
- జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్న ఇద్దరిపైనా ఉపసంహరించుకుంటున్నం: డిప్యూటీ సీఎం భట్టి
- పోలీస్, న్యాయ శాఖలు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశం
- సుప్రీంకోర్టు ఆర్డర్స్ మేరకు 400 ఎకరాల్లో పోలీసు పహారా ఉంటదని వెల్లడి
- విద్యార్థుల సలహాలు వినేందుకు ఎప్పుడూ సిద్ధంగా ఉంటామన్న భట్టి
- కేబినెట్ సబ్ కమిటీ భేటీలో కీలక నిర్ణయాలు
- హెచ్‌సీయూ ఉపాధ్యాయ సంఘం, పౌర సంఘాల ప్రతినిధులతో మంత్రుల చర్చలు
- హాజరుకాని స్టూడెంట్ జేఏసీ
హైదరాబాద్ వెలుగు: కంచ గచ్చిబౌలి భూముల ఇష్యూలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సీయూ) విద్యార్థులపై పెట్టిన కేసులను ఎత్తివేస్తున్నట్టు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ఈ మేరకు పోలీస్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్న ఇద్దరు స్టూడెంట్స్పైనా కేసులు ఉపసంహరించుకోవాలని, ఇందుకు పోలీస్ శాఖతోపాటు న్యాయ శాఖ కూడా చర్యలు తీసుకోవాలని సూచించారు. యూనివర్సిటీలో సొంత సెక్యూరిటీ పెట్టుకుంటే మెయిన్ క్యాంపస్ నుంచి పోలీసులను ఉపసంహరిస్తామని, ఈ మేరకు వీసీకి లేఖ రాశామని చెప్పారు.
అయితే, సుప్రీంకోర్టు ఆర్డర్ మేరకు 400 ఎకరాల ప్రభుత్వ భూమిని రక్షించేందుకు పోలీసు పహారా కొనసాగుతుందని, కోర్టు నుంచి తదుపరి ఆదేశాలు వచ్చేవరకు అక్కడ సర్వే సహా ఎలాంటి కార్యకలాపాలకు అనుమతి లేదని అన్నారు. క్యాంపస్‌ను సందర్శించేందుకు మంత్రుల కమిటీ సిద్ధంగా ఉన్నప్పటికీ, కోర్టులో కేసు నడుస్తున్నందున ఇప్పటికి అది సాధ్యం కాదని, విద్యార్థుల సలహాలు వినేందుకు తాము ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటామని భట్టి విక్రమార్క స్పష్టంచేశారు. కంచ గచ్చిబౌలి ల్యాండ్ ఇష్యూపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేబినెట్సబ్ కమిటీ సోమవారం సెక్రటేరియెట్‌లో సమావేశమైంది. డిప్యూటీ సీఎం అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్సీ వంశీచంద్ రెడ్డి పాల్గొన్నారు. హెచ్‌సీయూ ఉపాధ్యాయ సంఘం (యూహెచ్‌టీఏ), పౌర సంఘాల ప్రతినిధులతోనూ మంత్రుల కమిటీ చర్చించింది.
సమస్య పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది
సుప్రీంకోర్టు ఆదేశాలకనుగుణంగా అన్ని వర్గాలతో సంప్రదించి, సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రులు తెలిపారు. విద్యార్థులపై నమోదైన కేసులను ఉపసంహరించేందుకు ప్రభుత్వం సానుభూతితో వ్యవహరిస్తున్నదని చెప్పారు. జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్న ఇద్దరు విద్యార్థులపై కేసులను తక్షణమే ఎత్తివేయాలని, ఈ మేరకు పోలీసు, న్యాయ శాఖలు చర్యలు తీసుకోవాలని మంత్రులు ఆదేశించారు. సమావేశంలో యూహెచ్‌టీఏ నుంచి ప్రొఫెసర్ సౌమ్య దేచమ్మ, శ్రీపర్ణ దాస్, భంగ్య భూక్య, పౌర సంఘాల నుంచి విస్సా కిరణ్‌కుమార్, సంధ్య తదితరులు పాల్గొన్నారు. కాగా, వర్సిటీ నుంచి పోలీసులను ఉపసంహరించుకోవాలని, నిషేధాజ్ఞలు, కేసులు ఎత్తివేయాలనే డిమాండ్లను పరిష్కరిస్తేనే చర్చలకు వస్తామని విద్యార్థి జాయింట్ యాక్షన్ కమిటీ స్పష్టంచేసింది. సర్కారు నుంచి ముందే నిర్ణయం రానందున సమావేశానికి స్టూడెంట్ జేఏసీ హాజరు కాలేదు. ఈ సమావేశంలో డీజీ ఇంటెలిజెన్స్ శివధర్‌రెడ్డి, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అభిషేక్ మహంతి పాల్గొన్నారు. ఇదే అంశంపై మంత్రులతో కాంగ్రెస్ తెలంగాణ వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ కూడా మాట్లాడారు. హెచ్‌సీయూ ఇష్యూలో విద్యార్థుల పట్ల సర్కారు సానుకూలంగా వ్యవహరించాల్సిందని ఆమె అభిప్రాయపడ్డారు. అవి ప్రభుత్వ భూములనే విషయంపై విద్యార్థులకు అవగాహన లేకపోవడం వల్లే ఆందోళన దిగి ఉంటారని, వారిపై కేసుల ఎత్తివేత విషయంలో సానుభూతితో వ్యవహరించాలని సూచించారు.
బలగాలను ఉపసంహరిస్తున్నాం: వీసీకి డిప్యూటీ సీఎం లేఖ
సమావేశం అనంతరం హెచ్‌సీయూ వీసీ బీజే రావుకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క లేఖ రాశారు. 400 ఎకరాల భూమిని మినహాయించి, మిగిలిన క్యాంపస్ ఏరియాల నుంచి పోలీసు బలగాలను ఉపసంహరిస్తున్నామని తెలిపారు. సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం 400 ఎకరాల్లో చెట్ల సంరక్షణ తప్ప ఇతర ఎలాంటి కార్యక్రమాలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. క్యాంపస్‌లో శాంతి భద్రతల కోసం యూనివర్సిటీ సొంత సెక్యూరిటీ ఏర్పాటు చేయాలని, ఈ మేరకు లిఖితపూర్వక హామీ ఇస్తేనే పోలీసులను తొలగిస్తామని పేర్కొన్నారు. గతంలో వీసీ కోరిన భద్రతా ఏర్పాట్లను గుర్తు చేస్తూ, ఇప్పుడు ఉపాధ్యాయ సంఘం, పౌర సంఘాల విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామని వివరించారు. హెచ్‌సీయూ స్వతంత్రత, విద్య, పరిశోధనలకు ప్రభుత్వం మద్దతుగా నిలుస్తుందని లేఖలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హామీ ఇచ్చారు.