వచ్చే వంద రోజుల్లో ఆరు గ్యారంటీలను అమలు చేస్తామన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. గ్యారంటీలకు వారంటీ లేదన్న వాళ్లకు సమాధానం ఇచ్చామన్నారు. కాంగ్రెస్ హామీ ఇస్తే నిలబెట్టుకుంటుందన్న నమ్మకం ప్రజల్లో ఉందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వమని చెప్పారు. ఖమ్మం జిల్లాలో 10 స్థానాలకు 9 స్థానాలు గెలిచామన్నారు. జిల్లాలో 9 సీట్లు గెలిపించిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు.
భద్రాద్రి శ్రీ రామచంద్రుడి ఆశీస్సులతో మంత్రిగా ప్రజలకు సేవ చేసే భాగ్యం దక్కిందన్నారు మంత్రి తుమ్మల. తప్పుడు కేసులు పెట్టిన పోలీస్ అధికారులు తీరు మార్చుకోవాలన్నారు. జిల్లా కలెక్టర్ ఎస్పీ ఎక్కడ ఉన్నా తెలంగాణ లో పనిచేయాలన్నారు. అధికారులు తీరు మార్చుకొని ప్రజా సేవ చేయాలన్నారు. భూ కబ్జాలపై కలెక్టర్ ఎస్పీ దృష్టి పెట్టాలని సూచించారు. ఖమ్మం జిల్లా ప్రజల తీర్పు చరిత్రలో నిలిచిందన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీ పథకాలు అమలు చేస్తామన్నారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లా పర్యటనలో ఉన్న డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి, తుమ్మల నాగేశ్వరరావు. మంత్రులుగా ప్రమాణం చేసిన తర్వాత తొలిసారి జిల్లాకు వచ్చిన ముగ్గురికి స్థానిక నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. కూసుమంచి మండలం నాయకన్ గూడెం వద్ద కాంగ్రెస్ కార్యకర్తలు గ్రాండ్ వెల్కం చెప్పారు. ఓపెన్ టాప్ వెహికిల్ లో మంత్రులు కార్యకర్తలకు అభివాదం చేశారు.