పెండింగ్ ప్రాజెక్టులు, నిధులు సాధించుకుందాం.. అన్ని పార్టీల ఎంపీలు కలిసిరావాలి: డిప్యూటీ సీఎం భట్టి

పెండింగ్ ప్రాజెక్టులు, నిధులు సాధించుకుందాం.. అన్ని పార్టీల ఎంపీలు కలిసిరావాలి: డిప్యూటీ సీఎం భట్టి
  • కేంద్రం నుంచి రావాల్సిన వాటిపై ఎంపీలకు త్వరలోనే బుక్‌లెట్ 
  • పార్లమెంట్ సెషన్‌కు ముందు ఢిల్లీలో ఆల్‌ పార్టీ మీటింగ్ పెడ్తామని వెల్లడి 
  • తెలంగాణకు కేంద్రం అన్యాయం చేస్తున్నది: అసదుద్దీన్ 
  • ఆల్ పార్టీ ఎంపీలతో ప్రజాభవన్‌లో మీటింగ్.. బీజేపీ, బీఆర్ఎస్ డుమ్మా 
  • లేట్‌గా సమాచారం ఇచ్చారంటూ భట్టికి కిషన్‌ రెడ్డి లేఖ

హైదరాబాద్, వెలుగు: కేంద్రం నుంచి రాష్ర్టానికి రావాల్సిన పెండింగ్ ప్రాజెక్టులు, నిధులు సాధించుకుందామని.. ఇందుకోసం పార్టీలకు అతీతంగా ఎంపీలందరూ కలిసి రావాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉన్న అంశాలపై శనివారం ప్రజాభవన్‌లో డిప్యూటీ సీఎం భట్టి అధ్యక్షతన అన్ని పార్టీల ఎంపీలతో మీటింగ్ నిర్వహించారు. దీనికి బీజేపీ, బీఆర్ఎస్ సభ్యులు డుమ్మా కొట్టారు. మీటింగ్ అనంతరం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. 

సమావేశంలో ప్రధానంగా రాష్ట్ర విభజన హామీలపై చర్చించామని భట్టి తెలిపారు.  ‘‘బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ, వరంగల్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, రీజినల్ రింగ్ రోడ్డు, వరంగల్ టెక్స్​టైల్​పార్క్, నవోదయ స్కూల్స్ వంటివి కేంద్రం వద్ద పెండింగ్‌‌‌‌‌‌‌‌‌‌లో ఉన్నాయి. వీటిని సాధించుకునేందుకు రాజకీయాలకు అతీతంగా రాష్ట్ర ప్రయోజనాల కోసం ఈ సమావేశం ఏర్పాటు చేశాం. కాంగ్రెస్, ఎంఐఎం, బీజేపీ, బీఆర్ఎస్​ లోక్‌‌‌‌సభ, రాజ్యసభ సభ్యులను నేనే స్వయంగా మీటింగ్‌‌‌‌కు ఆహ్వానించాను. కొన్ని కారణాల వల్ల రావడం లేదంటూ కొంతమమంది చెప్పారు. లేట్‌‌‌‌గా సమాచారం ఇచ్చారంటూ కిషన్‌‌‌‌రెడ్డి లేఖ రాశారు. 

ఇది రాజకీయ ప్రయోజనాల కోసం ఏర్పాటు చేసిన మీటింగ్ కాదు. పదేండ్లుగా కేంద్రం నుంచి, ఏపీ నుంచి పెద్ద ఎత్తున బకాయిలు రావాల్సి ఉంది. ఈ మీటింగ్‌‌‌‌లో మొత్తం 28 అంశాలపై చర్చించాం. పార్లమెంట్‌‌‌‌ సమావేశాల్లోగా పెండింగ్ అంశాలపై బుక్‌‌‌‌లెట్ తయారు చేసి ఎంపీలందరికీ అందజేస్తాం. రానున్న పార్లమెంట్‌‌‌‌ సమావేశాల ప్రారంభానికి  ముందు లేదా సమావేశాల మధ్యలో ఢిల్లీలో ఆల్ పార్టీ మీటింగ్ ఏర్పాటు చేస్తాం. 

పెండింగ్ అంశాలపై ఎంపీలందరికీ వివరించి సమాచారం అందజేస్తాం.” అని భట్టి వెల్లడించారు. కాగా, ఎంపీల మీటింగ్‌‌‌‌లో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, శ్రీధర్ బాబు పాల్గొన్నారు. కేంద్రం నుంచి రాష్ర్టానికి రావాల్సిన పెండింగ్ ప్రాజెక్టులు, నిధులపై అధికారులు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. 

పార్లమెంట్‌‌‌‌లో మద్దతు ఇస్తం: అసదుద్దీన్  

నిధుల కేటాయింపులో తెలంగాణకు కేంద్రం తీవ్ర అన్యాయం చేస్తున్నదని ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ మండిపడ్డారు. ‘‘రీజినల్ రింగ్ రోడ్, మెట్రో సెకండ్ ఫేజ్, బాపూఘాట్ అభివృద్ధి, మూసీ ప్రక్షాళనకు నిధులు కేటాయించాలని కేంద్రాన్ని రాష్ర్ట ప్రభుత్వం చాలాసార్లు కోరింది. ఐపీఎస్ అధికారుల సంఖ్య పెంచాలని వినతిపత్రాలు ఇచ్చింది. కానీ కేంద్రం పట్టించుకోవడం లేదు. రాష్ర్ట అభివృద్ధి కోసం పార్లమెంట్‌‌‌‌ లోపల, బయట ఎంఐఎం తరఫున పూర్తి మద్దతు ఇస్తాం” అని ప్రకటించారు. తెలంగాణ ప్రజలు బీజేపీ నుంచి 8 మంది ఎంపీలను గెలిపిస్తే, కేంద్రం మాత్రం రాష్ర్టం మీద సవతి తల్లి ప్రేమ చూపెడుతున్నదని ఫైర్ అయ్యారు. 

అన్యాయంపై సభలో ప్రశ్నిస్తం: చామల  

రాష్ర్టానికి రావాల్సిన పెండింగ్ ప్రాజెక్టులు, నిధులపై పార్లమెంట్‌‌‌‌లో వాయిదా తీర్మానాలు ఇస్తామని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు. క్వశ్చన్ అవర్‌‌‌‌‌‌‌‌ను ఉపయోగించుకుంటామని చెప్పారు. తెలంగాణకు జరుగుతున్న అన్యాయంపై సభలో ప్రశ్నిస్తామని, సభ బయట పోరాటం చేస్తామని వెల్లడించారు. 

ముందుగానే చెప్తే వస్తాం: కిషన్ రెడ్డి 

ఎంపీల మీటింగ్ గురించి శుక్రవారం రాత్రి ఆలస్యంగా తమకు సమాచారం అందిందని కేంద్ర మంత్రి, బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి తెలిపారు. అందువల్ల మీటింగ్‌‌‌‌కు రాలేకపోతున్నట్టు డిప్యూటీ  సీఎం భట్టికి లేఖ రాశారు. ఇలాంటి కీలకమైన సమావేశాల్లో అర్థవంతమైన చర్చ జరిగేందుకు ముందస్తుగా సమాచారం ఇవ్వాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ‘‘మహిళా దినోత్సవం కారణంగా మా ఎంపీలందరూ వారి నియోజకవర్గాల్లో ముందస్తుగా నిర్ణయించిన కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉంది. 

దీనికి తోడు ముందుగా నిర్ణయించిన ఇతర అధికారిక, అనధికారిక కార్యక్రమాల కారణంగా మీటింగ్‌‌‌‌కు మేం రాలేకపోతున్నాం” అని చెప్పారు. భవిష్యత్తులో ఎప్పుడైనా ఇలాంటి సమావేశాలు నిర్వహించాలని భావిస్తే, కాస్త ముందుగానే సమాచారమిస్తే హాజరవుతామని తెలిపారు.