సారు, కారు.. 16 నుంచి జీరోకు..ఊహల్లో నుంచి బయటకు రావాలి: భట్టి

 సారు, కారు.. 16 నుంచి జీరోకు..ఊహల్లో నుంచి బయటకు రావాలి: భట్టి

కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలగొట్టే  కుట్రను సహించలేకనే బీఆర్ఎస్ ఎమ్మెల్యే లు కాంగ్రెస్ లో చేరుతున్నారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. సారు, కారు 16 నుంచి జీరో కు వచ్చారు.. కేసీఆర్ ఊహాల్లోంచి బయటకు వచ్చి చూస్తే వాస్తవ పరిస్థితి తెలుస్తుందన్నారు.  బీఆర్ఎస్ వాట్సప్ యూనివర్సిటీలో బతుకుతుందని ఎద్దేవా చేశారు. ఏపీ సీఎస్ గా పనిచేసిన ఆదిత్యనాథ్ దాస్.. ఇరిగేషన్ లో మంచి ఎక్స్పర్ట్.. అందుకే ఆయనను తెలంగాణ ఇరిగేషన్ సలహాదారుగా పెట్టుకున్నామని చెప్పారు. ఆయన తమ అంచనాలు అందుకోకపోతే  పక్కన పెడుతామన్నారు.

ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గురు శిష్యులు కాదు సహచరులన్నారు భట్టి విక్రమార్క. ఇదే విషయాన్ని రేవంత్ చాలా సార్లు చెప్పారన్నారు. అవగాహన లేని మాటలు మాట్లడవద్దని సూచించారు భట్టి. పీసీసీ నియామకంపై కసరత్తు చేస్తున్నారని చెప్పారు. మంత్రివర్గ విస్తరణ అధిష్టానం ఇష్టమన్నారు

రుణమాఫీపై బీఆర్ఎస్ డ్రామాలు ఆపాలన్నారు భట్టి విక్రమార్క.  త్వరలోనే రెండు లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పారు.  గత సర్కార్ లక్ష కూడా రుణమాఫీ చేయలేదని విమర్శించారు.  రుణమాఫీపై మాటతప్పేది లేదన్నారు. తాము  ప్రజలకు జవాబుదారీగా ఉంటామన్నారు. ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామని చెప్పారు. రైతు భరోసాపై కూడా కసరత్తు జరుగుతోందన్నారు.  ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని అమలు  చేస్తామని చెప్పారు