అభివృద్ధి.. సంక్షేమం.. సుపరిపాలన.. ఇదే తెలంగాణ నమూనా: డిప్యూటీ సీఎం భట్టి

అభివృద్ధి.. సంక్షేమం.. సుపరిపాలన.. ఇదే తెలంగాణ నమూనా: డిప్యూటీ సీఎం భట్టి
  • పదేండ్లలో ట్రిలియన్​ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా రాష్ట్రం..     
  • బడ్జెట్​ ప్రసంగంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడి

హైదరాబాద్​, వెలుగు: ప్రజాప్రయోజనాలే ధ్యేయంగా, పారదర్శకత, జవాబుదారీతనంతో తమ ప్రజా ప్రభుత్వం సాగుతున్నదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్​ సూచించిన  నైతిక విలువలను  పాటిస్తూ  ముందుకు వెళ్తున్నామన్నారు.  అధికారాన్ని ఎవరి వ్యక్తిగత ప్రయోజనాల కోసం తాకట్టు పెట్టలేదని ఆయన స్పష్టం చేశారు. అధికార పీఠం హోదాగా భావించకుండా, ప్రజల జీవన స్థితిగతులు పెంచుతూ, మార్పు తెచ్చే బాధ్యతగా భావిస్తున్నట్లు తెలిపారు.  

అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలనే తెలంగాణ నమూనా అని ఆయన పేర్కొన్నారు. అసెంబ్లీలో బుధవారం ఉదయం 11.04 గంటలకు భట్టి విక్రమార్క 2025–26 ఆర్థిక సంవత్సరం రాష్ట్ర బడ్జెట్​ను ప్రవేశపెట్టారు. మధ్యాహ్నం 12.48 గంటల వరకు ఆయన బడ్జెట్​ స్పీచ్​ కొనసాగింది. సంక్షేమం, -అభివృద్ధిని సమపాళ్లలో రంగరించి జోడు గుర్రాల తరహాలో  సుపరిపాలనా రథాన్ని పరుగులు పెట్టించడంలో సఫలీకృతమయ్యామని తెలిపారు.  ప్రజలకు నిత్యం జవాబుదారీతనంతో ఉంటూ, విస్తృత ప్రజా ప్రయోజనాలే పరమావధిగా పాలన సాగిస్తున్నామన్నారు. 

మెగా మాస్టర్ ప్లాన్ 2050

సమ్మిళిత అభివృద్ధి, సంక్షేమాలను ప్రజలకందించేందుకు ప్రజాస్వామ్యబద్ధంగా ముందుకు సాగుతున్నామని.. దేశం మొత్తానికే ఆదర్శంగా నిలిచే విధంగా కృషి చేస్తున్నట్లు భట్టి తెలిపారు. ‘‘గత పాలకులు సృష్టించిన సవాళ్లన్నింటినీ అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే ఎదుర్కొని మా ప్రజా ప్రభుత్వం పరిపాలన సత్తాను చాటుకుంది. అదే సమయంలో లోక్​సభ ఎన్నికలు రావడం, కోడ్​ అమలులో ఉన్నందున అభివృద్ధి పనులకు కొంత విరామం ఏర్పడింది. ఇప్పుడు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పరిమాణం 200 బిలియన్ డాలర్లు. రాబోయే పదేండ్ల కాలంలో దీనిని ఐదు రెట్లు అభివృద్ధి చేసి వెయ్యి బిలియన్  డాలర్ (ఒక ట్రిలియన్- డాలర్) వ్యవస్థగా రూపాంతరం చెందే దిశగా కార్యాచరణ ఉంటుంది’’ అని భట్టి స్పష్టం చేశారు.  

హైదరాబాద్​ను గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దేందుకు మాస్టర్ ప్లాన్ ను తయారు చేస్తున్నామని భట్టి విక్రమార్క తెలిపారు. హైదరాబాద్​ని కాలుష్యరహిత నగరంగా తీర్చిదిద్దడానికి మూసీ నదీ పునరుద్ధరణ ప్రాజెక్టును ప్రారంభించామన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పాటు క్లీన్ ఎనర్జీ, సుస్థిర అభివృద్ధితో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలబెట్టేందుకు ‘మెగా మాస్టర్ ప్లాన్ 2050’ని రూపొందించినట్లు వివరించారు. ప్రతి పౌరుడికి మెరుగైన వైద్యం అందించడానికి, ఆరోగ్య సేవలను మెరుగుపరచడానికి, మెడికల్ కాలేజీల ఏర్పాటుకు భారీ స్థాయిలో కేటాయింపులు చేశామన్నారు.  

‘‘రైతుల సంక్షేమమే ప్రాధాన్యంగా పనిచేసే మా ప్రజా ప్రభుత్వం.. రాష్ట్ర రైతాంగానికి ఎప్పటికప్పుడు స్వల్పకాలిక, దీర్ఘకాలిక సహాయాన్ని అందిస్తున్నది. ఆధునిక వ్యవసాయ విధానాలను ప్రోత్సహించేందుకు సబ్సిడీలు, ప్రత్యేక ఇన్సెంటివ్ లను  ఇవ్వనున్నది. నిరుపేదల కోసం, బలహీన వర్గాల కోసం మేం తీసుకున్న ప్రతి చర్య వెనుక  మహాత్మాగాంధీ స్ఫూర్తి ఉంటుంది. అభివృద్ధి ఫలాలు సమాజంలోని చిట్టచివరి వ్యక్తికి చేర్చే లక్ష్యంతో  పనిచేస్తున్నాం” అని ఆయన పేర్కొన్నారు. గత ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ చట్టం అమలును పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని అన్నారు.  తమ ప్రజాప్రభుత్వం ఈ చట్టాన్ని తు.చ తప్పకుండా అమలు చేస్తుందని తెలిపారు.  

కోహెడలో ఎక్స్​పోర్ట్​ ఓరియెంటెడ్​ చేపల మార్కెట్​

రాష్ట్రం నుంచి భారీగా చేపల ఎగుమతిని ప్రోత్సహించడానికి రంగారెడ్డి జిల్లా కోహెడలో ఎక్స్ పోర్ట్ ఓరియంటెడ్ హోల్ సేల్ చేపల మార్కెట్ ను 47 కోట్ల వ్యయంతో నిర్మించాలని ప్రతిపాదించినట్లు భట్టి విక్రమార్క చెప్పారు. రాష్ట్రంలో మేలు జాతి పాడిపశువులను వృద్ధి చేయడానికి రంగారెడ్డి జిల్లా కంసాన్ పల్లి లో ఒక క్రొత్త ఫ్రోజెన్ సెమన్ బుల్ స్టేషన్ ను రూ.21.06 కోట్లు వ్యయంతో నిర్మిస్తున్నామని.. దీనిని అతి త్వరలోనే అందుబాటులోకి తెస్తామన్నారు. 

రంగారెడ్డి, మహబూబ్​నగర్​ జిల్లాల పరిధిలో గ్రీన్​ ఫార్మా క్లస్టర్లు ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు తెలిపారు. నల్గొండ జిల్లా దామరచర్ల మండలం వీర్ల పాలెం గ్రామంలో టీజీ జెన్కో ఆధ్వర్యంలో యాదాద్రి థర్మల్​ పవర్​ప్లాంట్​రెండు యూనిట్లలో విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించామని చెప్పారు. 2025 మే నాటికి అన్ని ఐదు యూనిట్లలో విద్యుత్ ఉత్పత్తి చేయడానికి అవసరమైన చర్యలు తీసుకుంటున్నామన్నారు.  హైదరాబాద్​లో వరద నీటిని నివారించేందుకు రూ. 5,942 కోట్ల వ్యయంతో సమగ్ర వరద నీరు పారుదల ప్రాజెక్ట్ ను మంజూరు చేశామని చెప్పారు. .

ప్రముఖుల కొటేషన్లతో సాగిన స్పీచ్​

బడ్జెట్​ ప్రసంగంలో డిప్యూటీ సీఎం భట్టి పలువురు ప్రముఖుల మాటలను కోట్​ చేశారు. ‘‘బలహీనుడైన నిరుపేద ముఖాన్ని గుర్తు తెచ్చుకో. నువ్వు తీసుకున్న చర్య అతనికి ఉపయోగపడుతుందో లేదో అని నిన్ను నువ్వు ప్రశ్నించుకో” అని మహాత్మాగాంధీ అన్న మాటలు..  ‘‘సాంకేతిక, శాస్త్రీయ శిక్షణను అందించ ని దేశం.. భవిష్య అభివృద్ధికి సంబంధించిన ఏ ప్రణా ళికను పూర్తి చేసినట్లుగా భావించలేం.  

విద్య అనేది సింహపు పాల వంటిది, వాటిని తాగిన వారు గర్జించ కుండా ఉండలేరు’’ అని బీఆర్​ అంబేద్కర్ అన్న మాట లు.. “కూటి కోసం, కూలి కోసం, పట్టణంలో బతుకుదామని తల్లిమాట చెవిన పెట్టక, బయలు దేరిన బాటసారికి ఎంత కష్టం... ఎంత కష్టం” అన్న  శ్రీశ్రీ మాటలను సందర్భానుసారం భట్టి ప్రస్తావించారు. 

త్వరలో 14,236 అంగన్ వాడీ పోస్టుల భర్తీ

రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా పదేండ్లు నిరుద్యోగ యువత  నిస్సహాయ స్థితిలో ఉండగా, తమ ప్రజా ప్రభుత్వం కొలువుదీరగానే వారికి భవిష్యత్తుపై తిరిగి ఆశను కల్పించిందని భట్టి తెలిపారు. ‘‘ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ  ఆర్థికంగా వెనుకబడిన వర్గాల యువత స్వయం ఉపాధి కల్పన కోసం  రాజీవ్ యువ వికాసం అనే పథకాన్ని ప్రారంభించాం. ఈ పథకం యువతకి ఉపాధి కల్పనలో ఒక గేమ్ ఛేంజర్​గా నిలుస్తుంది. రాష్ట్రంలో 2023 జూలై - సెప్టెంబర్ కాలంలో నిరుద్యోగ రేటు 22.9 శాతం ఉండగా, 2024 జూలై - సెప్టెంబర్ కాలంలో అది 18.1 శాతానికి తగ్గింది. 

ప్రభుత్వ శాఖల్లో 57,946 ఉద్యోగాల ఎంపిక ప్రక్రియ పూర్తి చేశాం.  30,228 కొత్త పోస్టులను మంజూరు చేశాం.  14,236 అంగన్ వాడీ పోస్టుల భర్తీకి ఆదేశాలు జారీ చేశాం. యంగ్ ఇండియా స్కిల్​ యూనివర్సిటీని ముచ్చర్లలో 150 ఎకరాలలో నిర్మించి, ఏడాదికి 30 వేల ఉద్యోగాలు కల్పించాలని ప్రభుత్వ లక్ష్యంగా పెట్టుకుంది. ఫ్యూచర్ సిటీలో ప్రత్యేకంగా 200 ఎకరాలలో ఏఐ సిటీని నెలకొల్పుతాం” అని వివరించారు. రాష్ట్రంలోని పెండింగ్ ప్రాజెక్టులన్నింటినీ పూర్తి చేసేందుకు ప్రణాళికలు రూపొందించుకొని ప్రాధాన్య క్రమంలో ఎ, బి కేటగిరీలుగా విభజించామని డిప్యూటీ సీఎం భట్టి తెలిపారు.

దశాబ్దకాలం.. ఆర్థిక అరాచకత్వం

పాలన వ్యవస్థల విధ్వంసం , ఆర్థిక అరాచకత్వంతో కూడిన దశాబ్ద కాలం పాలనతో తెలంగాణ ఆర్థిక వ్యవస్థ ఛిద్రమైందని గత బీఆర్​ఎస్​ పాలనపై భట్టి మండిపడ్డారు. ప్రజా ప్రభుత్వం కొలువుదీరిన ఏడాదిలోనే ఆర్థిక వ్యవస్థలను గాడిలో పెడుతున్నామని, సవాళ్లను ఎదుర్కొని ముందుకు సాగుతున్నామని తెలిపారు. 

తెలంగాణ తాత్కాలిక, దీర్ఘకాలిక ప్రయోజనాలు, లక్ష్యాలను దృష్టిలో ఉంచుకొని, తమ ప్రభుత్వం నిరంతరం పని చేస్తున్నదన్నారు. ప్రభుత్వం చేసే ప్రతి చర్యను శంకిస్తూ, నిరాధారమైన విమర్శలు చేయడమే కొందరు పనిగా పెట్టుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘సోషల్ మీడియాలో, సొంత పత్రికల్లో అబద్ధపు వార్తలతో ప్రజలను మోసం చేస్తున్నారు” అని ఫైర్​ అయ్యారు. 

పన్నుల వాటాను పెంచాలని కోరినం

కేంద్ర పన్నుల పంపిణీలో రాష్ట్రాలకు న్యాయమైన వాటా కల్పించాలని 16వ ఆర్థిక సంఘాన్ని కోరినట్లు భట్టి తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రాలకు ఇస్తున్న 41 % పన్నుల వాటాను 50 శాతానికి పెంచాలని ప్రతిపాదించామన్నారు. కేంద్ర ప్రభుత్వం విధిస్తున్న సెస్సులు, అదనపు చార్జీల వల్ల రాష్ట్రాలకు వస్తున్న ఆదాయం గణనీయంగా తగ్గుతుందని వివరించినట్లు తెలిపారు. తెలంగాణ సహా దక్షిణాది రాష్ట్రాలకు పన్నుల పంపిణీలో తగ్గుతున్న వాటాపై ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసిందన్నారు. 

తెలంగాణకు 14వ ఆర్థిక సంఘం ద్వారా 2.437 శాతం నిధుల పంపిణీ జరిగితే, 15వ ఆర్థిక సంఘం కాలంలో ఇది 2.102 శాతానికి తగ్గిందని చెప్పారు. అభివృద్ధిలో ముందున్న రాష్ట్రాలకు తక్కువ నిధులు కేటాయించడం అన్యాయమన్నారు. సమాంతర పన్నుల పంపిణీ సూత్రంలో సంస్కరణలు తీసుకురావాలని సూచించినట్లు తెలిపారు. 

కొత్త రేషన్​ కార్డులు.. సన్నబియ్యం

గత ప్రభుత్వం పేదలను పట్టించుకోలేదని భట్టి విక్రమార్క మండిపడ్డారు. కనీసం కొత్త కుటుంబ సభ్యుల పేర్లను కూడా రేషన్ కార్డుల్లో జత చేయలేదని విమర్శించారు. ‘‘ప్రజల ఆకాంక్షలను గుర్తించిన మేము అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు ఇవ్వాలని, వారికి సన్నబియ్యం కూడా ఇవ్వాలని నిర్ణయించాం. నూతన రేషన్ కార్డుల జారీ,  కుటుంబ సభ్యుల పేర్లను నమోదు చేసే ప్రక్రియ ఈ సంవత్సరం జనవరి 26 నుంచి ప్రారంభించాం” అని ఆయన వివరించారు. 

ఇతరముఖ్య పథకాలకుకేటాయింపులు(రూ. కోట్లలో):

  • విద్యుత్​ సబ్సీడీ11,500
  • రాజీవ్ యువ వికాసం6,000
  • స్కాలర్​షిప్ప్​ అండ్​ స్టైపెండ్స్​4,452
  • కల్యాణలక్ష్మి,షాదీ ముబారక్3,683
  • ఎస్డీఎఫ్​, సీడీపీ ఫండ్స్​3,300
  • సన్నబియ్యం, రైస్​ సబ్సిడీ3,000
  • యంగ్​ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్​​ స్కూల్స్2,900
  • డైట్​ ఛార్జీలు2,659
  • ఇండస్ట్రియల్​ ఇన్సెంటివ్స్​1,730
  • రైతు బీమా1,589
  • డ్వాక్రా మహిళలకు వడ్డీలేని రుణాలు 1,511
  • వంద శాతం గ్రామాలకు సోలార్​ 1,500
  • వంద శాతం గ్రామాలకు సోలార్​1,500
  • నగరాభివృద్ధి సిటీలడెవలప్​మెంట్​కు1,000
  • టూరిజం ప్రాజెక్టులకు 721
  • ఇందిర గిరి జలవికాసం600
  • యూనివర్సిటీల్లో మౌలిక సదుపాయాల కల్పన 500
  • ఆర్​ అండ్​ బీ, పంచాయతీరాజ్​ రోడ్లు మెయింటెనెన్స్​500
  • ఫ్యూచర్​ సిటీ డెవలప్​మెంట్​ అథారిటీకి  100
  • గ్యారంటీలతో కలిపి మొత్తం  1,04,329


రాష్ట్ర పన్ను ఆదాయం 1,45,419 కోట్లు

  • స్టాంప్స్​ అండ్​ రిజిస్ట్రేషన్స్​, వాహనాలపై ట్యాక్స్, ఇతరాలు 29,321 కోట్లు
  • జీఎస్టీ, పెట్రోల్, డీజిల్,ట్రేడ్ ఇతర పన్నులు88,463 కోట్లు
  • ఎక్సైజ్ ఆదాయం27,623 కోట్లు
  • రెవెన్యూ ఆదాయం2,29,720.62 కోట్లు
  • రెవెన్యూ వ్యయం 2,26,982.29  కోట్లు
  • మూలధన వ్యయం 36,504.45   కోట్లు
  • గత అప్పుల వడ్డీలకు19,369.02 కోట్లు
  • గత అప్పుల కిస్తీలకు,లోన్లు, అడ్వాన్సులు 37,198.55 కోట్లు