోగులు ఎండో మెంట్ హెడ్ఆఫీసులో ఏండ్ల తరబడి కుర్చీలు వదలడం లేదు.
రెన్యువల్ చేసుకుంటూ పోతున్నారు. దీంతో ఆలయాల్లో సిబ్బంది కొరతతో నిర్వహణ సమస్యలు తలెత్తున్నాయి. కమిషనర్ కార్యాలయంలో ఓ ఉద్యోగి రెండు దశాబ్దాలుగా ఒకే చోట పనిచేస్తున్నారు. ఈవో గా ప్రమోషన్ వచ్చినా ఆయన మాత్రం కమిషనర్ ఆఫీసు వదలడం లేదు. కమిషనర్ ఆఫీసులో డిప్యూటేషన్ పై ధర్మశాల ఆలయం నుంచి ఒకరు, అమీర్‌పేట హనుమాన్ ఆలయం నుంచి ఒకరు ,మైసిగండి మైసమ్మ దేవాలయం నుంచి ఒకరు, వరంగల్ లోని భద్రకాళి దేవాలయం నుంచి ఓ ఉద్యోగి 30 ఏండ్లుగా ఇక్కడే తిష్ట వేశారు.
సికింద్రాబాద్ బోలక్పూర్ లోని భవానీ శంకరాలయంలో పనిచేసే ఒక వ్యక్తి, నల్లకుంట రామాలయం నుంచి ఒకరు, ధర్మపురి నుంచి ఒకరు, రామలింగేశ్వరాలయం నుంచి ఒకరు, ఉన్నతాధికారి పేషీలో ఉన్న ఈవో ఒకరు, అడిక్ మెట్ హనుమాన్ దేవాలయంలోని ఓ ఉద్యోగి కమిషనర్ ఆఫీసులో డిప్యుటేషన్ పై పని చేస్తున్నారు. మరో వ్యక్తి నాలుగేండ్ల కింద డిప్యూటేషన్ పై వచ్చి పనిచేస్తున్నారు. ప్రతి ఏటా రెన్యూవల్ చేసుకుంటూ కమిషనర్ ఆఫీసులో కంటిన్యూ అవుతున్నారు.
హెడ్ ఆఫీసులో 25 మంది డిప్యూటేషన్ ఉద్యోగులు
రాష్ట్రంలోని పలు దేవాదాయశాఖ కార్యాలయాల్లో పనిచేస్తున్న సిబ్బందిని డిప్యూటేషన్ పై కమిషనర్ కార్యాలయానికి తీసుకొచ్చి పనిచేయిస్తున్నారు. ఇక్కడే అసలు సమస్య మొదలైంది. ఒక ఏడాది పర్మిషన్ తో వచ్చిన ఉద్యోగులు ఏండ్లుగా ఇక్కడే తిష్ట వేస్తున్నారు. ఇలా సుమారు 25 మంది వరకు ఉద్యోగులు డిప్యూటేషన్‌పై కొనసాగుతున్నారు. దీనివల్ల ఇతర ఉద్యోగుల ప్రమోషన్ల విషయంలో నష్టం జరగడంతోపాటు హెడ్ఆఫీసులో డిప్యూటేషన్‌పై కొనసాగుతున్న పోస్టును ఖాళీగా చూపిం చలేరు.
మాతృసంస్థ పోస్టులో కొత్తవారిని తీసుకోలేరు. అలాగే పోస్ట్ ను కూడా వెకెన్సీగా చూపిం చలేరు. పైగా ప్రమోషన్లలో ఆ పోస్ట్ ను భర్తీ చేయడం లేదు. అర్హతలు, సీనియార్టీ ఉన్నా.. డిప్యూటేషన్ పై వచ్చినవారినే ఆ పోస్ట్ లో కొనసాగిస్తున్నారే తప్ప.. ప్రమోషన్లో పోస్ట్ ను భర్తీ చేయడం లేదనే ఆరోపణలున్నాయి. దీనివల్ల ప్రమోషన్ల కోసం ఎదురు చూస్తున్నవారు నష్టపోతున్నారు.