Naini Coal: 4 నెలల్లో నైని బొగ్గు.. ఒడిశాలో సింగరేణి ప్లాంట్ స్టార్ట్

Naini Coal: 4  నెలల్లో నైని బొగ్గు.. ఒడిశాలో సింగరేణి ప్లాంట్ స్టార్ట్
  • వసతుల కల్పనకు ఒడిశా సానుకూలం
  • సింగరేణి అధికారులతో డిప్యూటీ సీఎం రివ్యూ

హైదరాబాద్: సింగరేణి సంస్థ ఒడిశా రాష్ట్రంలో దక్కించుకున్న  నైని ప్లాంటు నుంచి నాలుగు నెలల్లో బొగ్గు ఉత్పత్తిని ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. ఇవాళ సింగరేణి అధికారులతో రివ్యూ నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. నైని బొగ్గు ఉత్పత్తి కోసం తాను ఒడిశాలో పర్యటించి  సీఎం మోహన్ చరణ్ మాఝితో చర్చించానని చెప్పారు. నిర్వాసిత గ్రామాల ప్రజలతో, అక్కడి ఎమ్మెల్యే  అగస్తి బెహరాతో భేటీ అయ్యానని అన్నారు. నైని బొగ్గు బ్లాక్ కు ఇప్పటికే అన్ని అనుమతులు లభించిన నేపథ్యంలో, సింగరేణికి ఆ రాష్ట్ర అటవీశాఖ ద్వారా బదలాయించిన 783.27 హెక్టార్ల అటవీ స్థలంలో చెట్ల లెక్కింపు, వాటి తొలగింపు, తదుపరి ఆ స్థలం అప్పగింత పై ఒడిశా ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించినందున ఆ రాష్ట్ర అటవీశాఖ తో నిరంతరం  సంప్రదింపులు జరుపుతూ ఈ పనులు వేగంగా పూర్తయ్యలా చొరవ చూపాలని ఆయన సింగరేణి సంస్థను ఆదేశించారు. ఇందుకోసం ప్రత్యేక అధికారిగా నైనీ జనరల్ మేనేజర్ కు బాధ్యతలు అప్పగించాలని సూచించారు.

స్థానికులకు పునరావాస పథకం, కార్పొరేట్ సామాజిక బాధ్యత కార్యక్రమాలు, గ్రామ యువతకు ఉపాధి అవకాశాలపై  తగిన ప్రణాళికలు రూపొందించి అమలు చేయాలని ఆదేశించారు.  హై టెన్షన్ విద్యుత్తు లైను ను వెంటనే నిర్మించే విధంగా ఆ రాష్ట్ర విద్యుత్ శాఖ తో సంప్రదిస్తూ ముందుకు సాగాలని కోరారు. అలాగే పునరావాస, నష్టపరిహారం అంశాలపై చర్చించే ఆర్.పి.డి.ఏ.సి. మీటింగ్ ను అతి త్వరగా పూర్తి చేసుకోవాలని సూచించారు. నైనీ బొగ్గు బ్లాక్ నుండి ఉత్పత్తి ప్రారంభానికి ఇంకా పూర్తి కావలసి ఉన్న మరికొన్ని పనులపై కూడా ఆయన అంశాల వారీగా డిప్యూటీ సీఎం చర్చించారు.