జార్ఖండ్ ఖనిజ సంపదపైనే బీజేపీ కన్ను : భట్టి విక్రమార్క

  • అదానీ, అంబానీలకు అప్పగించే ప్రయత్నం
  • ఇండియా కూటమిని గెలిపిస్తే జార్ఖండ్​లోనూ ఇంటింటి సర్వే
  • ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న డిప్యూటీ సీఎం

హైదరాబాద్, వెలుగు: బీజేపీకి జార్ఖండ్ ప్రజలపై ప్రేమ లేదని, ఇక్కడి ఖనిజ సంపదపైనే ఆ పార్టీ కన్ను పడిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆరోపించారు. ఆయన ఆదివారం జార్ఖండ్ బొకారో సెగ్మెంట్​లోని శివండి, దుంది బజార్, ఆజాద్ నగర్ తదితర ప్రాంతాల్లో ఇండియా కూటమి తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహించారు. జార్ఖండ్ లోని ఖనిజ సంపదను అదానీ, అంబానీలకు దోచిపెట్టేందుకే బీజేపీ ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. భవిష్యత్ తరాలను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర సంపదను, వనరులను కాపాడే ఇండియా కూటమి అభ్యర్థులనే గెలిపించాలని ఆయన ప్రజలను కోరారు. 

జనాభా ప్రకారం ఈ దేశ వనరులు పంచాలని రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా ప్రచారం చేస్తున్నారని తెలిపారు. తెలంగాణలో ఎన్నికలప్పుడు ఇదే ప్రధాన అస్త్రంగా ప్రచారం చేశామని, రాష్ట్ర ప్రజలు గుర్తించి కాంగ్రెస్ పార్టీకి అధికారం అప్పగించారని భట్టి విక్రమార్క గుర్తుచేశారు. తాము ఇచ్చిన మాట నిలుపుకునేందుకు రాష్ట్ర జనాభా ప్రకారం వనరులు, సంపద పంచాలని, అందుకు తెలంగాణలో సమగ్ర ఇంటింటి కుల గణన సర్వే ప్రారంభించామని చెప్పారు.

 జార్ఖండ్​లోనూ మహాకూటమి అధికారంలోకి రాగానే తెలంగాణ తరహాలో గ్యారంటీలను అమలు చేస్తామని అన్నారు. ఇక్కడి సంపద ఈ ప్రాంత వాసులకే పంచేందుకు సమగ్ర ఇంటింటి సర్వే చేపడతామని అన్నారు. దీంతో సంపద ఎవరి వద్ద ఉంది.. ఉద్యోగాలు ఎవరెవరికి వచ్చాయి వంటి వివరాలు తెలుస్తాయన్నారు. ఆదివాసీలు, దళితులు, పేదలకు న్యాయం జరగాలంటే ఇండియా కూటమి అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని భట్టి కోరారు.