నాకు ముఖ్యమంత్రి కావాలని ఉంది.. మనసులో మాట బయటపెట్టిన డిప్యూటీ సీఎం

నాకు ముఖ్యమంత్రి కావాలని ఉంది.. మనసులో మాట బయటపెట్టిన డిప్యూటీ సీఎం

ముంబై: మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల వేడి షూరు అయ్యింది. ఈ ఏడాది చివర్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాష్ట్రంలోని ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల కసరత్తును మొదలు పెట్టాయి. అధికార బీజేపీ, శివసేన (షిండే వర్గం), ఎన్సీపీ (అజిత్ వర్గం) కూటమిని ఓడించడమే లక్ష్యంగా ప్రతిపక్ష కూటమి (థాక్రే శివసేన, కాంగ్రెస్, శరద్ ఎన్సీపీ) ప్రణాళికలు రచిస్తున్నాయి. మరోవైపు అధికారం నిలబెట్టుకోవడం కోసం అధికార కూటమి వ్యుహాలు రచిస్తోంది. ఈ క్రమంలో  అధికార కూటమిలో కీలక నేత, డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ముఖ్యమంత్రి పదవి కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఆయన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. నాకు కూడా ముఖ్యమంత్రి అవ్వాలని ఉందని సీఎం పదవిపై మనసులోని మాటను బయటపెట్టారు. 

కానీ సీఎం అవ్వాలంటే మెజార్టీ మార్క్ చేరుకోవాలి.. అంతిమంగా అది ఓటర్ల చేతిలోనే ఉందని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. పార్టీలోని ప్రతి కార్యకర్త కూడా తమ నాయకుడు ముఖ్యమంత్రి కావాలనే కోరుకుంటాడని అన్నారు. అయితే, కోరుకున్నది ప్రతి ఒక్కరికి దక్కదని.. దానికి కష్టపడటంతో పాటు లక్ ఉండాలన్నారు. సీఎం పదవి దక్కాలంటే 288 అసెంబ్లీ సీట్లలో మ్యాజిక్ ఫిగర్ 145  స్థానాలు కావాలని గుర్తు చేశారు. కాగా, శరద్ పవార్ ఎన్సీపీని చీల్చి అజిత్ పవార్ వేరే కుంపటి పెట్టిన విషయం తెలిసిందే. అజిత్ పవార్ కొందరు ఎమ్మెల్యేలతో కలిసి అధికార కూటమిలో చేరగా.. ఆయనకు డిప్యూటీ సీఎం పదవి దక్కింది. ప్రస్తుతం బీజేపీ, శివసేన (షిండే వర్గం)తో కలిసే అజిత్ పవార్ అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగుతున్నారు.