- ప్రపోజల్స్ రెడీ చేయాలనిడిప్యూటీ సీఎం భట్టి ఆదేశం
- అద్దె భవనాల కిరాయి బిల్లులు క్లియర్ చేస్తున్నమని వెల్లడి
హైదరాబాద్, వెలుగు:పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ప్రభుత్వ రెసిడెన్షియల్ విద్యాసంస్థల స్టూడెంట్ల మెస్ చార్జీలు పెంచాలని నిర్ణయం తీసుకున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. సంబంధిత అధికారులు సమావేశమై అన్ని రకాల అంశాలను పరిశీలించి మెస్ చార్జీల పెంపుపై ప్రపోజల్స్ రెడీ చేయాలని ఆదేశించారు. మెస్ చార్జీలతో పాటు కాస్మోటిక్స్, టూటర్ల చార్జీల పెంపు పైన నిర్ణయం తీసుకోవాలన్నారు.
అద్దె భవనాల కిరాయి బిల్లుల పెండింగ్‌పై సమీక్షించి.. నిధులు రిలీజ్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. మంగళవారం సెక్రటేరియెట్‌లో జరిగిన ప్రభుత్వ రెసిడెన్షియల్ విద్యాసంస్థల కార్యదర్శులతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల మెస్, కాస్మొటిక్స్ బిల్లులు ఎప్పటికప్పుడు చెల్లిస్తున్నామని.. అధికారులు ఈ విషయాలకే పరిమితం కాకుండా బోధనలో నాణ్యతను పెంచేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. టీచింగ్ జరుగుతున్న తీరుపై నిపుణులతో పర్యవేక్షణ జరిపించి టీచర్లకు అవసరమైన సూచనలు, సలహాలు ఇప్పించాలని కోరారు.
వీటీచింగ్, లెర్నింగ్, మెటీరియల్ వినియోగం పెంచండి, కంప్యూటర్లు, సైన్స్ ఇతర ల్యాబ్‌ల వినియోగాన్ని విస్తృతం చేయాలని ఆదేశించారు. రెసిడెన్షియల్ విద్యాసంస్థల సెక్రటరీలు క్షేత్రస్థాయిలో ఉండాలని, ప్రతిరోజు ఒక పాఠశాలను పరిశీలించాలని.. సగం పూట అక్కడే ఉండి అన్ని రకాల విషయాలను సమీక్షించాలని ఆదేశించారు.
నెలాఖరులోగా కార్యదర్శులు ఎన్ని విద్యాసంస్థలను సందర్శించారు, ఏయే అంశాలను గుర్తించారు, ఏం చర్యలు చేపట్టారు రిపోర్టు ఇవ్వాలని పేర్కొన్నారు. ప్రభుత్వ రెసిడెన్షియల్ విద్యాసంస్థలను సందర్శించాలని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సమాచారం అందించామని.. వారు విజిట్ చేసిన సమయంలో స్థానికంగా ఉన్న సమస్యలపై నేరుగా రెసిడెన్షియల్ విద్యాసంస్థల కార్యదర్శిలనే ప్రశ్నిస్తారన్న విషయాన్ని గమనంలో పెట్టుకోవాలని తెలిపారు.
ఈ సమావేశంలో స్పెషల్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు, విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం, ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా, డిప్యూటీ సీఎం స్పెషల్ సెక్రటరీ కృష్ణ భాస్కర్, రెసిడెన్షియల్ పాఠశాలల సెక్రటరీలు సైదులు, తఫ్సీల్ ఇక్బాల్, సీతాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.