రాష్ట్ర ప్రయోజనాలకు బీజేపీ, బీఆర్ఎస్ ఎంపీలు అడ్డుపడుతున్నారు: భట్టి విక్రమార్క

రాష్ట్ర ప్రయోజనాలకు బీజేపీ, బీఆర్ఎస్ ఎంపీలు అడ్డుపడుతున్నారు:  భట్టి విక్రమార్క

రాష్ట్ర ప్రయోజనాలకు బీజేపీ, బీఆర్ఎస్ ఎంపీ అడ్డుపడుతున్నారని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మండిపడ్డారు. కోల్ బ్లాకులను సింగరేణికి ఇవ్వకుండా కేంద్రం అడ్డుకుందని ఆయన అన్నారు. ఓపెన్ ఆక్షన్ ద్వారా బొగ్గు గనుల కేటాయింపు విధానాన్ని బీజేపీ తీసుకొచ్చి తెలంగాణ ప్రభుత్వానికి నష్టం చేస్తోందని భట్టి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖమ్మంలో గురువారం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మీడియా సమావేశం నిర్వహించారు. సింగరేణి గని అంటే ఉద్యోగాల గని అని డిప్యూటీ సీఎం భట్టి అన్నారు. సింగరేణి తెలంగాణకే తలమానికమని చెప్పారు. భట్టి విక్రమార్క బొగ్గు గనుల వేలం ప్రక్రియ గురించి మాట్లాడారు.

సింగరేణిలో 42 వేల మంది రెగ్యులర్‌, 26 వేలమంది అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు పనిచేస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలోని 40 బొగ్గు గనుల్లో బొగ్గు ఉత్పత్తి జరుగుతుందని వెల్లడించారు. ప్రస్తుతం 70 మిలియన్‌ టన్నుల బొగ్గు ఉత్పత్తి జరుగుతుందని వివరించారు. 2030 కల్లా 15 మిలియన్‌ టన్నులకు బొగ్గు ఉత్పత్తి తగ్గిపోతుందని, 22 గనులు మూతపడతాయని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. గనుల చట్టానికి కేంద్రం సవరణలు తీసుకొచ్చి ఆమోదించుకుందని.. బొగ్గు గనులు కావాలంటే ఎవరైనా వేలంలో పాల్గొనేలా చట్టం చేశారని పేర్కొన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలకు దేశంలోని బొగ్గు గనులను కేటాయించలేదని స్పష్టం చేశారు. సింగరేణిలో ఇంకా కొత్త గనులు మనకు రావాల్సి ఉందని భట్టి విక్రమార్క అన్నారు.