- చెరువుల్ని పూడ్చి కట్టిన నిర్మాణాలే ఫస్ట్ టార్గెట్
- ప్రజల ఆస్తులు కాపాడడం మా బాధ్యత
- హైడ్రా అంటే హైదరాబాద్ చెరువుల పరిరక్షణ
- దాన్ని ప్రజలు స్వాగతిస్తున్నరు..వ్యతిరేకించి అబాసుపాలు కావొద్దు
- పదేండ్లలో జరిగిన చెరువుల ఆక్రమణలపై రిమోట్ సెన్సింగ్ శాటిలైట్ ఫొటోలు విడుదల చేస్తం
- చెరువుల డేటా పబ్లిక్ డొమైన్లో పెడ్తామని వెల్లడి
న్యూఢిల్లీ, వెలుగు : చెరువులను కబ్జా చేసి నిర్మించిన అక్రమ నిర్మాణాలపై చట్టానికి లోబడే చర్యలు చేపడతున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ప్రజల ఆస్తులను కాపాడడం ప్రభుత్వ బాధ్యత అని చెప్పారు. ఇందుకు సంబంధించి త్వరలోనే అన్ని వివరాలు ప్రజల ముందు పెడతామన్నారు. సినీ నటుడు నాగార్జునకు చెందిన ‘ఎన్’ కన్వెన్షన్ కూల్చివేతపై శనివారం ఢిల్లీలో భట్టి స్పందించారు. లేక్స్, రాక్స్ (సరస్సులు, రాళ్లు) కాన్సెప్ట్ హైదరాబాద్ నగరానికి అంతర్జాతీయంగా పేరు తెచ్చిందన్నారు. వీటిని కాపాడుకోవాలంటూ పర్యావరణవేత్తలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్న విషయాన్ని గుర్తు చేశారు.
హైదరాబాద్ నగరంలో, ఔటర్ రింగ్ రోడ్డు వరకు ఉన్న చాలా చెరువులను ఆక్రమించి వాటిని మట్టితో నింపి అక్రమ నిర్మాణాలు కట్టారన్నారు. దీంతో హైదరాబాద్ లో చెరువులు లేకుండా పోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. వర్షం పడినప్పుడు వరద నీరు ఎటూ పోలేక కాలనీలు మునిగి నగర ప్రజలు పడుతున్న బాధను చూశామన్నారు. ఆ సమస్యను దృష్టిలో పెట్టుకొని.. మన పూర్వీకులు నిర్మించిన చెరువులు భవిష్యత్ తరానికి అందించాలనే ఆలోచనతో తీసుకొచ్చిందే హైడ్రా అన్నారు. హైడ్రా అంటే హైదరాబాద్, పరిసర ప్రాంతంలోని చెరువుల పరిరక్షణ అని చెప్పారు. హైడ్రా ఏర్పాటుపై తమ ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రజలందరూ ఆహ్వానిస్తున్నారని చెప్పారు. అక్రమ కూల్చివేతలపై ముందుగా నోటీసులు ఇవ్వలేదని ఆక్రమణదారులు చెబుతున్న దాంట్లో వాస్తవం లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూల్చివేతలకు సంబంధించి ముందుగానే నోటీసులు ఇస్తున్నట్లుగా క్లారిటీ ఇచ్చారు.
గతంలో ఎన్ని చెరువులున్నాయ్.. ఇప్పుడెన్నున్నయ్
బఫర్ జోన్ లో కాకుండా, నేరుగా చెరువులోనే కట్టిన అక్రమ నిర్మాణాలను ఫస్ట్ టార్గెట్ గా కూల్చేస్తున్నట్లు స్పష్టం చేశారు. ఈ చర్యలకు ప్రజలందరూ సహకరించాలని రిక్వెస్ట్ చేశారు. తన దగ్గర ఉన్న ప్లానింగ్ శాఖలో శాటిలైట్ ద్వారా రీమోట్ సెన్సింగ్ ఫొటోలు తీసే టెక్నాలజీ ఉందన్నారు. దీని సహకారంతో రాష్ట్ర విభజనకు ముందు, గత పదేండ్లలో చెరువులు ఎంత మేర ఆక్రమణకు గురయ్యాయనే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలిపారు. ఈ చెరువుల్లో ఎన్ని పెద్ద పెద్ద సంస్థలు, వ్యవస్థలు టవర్స్, బిల్డింగ్స్ కట్టాయో రిమోట్ సెన్సింగ్ శాటిలైట్ ఫొటోలను తీసి ప్రజల ముందు పెడతామన్నారు.
అంతకుముందు ఎన్ని చెరువులు ఉండేవి, ఇప్పుడు ఎన్ని ఉన్నాయన్నది ప్రతి ఏడాది వారీగా రిమోట్ సెన్సింగ్ డేటాను పబ్లిక్ డొమైన్లో ఉంచుతామని చెప్పారు. కూల్చివేతల్లో అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ అనే అంశం ఉందన్నారు. ప్రజలకు సంబంధించిన నగరాన్ని, చెరువులను కాపాడడమే తన ప్రధాన బాధ్యత అన్నారు. ఇలాంటి నిర్ణయాలు ఎవరైనా వ్యతిరేకిస్తే.. వారిని ప్రజలు తప్పుబడతారని, అలాంటి పనులు చేయొద్దని సూచించారు. చెరువులను ఆక్రమించి నిర్మాణాలు చేయడం వల్ల ఇబ్బందులు కలుగుతున్నాయని వివరించారు.