సాధ్యం కాదన్న 2లక్షల రుణమాఫీ చేసిచూపించాం: డిప్యూటీ సీఎం భట్టి

సాధ్యం కాదన్న 2లక్షల రుణమాఫీ చేసిచూపించాం: డిప్యూటీ సీఎం భట్టి

ఖమ్మం: సాధ్యం కాదన్న 2లక్షల రుణమాఫీ చేసిచూపించామన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.  ఈ రోజు చరిత్రలో లిఖించదగిన రోజు అన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. దేశ చరిత్రలో తొలిసారి రూ.2లక్షల రుణమాఫీ కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందన్నారు.  ఛాలెంజ్ చేసి ఆగస్టు 15నాటికి రుణమాఫీ చేస్తామని చెప్పాం... చేసి చూపించామన్నారు. 

గత సర్కార్ నాలుగు దఫాలుగా ఇచ్చిన రుణమాఫీ వడ్డీలకే సరిపోలేదన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. పదేళ్లలో బీఆర్ ఎస్ సర్కర్ లక్ష రుణమాఫీ కూడా చేయలేదన్నారు. పదేళ్లలో వేలకోట్లు ఖర్చు చేసి సీతారామ ప్రాజెక్టు కట్టారు.. ఒక్క ఎకరాకు కూడా నీళ్లివ్వలేదని విమర్శించారు. రూ. 30వేల కోట్లతో పూర్తి చేయాల్సిన కాళేశ్వరం, సీతారామ ప్రాజెక్టులను రూ లక్షా 30వేల కోట్లు ఖర్చు చేశారని అన్నారు. కమీషన్లకోసమే ఇందిర, రాజీవ్ ప్రాజెక్టులను రీడిజైన్ చేశారని భట్టి చెప్పారు.  

మరోవైపు గురువారం ఆగస్టు 15 నాడు ఖమ్మం జిల్లాలో సీతారామ ప్రాజెక్టు మూడు పంప్ హౌజ్ లను ప్రారంభించారు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. మొదటి పంప్ హౌజ్ ను రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రారంభించగా.. ములకలపల్లి మండలం కమలాపూరం వద్ద మూడో పంప్ హౌజ్ ను డిప్యటీ సీఎం భట్టి ప్రారంభించారు. 

పూసుగూడెం వద్ద రెండో పంప్ హౌజ్ ను సీఎం రేవంత్ రెడ్డి స్విచ్ ఆన్ చేసి ప్రారంభించారు.  సీతారామ ప్రాజెక్టును 2026 ఆగస్టు  15 వరకు పూర్తి చేసి గోదావరి జలాలను  జిల్లా ప్రజలకు అందిస్తామన్నారు. గోదావరి నీటిని కృష్ణా పరివాహక ప్రాంతాలకు తరలించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదే అన్నారు.