తెలంగాణలో రైతులకు మరో కొత్త స్కీం.. డిసెంబర్ 28న అకౌంట్లోకి రూ. 6 వేలు

తెలంగాణలో రైతులకు మరో కొత్త స్కీం.. డిసెంబర్ 28న అకౌంట్లోకి  రూ. 6 వేలు
  • రూ. 6 వేల చొప్పున అందజేస్తాం: డిప్యూటీ సీఎం భట్టి
  • సంక్రాంతికి రైతు భరోసా అమలు 
  • రైతుల కోసం ఏడాదిలో రూ. 50 వేల కోట్లు ఖర్చు చేశాం 
  • బీఆర్ఎస్ రూ. 7 లక్షల కోట్ల అప్పులు మిగిల్చింది
  • ఆ పార్టీ నేతలు హరీశ్, కేటీఆర్ పచ్చి అబద్ధాలు చెప్తున్నరు  
  • అప్పులపై చర్చకు సిద్ధమా? అని సవాల్ 
  • ఖమ్మంలో మీడియాతో మాట్లాడిన డిప్యూటీ సీఎం 

ఖమ్మం టౌన్, వెలుగు:   ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు భూమిలేని నిరుపేద రైతు కూలీలకు ఏటా రెండు విడతల్లో రూ. 12 వేల ఆర్థిక సాయం అందజేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు. మొదటి విడత డబ్బులను ఈ నెల 28వ తేదీన రిలీజ్ చేస్తామని ప్రకటించారు. దేశ స్వాతంత్ర్యం కోసం అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఏర్పాటైన రోజు (డిసెంబర్ 28) సందర్భంగా రైతు కూలీలకు మొదటి విడతగా రూ. 6 వేలను అందజేస్తామన్నారు. అలాగే రైతన్నలకు రైతు భరోసా కింద పెట్టుబడి సాయం అందించేందుకూ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన విధంగా సంక్రాంతి పండుగకు రైతు భరోసా డబ్బులు జమ చేస్తామని తెలిపారు. ఆదివారం ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వ అప్పులు, ఆర్థిక పరిస్థితిపై ప్రతిపక్ష బీఆర్ఎస్ ప్రజలను తప్పుదోవ పట్టించేలా దుష్ప్రచారం చేస్తోందని ఫైర్ అయ్యారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం పదేండ్లు రాష్ట్రాన్ని పాలించి రూ. 7,11,911 కోట్ల అప్పులను మిగిల్చిందని భట్టి విక్రమార్క ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన11 నెలల కాలంలో రూ. 54 వేల కోట్ల అప్పులు చేశామని.. ఇందులో రూ. 66 వేల కోట్లను గత అప్పులకు వడ్డీలు, కిస్తీలుగా కట్టామన్నారు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా.. తాము ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నామని చెప్పారు. అయినా అప్పులపై బీఆర్ఎస్ నేతలు హరీశ్ రావు, కేటీఆర్ పచ్చి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ అప్పులపై చర్చకు సిద్ధమా? అని సవాల్ విసిరారు. 

 ఏడాదిలో వ్యవసాయానికి రూ. 50 వేల కోట్లు.. 

రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు వ్యవసాయానికి, రైతుల కోసం నేరుగా రూ. 50,953 కోట్లు ఖర్చు చేశామని భట్టి తెలిపారు. రైతు భరోసాకు రూ. 7,625 కోట్లు, రుణమాఫీకి రూ. 21 వేల కోట్లు, రైతు బీమా ప్రీమియం కింద రూ. 1,514 కోట్లు, విత్తనాలు, పంపుసెట్లు, ఇరిగేషన్ పనులు, ఇతరత్రా కలిపి మొత్తం రూ. 50 వేల కోట్లకుపైనే వ్యవసాయ రంగానికి ఖర్చు చేశామన్నారు. సన్న వడ్ల బోనస్ ద్వారా ఎకరాకు రూ. 10 నుంచి రూ. 15 వేలు అదనంగా రైతులకు లబ్ధి చేకూర్చామన్నారు. 

రాష్ట్రవ్యాప్తంగా పరిశ్రమల విస్తరణ కోసం ప్రజా ప్రభుత్వం కొత్తగూడెం, రామగుండం, ఆదిలాబాద్, వరంగల్ ప్రాంతాల్లో కొత్తగా నాలుగు ఎయిర్ పోర్టులను ఏర్పాటు చేస్తోందని భట్టి తెలిపారు. రాష్ట్ర అభివృద్ధిలో భాగంగా ఫ్యూచర్ సిటీ, స్కిల్ యూనివర్సిటీ, మూసీ ప్రక్షాళన, ఇండస్ట్రియల్, హౌసింగ్ క్లస్టర్ల వంటివి ఏర్పాటు చేస్తున్నామన్నారు. విద్యార్థులకు మెరుగైన భవిష్యత్తు కోసం హాస్టళ్లలో సౌలతులు పెంచుతున్నామన్నారు. విద్యార్థులకు మంచి భోజనం అందించేందుకు డైట్ చార్జీలను 40% పెంచామన్నారు. అలాగే కాస్మొటిక్ చార్జీలను సైతం 200% పెంచామని తెలిపారు. అలాగే ప్రతి నియోజకవర్గానికి 3,500 చొప్పున ఇందిరమ్మ ఇండ్లను శాంక్షన్ చేశామన్నారు. సమావేశంలో కాంగ్రెస్ నేతలు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు, కార్పొరేటర్లు పాల్గొన్నారు.