- కాళేశ్వరంపై బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం బట్టబయలైంది: డిప్యూటీ సీఎం భట్టి
- వ్యవసాయానికి బడ్జెట్ లో రూ. 72 వేల కోట్లు కేటాయించినం
- రైతులు, శాస్త్రవేత్తలకు ఇందిరా గాంధీ పురస్కారాల ప్రదానం
హైదరాబాద్, వెలుగు:ఈ ఏడాది రాష్ట్రంలో రికార్డు స్థాయిలో వడ్ల దిగుబడి వచ్చిందని.. కాంగ్రెస్ హయాంలో కట్టిన ప్రాజెక్టులతోనే ఈ ఘనత సాధ్యమైందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఆనాడు కాంగ్రెస్ పాలకులు దూరదృష్టితో బహుళార్థ సాధక ప్రాజెక్టులు నిర్మించారని తెలిపారు. ప్రజా పాలన విజయోత్సవాల్లో భాగంగా మంగళవారం పీసీసీ ఆధ్వర్యంలో నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో నిర్వహించిన ఇందిరా గాంధీ వ్యవసాయ ప్రతిభా పురస్కారాల ప్రదానోత్సవ కార్యక్రమానికి భట్టి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఆదర్శ రైతులకు, శాస్త్రవేత్తలకు అవార్డులు ప్రదానం చేశారు. “ఇండియా గుండె చప్పుడు ఇందిరా’’ అనే పుస్తకాన్ని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్‌గౌడ్ తో కలిసి రిలీజ్చేశారు. అనంతరం భట్టి మాట్లాడుతూ.. కాళేశ్వరం వల్లే తెలంగాణలో వరి సాగు పెరిగిందన్న బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం ఇప్పుడు బట్టబయలు అయిందన్నారు.
‘‘కాళేశ్వరంలో భాగమైన మేడిగడ్డ కుంగి నీటిని నిల్వ చేసే పరిస్థితి లేకపోయినా, ఎన్డీఎస్‌ఏ సూచన మేరకు అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లో నీటిని నిల్వ చేయకపోయినా.. ఈ సారి వరి ఉత్పత్తి పెరగడానికి ఆనాటి కాంగ్రెస్ పాలకులు కృష్ణా నదిపై నాగార్జునసాగర్, శ్రీశైలం, జూరాల, నెట్టెంపాడు, కోయిల, కల్వకుర్తి ఎత్తిపోతల, గోదావరి నదిపై ఎస్సారెస్పీ, దేవాదుల, శ్రీపాద ఎల్లంపల్లి తదితర బహుళార్థ సాధక ప్రాజెక్టులు నిర్మించి రైతులకు సాగునీరు అందించిన ఫలితమే” అని అన్నారు.
భూ సంస్కరణల చట్టం తీసుకొచ్చి కొద్ది మంది చేతుల్లో ఉన్న లక్షల ఎకరాల భూములను పేదలకు పంచి లక్షల మంది రైతులను తయారు చేసిన ఘనత దివంగత ప్రధాని ఇందిరాగాంధీకే దక్కుతుందన్నారు. పంచవర్ష ప్రణాళికలో వ్యవసాయ రంగాన్ని చేర్చిన దార్శనీకురాలని కొనియాడారు. ఇందిరాగాంధీ స్ఫూర్తితోనే ప్రజా ప్రభుత్వం రాష్ట్ర చరిత్రలో ఎన్నడు లేని విధంగా వ్యవసాయానికి రాష్ట్ర బడ్జెట్లో రూ.72 వేల కోట్లు కేటాయించి రైతులను ప్రోత్సహిస్తుందన్నారు.
దేశ చరిత్రలో ఏ రాష్ట్రం అమలు చేయని విధంగా కేవలం 15 రోజుల్లో రైతుల రుణమాఫీ కోసం రూ.18 వేల కోట్లు వారి ఖాతాల్లో జమ చేసి తెలంగాణ రోల్ మోడల్ గా నిలిచిందన్నారు. పంట బీమా పథకాన్ని అమలు చేస్తున్నామని.. రైతులపై భారం మోపకుండా ప్రీమియం డబ్బులను ప్రభుత్వమే చెల్లిస్తున్నదని చెప్పారు. వ్యవసాయ రంగాన్ని అస్థిరపరిచిన ధరణీని ప్రక్షాళన చేస్తున్నామన్నారు. రైతుల కోసం ఈ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి- సంక్షేమ కార్యక్రమాలను విస్తృతంగా కాంగ్రెస్ శ్రేణులు రైతుల వద్దకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.
మహేశ్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. దేశంలో ఇందిరా గాంధీ ఫొటో లేని ఇల్లు ఉండదన్నారు. సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్న చరిత్ర ఇందిరమ్మది అని గుర్తు చేశారు. పది నెలల్లో తాము చేసిన అభివృద్ధి ఎంత.. పదేండ్లలో బీఆర్ఎస్ సర్కార్ చేసిన అభివృద్ధి ఎంతో చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు.
బీఆర్ఎన్నేతలు రైతుల భూములు గుంజుకొని..లేఅవుట్లు చేసి అమ్ముకున్నరు
ఆనాటి కాంగ్రెస్ పాలకులు రైతులు, దళితులకు అసైన్ చేసిన భూములను.. బలవంతంగా గుంజుకొని వాటిల్లో లేఅవుట్లు వేసి అమ్మిన దుర్మార్గులు బీఆర్ఎస్ నేతలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. అలాంటి వారు లగచర్ల రైతుల గురించి మాట్లాడడం అంటే దయ్యాలు వేదాలు వల్లించినట్లేనని మండిపడ్డారు. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా మంగళవారం హైదరాబాద్ నెక్లస్ రోడ్ లోని పీవీ మార్గ్ వద్ద ఉన్న ఇందిరా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.
అనంతరం పీసీసీ ఆధ్వర్యంలో గాంధీభవన్లో ఏర్పాటుచేసిన ఇందిరా జయంతి కార్యక్రమంలో పాల్గొని ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తో కలిసి భట్టి మీడియా సమావేశంలో మాట్లాడారు.
ఆనాటి కాంగ్రెస్ పాలకులు రాష్ట్రంలో 24 లక్షల ఎకరాల భూమిని రైతులకు పంపిణీ చేస్తే..దాంట్లో హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉన్న 10 వేల ఎకరాలకు పైగా భూమిని బీఆర్ఎస్ పాలకులు రైతుల నుంచి బలవంతంగా గుంజుకొని వేలం వేసి అమ్ముకున్నారని మండిపడ్డారు. అలాంటి బీఆర్ఎస్ పాలకులకు భూ సేకరణ బాధితుల గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. 2013 లో ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం భూసేకరణ చట్టం తీసుకు వచ్చిందని, ఆ చట్టం ప్రకారమే రైతుల నుంచి రాష్ట్ర అభివృద్ధి కోసం భూములు తీసుకుంటామే తప్ప.. మీలాగా రైతుల నుంచి బలవంతంగా గుంజుకోబోమని స్పష్టం చేశారు.