ఎన్ని ఇబ్బందులు వచ్చినా.. పథకాలు కొనసాగిస్తాం : భట్టి విక్రమార్క

ఎన్ని ఇబ్బందులు వచ్చినా.. పథకాలు కొనసాగిస్తాం : భట్టి విక్రమార్క
  • కొత్తగూడెం-పాల్వంచ మున్సిపాలిటీలను కార్పొరేషన్​గా మారుస్తాం
  • సూపర్​ క్రిటికల్​ థర్మల్​ పవర్​ ప్రాజెక్టు ఏర్పాటుకు ప్లాన్​ 
  • డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
  • ఆర్నెళ్లలో  అమృత్​ స్కీం వర్క్స్​ కంప్లీట్​: మంత్రి కొమటిరెడ్డి
  • ఆయిల్​పామ్​కు కేరాఫ్​ అడ్రస్​గా భద్రాద్రికొత్తగూడెం జిల్లా :  మంత్రి తుమ్మల
  • గత సర్కారు ప్రజాధనాన్ని లూటీ చేసింది : మంత్రి పొంగులేటి 

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : ఎన్ని ఇబ్బందులు వచ్చినా రుణమాఫీ, రైతు బీమా, రైతు భరోసా పథకాలు కొనసాగిస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. గత బీఆర్​ఎస్​ సర్కారు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం తప్ప చేసిందేమీ లేదన్నారు. గురువారం భద్రాద్రికొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలం, కొత్తగూడెం మున్సిపాలిటీల్లో రూ. 130కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులకు మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస​రెడ్డితో కలిసి శంకు స్థాపన చేశారు. కొత్తగూడెం పట్టణంలో ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అధ్యక్షతన జరిగిన సభలో భట్టి మాట్లాడారు. 

ఇంటింటికీ నల్లా నీళ్లు ఇచ్చినట్టు గత బీఆర్​ఎస్​ సర్కారు గొప్పలు చెప్పుకుంది తప్ప ఏమీ చేయలేదన్నారు. అనేక గ్రామాల్లో మిషన్​ భగీరథ నీళ్లు రావడం లేదని చెప్పారు. పంద్రాగస్టుకు ముందే రూ. 2లక్షల రుణ మాఫీ ఏకకాలంలో చేస్తామని స్పష్టం చేశారు. అందరితో చర్చించిన తర్వాత అసెంబ్లీలో డిస్కస్​ చేసి పంటలను సాగు చేసే ప్రతి రైతుకూ రైతు భరోసా ఇస్తామని చెప్పారు. గత ప్రభుత్వంలా రూ. 7లక్షల కోట్లతో రాష్ట్రాన్ని వదిలి పారిపోయే ప్రభుత్వం తమది కాదన్నారు. సీతారామ ప్రాజెక్ట్​ పేర రూ. 9వేల కోట్లు ఖర్చు చేసి ఒక్క ఎకరాకు కూడా బీఆర్​ఎస్​ ప్రభుత్వం నీళ్లు ఇవ్వలేదని గుర్తు చేశారు. 

తాము అధికారంలోకి వచ్చిన కొద్ది టైంలోనే రూ. 70కోట్లు ఖర్చు పెట్టి ఆగస్టులోపు వైరాకు నీళ్లు ఇచ్చేందుకు చర్యలు చే పట్టామన్నారు. కొత్తగూడెం–పాల్వంచ మున్సిపాలిటీలను కలిపి కార్పొరేషన్​ ఏర్పాటు చేసే విషయమై త్వరలో ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుందని చెప్పారు. పాల్వంచలో కూల్చి వేసిన స్టేజ్​–1,2,3,4 లో సూపర్​ క్రిటికల్​ థర్మల్​ పవర్​ ప్రాజెక్ట్​ ఏర్పాటు చేసేందుకు ప్లాన్​ చేస్తున్నామన్నారు. కొత్తగూడెం నియోజకవర్గానికి సీతారామ ప్రాజెక్ట్​ ద్వారా ఎక్కువ నీళ్లు ఇచ్చేందుకు అవసరమైతే మరో డిస్ట్రిబ్యూషన్​ లైన్​ ఏర్పాటు చేస్తామని చెప్పారు. 

రేపటి నుంచే పనులు షురూ.. 

కొత్తగూడెం పట్టణ ప్రజలకు తాగు నీటి ఎద్దడి లేకుండా రూ. 124.48కోట్లతో చేపట్టిన అమృత్​ స్కీం పనులను ఆర్నెళ్లలోపు పూర్తి చేస్తామని మంత్రి కొమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. రేపటి నుంచి పనులను ప్రారంభిస్తామని చెప్పారు. కొత్తగూడెం పట్టణంలో బైపాస్​ రోడ్డు నిర్మాణంలో భాగంగా సేతు బంధు పేర రూ. 148కోట్లతో ఆర్వోబీ నిర్మాణాన్ని త్వరలో చేపట్టనున్నామన్నారు. హైదరాబాద్​ టు విజయ వాడకు గ్రీన్​ ఫీల్ట్​ హైవైకు కేంద్ర మంత్రి గడ్కారీ హామీ ఇచ్చారని తెలిపారు. 

గత ప్రభుత్వం ఆఫీసర్లను పట్టించుకోలే.. 

గత ప్రభుత్వం ఆఫీసర్ల మాటలను పట్టించుకోలేదని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. రాష్ట్రంలోని కాంగ్రెస్​ ప్రభుత్వం ఆఫీసర్ల మాటలకు విలువ ఇస్తోందని తెలిపారు. రాష్ట్రంలోనే ఆయిల్​పామ్​కు కేరాఫ్​ అడ్రస్​గా భద్రాద్రికొత్తగూడెం జిల్లాను రూపొందిస్తున్నామని చెప్పారు. పంట పండించే రైతులకే రైతు భరోసా ఉంటుందని తెలిపారు. ఆగస్టు చివరి నాటికి మధిరకు గోదావరి నీళ్లు అందించేలా ప్లాన్​ చేస్తున్నామన్నారు. 

బీఆర్​ఎస్​ ఒక్క ఎకరాకూ నీళ్లియ్యలే.. 

పదేండ్ల కాలంలో ప్రజా ధనాన్ని లూటీ చేయడమే లక్ష్యంగా గత బీఆర్​ఎస్​ ప్రభుత్వం పనిచేసిందని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి విమర్శించారు. తాగునీటి సమస్యను పరిష్కరించడంలో గత ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు. ప్రాజెక్టుల పేర సాగు నీటిని అందిస్తామని చెప్పిన బీఆర్​ఎస్​ ప్రభుత్వం రూ. వేల కోట్ల ప్రజాధనాన్ని దోచుకుందే తప్ప ఒక్క ఎకరాకూ నీళ్లు ఇయ్యలేదన్నారు. కాంగ్రెస్​ పార్టీ ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇల్లెందు, వైరా ఎమ్మెల్యేలు కోరం కనకయ్య, రాందాస్​ నాయక్, జడ్పీ చైర్మన్​ కంచర్ల చంద్రశేఖర్, కలెక్టర్​జితేశ్​వి పాటిల్, ఎస్పీ రోహిత్​రాజు, అడిషనల్​ కలెక్టర్​ విద్యాచందన, మున్సిపల్ ​చైర్​ పర్సన్​ కె. సీతాలక్ష్మి, పలువురు కౌన్సిలర్లు పాల్గొన్నారు.  

గోదావరి వరదలపై సమీక్ష 

భద్రాద్రికొత్తగూడెం/పాల్వంచ, వెలుగు : గోదావరి వరదల టైంలో గత బీఆర్​ఎస్​ ప్రభుత్వం నిర్లక్ష్యంతో వ్యవహరించడం ప్రజలు ఇబ్బందులు పడ్డారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గుర్తు చేశారు. గోదావరి వరదలపై పలు శాఖల జిల్లా అధికారులతో గురువారం కలెక్టరేట్​లో జిల్లా ఇన్​చార్జ్​ మంత్రి కొమటిరెడ్డి వెంకటరెడ్డి, మంత్రులు పొంగులేటి శ్రీనివాస​రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి ఆయన సమీక్ష నిర్వహించారు. వరదల సందర్భంగా తాము తీసుకుంటున్న చర్యలను కలెక్టర్​ జితేశ్​ వి. పాటిల్​మంత్రులకు వివరించారు. 

ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ వానలు, వరదలు ఉధృతం కాకముందే యాక్షన్​ ప్లాన్​ సిద్దం చేసుకోవాలన్నారు. వరదల టైంలో అవసరమైన బడ్జెట్​ను ముందే తీసుకోవాలని సూచించారు. ఫుడ్, మెడికల్​పై ప్రత్యేక దృష్టి పెట్టాలని చెప్పారు. ఆఫీసర్లు, కిందిస్థాయి అధికారులు కమిట్​మెంట్​తో పనిచేస్తే వరదలను ఎదుర్కొవడం పెద్ద సమస్య కాదన్నారు. ఈ మూడు నెలలు అన్ని శాఖల అధికారులు అలర్ట్​గా ఉండాలని సూచించారు. వరదల టైంలో పోలీస్​లదే కీలక భూమిక ఉంటుందని చెప్పారు.