బీఆర్​ఎస్​ వల్లే విద్యా వ్యవస్థ భ్రష్టు పట్టింది: డిప్యూటీ సీఎం భట్టి

బీఆర్​ఎస్​ వల్లే విద్యా వ్యవస్థ భ్రష్టు పట్టింది: డిప్యూటీ సీఎం భట్టి
  • రాష్ట్రంలో 30 ఇంటిగ్రేటెడ్ స్కూళ్లకు శంకుస్థాపన చేస్తామని వెల్లడి
  • బోనకల్ గురుకుల పాఠశాలలో న్యూ కామన్ డైట్ ప్రారంభం
  • పలు చోట్ల పాల్గొన్న మంత్రులు, అధికారులు
  • అప్పుడు పట్టించుకోక.. ఇప్పుడు సోయి తప్పి మాట్లాడుతున్నరు

ఎర్రుపాలెం(మధిర)/ఖమ్మం/సికింద్రాబాద్, హైదరాబాద్ సిటీ/ఖానాపూర్/వెలుగు: గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ​రాష్ట్రంలో విద్యావ్యవస్థను భ్రష్టు పట్టించారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విమర్శించారు. పదేండ్లు అధికారంలో ఉండి.. గురుకుల పాఠశాలలు, ప్రభుత్వ హాస్టళ్ల విద్యార్థుల వసతులు, డైట్ చార్జీల పెంపు గురించి ఏమాత్రం పట్టించుకోలేదని మండిపడ్డారు. విద్యార్థుల ఆరోగ్యం దెబ్బతిన్నది వారి వల్లనే అన్న సోయి తప్పి మాట్లాడుతున్నారని ఫైర్​అయ్యారు.

వారి పాలనలో నెలల తరబడి బిల్లులు చెల్లించకుండా పెండింగ్​లో పెట్టడం వల్ల.. నాసిరకం ఆహారం తిని విద్యార్థుల ఆరోగ్యాలు దెబ్బతిన్నాయన్నారు. అప్పుడు ఏమీ పట్టించుకోకుండా ఇప్పుడు హాస్టళ్లు బాగోలేవని, భోజనం సరిగా లేదని మాట్లాడటానికి సిగ్గుండాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన మెను శనివారం మంత్రులు, అధికారులు ప్రారంభించారు. మధిర నియోజకవర్గ పరిధిలోని బోనకల్ మహాత్మా జ్యోతిబా పూలే గురుకుల పాఠశాలలో డిప్యూటీ సీఎం భట్టి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అధికారంలోకి రాగానే గురుకులాలు, హాస్టళ్ల పెండింగ్ బిల్లులు చెల్లించామన్నారు. 

పిల్లల ఎదుగుదలకు తోడ్పడేలా: పొంగులేటి

గత బీఆర్ఎస్ ​ప్రభుత్వంలో కోళ్ల ఫారాల్లో, రైస్​ మిల్లుల్లో గురుకుల పాఠశాలలు పెట్టారని మంత్రి పొంగులేటి శ్రీనివాస్​ రెడ్డి విమర్శించారు. పిల్లల శారీరక, మానసిక ఎదుగుదలకు తోడ్పడే విధంగా ఇందిరమ్మ ప్రభుత్వం న్యూ కామన్ డైట్ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నదన్నారు. శనివారం ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం మహ్మదాపురంలోని గిరిజన గురుకుల బాలుర పాఠశాల, కళాశాలలో కామన్ డైట్ మెనూ ప్రారంభ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. పేదోని పిల్లలు కూడా ధనికుల పిల్లల్లా చదవాలని ప్రభుత్వం డైట్, కాస్మెటిక్ చార్జీలను పెంచిందన్నారు.

బీఆర్ఎస్​ నేతలు ఎప్పుడైనా పిల్లలతో కలిసి భోజనం చేశారా?: పొన్నం

గతంలో ఎప్పుడైనా పిల్లలతో కలిసి భోజనం చేశారా? వారి సమస్యలు పరిష్కరించారా? అని మంత్రి పొన్నం ప్రభాకర్ బీఆర్ఎస్​ నేతలపై​ మండిపడ్డారు. గురుకులాలపై మాట్లాడే నేతలకు, గతంలో సమస్యలు కనపడలేదా అని ప్రశ్నించారు. ఇప్పటికైనా గురుకులాలపై అసత్యప్రచారాలు మానుకోవాలని హెచ్చరించారు. శనివారం హైదరాబాద్ షేక్ పేట సాంఘిక సంక్షేమ శాఖ పాఠశాల సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ బాయ్స్ కాలేజీలో కామన్ డైట్ మెనూను హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టితో కలసి ప్రారంభించారు.

గురుకులాల విద్యార్థులకు బలవర్ధకమైన ఆహారాన్ని అందించాలనేదే తమ ప్రభుత్వ సంకల్పమన్నారు. అలాగే, రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలోని సోషల్​ వెల్ఫేర్​ గర్ల్స్ రెసిడెన్షియల్​ స్కూల్​లో మున్సిపల్​ శాఖ ముఖ్య కార్యదర్శి దాన కిశోర్ న్యూ కామన్ డైట్ మెనూను ప్రారంభించారు. విద్యార్థినులు ఐఐటీల్లో ప్రవేశాలు పొందేందుకు వీలుగా ఈ స్కూల్​లో  ఐఐటీ కోచింగ్ ఇనిస్టిట్యూట్ పెట్టిస్తానన్నారు. 

అల్లు అర్జున్ పై  మాకేం కక్ష లేదు: సీతక్క

సినీ నటుడు అల్లు అర్జున్ పై రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి కక్ష లేదని మంత్రి సీతక్క అన్నారు. పుష్ప 2 సినిమా బెనిఫిట్​షో సందర్భంగా సంధ్య థియేటర్​లో జరిగిన తొక్కిసలాటలో మహిళ మృతి విషయంలోనే పోలీసులు కేసు నమోదు చేసి అతన్ని అరెస్టు చేశారన్నారు. ప్రతి విషయాన్ని బీఅర్ఎస్ నేతలు రాజకీయం చేయడం పద్ధతి కాదన్నా రు. శనివారం నిర్మల్ జిల్లా ఖానాపూర్ టౌన్​లోని బాలుర గిరిజన వసతి గృహంలో న్యూ కామన్​డైట్​ను మంత్రి ప్రారంభించారు.

అనంతరం ఆమె మాట్లాడుతూ.. పేద విద్యార్థుల కష్టాలు సీఎం రేవంత్ రెడ్డికి తెలుసని మంత్రి సీతక్క తెలిపారు. అందుకే వారిపై ప్రత్యేక శ్రద్ధ వహించి గురుకులాల అభివృద్ధికి కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారన్నారు. రాష్ట్రంలోని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ గురుకులాల్లో చదివే ప్రతి ఒక్క విద్యార్థికి నాణ్యమైన భోజనం అందించడమే తమ ప్రధాన లక్ష్యమని తెలిపారు.

సంక్షేమ హాస్టళ్లను బలోపేతం చేస్తం: ఉత్తమ్​

రాష్ట్రంలోని సంక్షేమ హాస్టళ్లను బలోపేతం చేస్తామని  మంత్రి ఉత్తమ్​కుమార్ రెడ్డి తెలిపారు. త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా యంగ్ ఇండియా ఇంటిగ్రే టెడ్ రెసి డెన్షి యల్ స్కూల్స్​ నిర్మించబోతున్నట్టు వెల్లడించారు. శనివారం సికింద్రాబాద్​లోని  మహేంద్రహిల్స్​బాలికల సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ పాఠశాలలో కంటోన్మెంట్​ ఎమ్మెల్యే శ్రీగణేష్​తో కలిసి న్యూ కామన్ మెనూ డైట్​ను మంత్రి ప్రారంభించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, వెనుకబడిన విద్యార్థుల కళ్లలో వెలుగులు నింపాలన్నదే తమ ప్రభుత్వ సంకల్పమన్నారు.