
- నిర్దిష్ట గడువు పెట్టుకొని పనులు చేయండి: డిప్యూటీ సీఎం భట్టి
హైదరాబాద్, వెలుగు: భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ (బీటీపీఎస్) పెండింగ్ పనులను వేగంగా పూర్తి చేయాలని జెన్‌కో అధికారులను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశించారు. ఆదివారం ప్రజా భవన్‌లో బీటీపీఎస్ అభివృద్ధి, పురోగతి పనులపై అధికారులతో సమీక్షించారు. బీటీపీఎస్ పవర్ ప్లాంట్‌లో బీహెచ్ఎల్ కంపెనీ అగ్రిమెంట్ ప్రకారం చేయాల్సిన ఎలక్ట్రికల్, సివిల్, మెకానికల్ పెండింగ్ పనులను పూర్తి చేసేందుకు గడువు విధించి, పనుల్లో వేగం పెంచాలని ఆదేశించారు.
అలాగే, పవర్ ప్లాంట్ యూనిట్1 ఉత్పత్తికి సంబంధించి కాలిపోయిన జనరేటర్ ట్రాన్స్‌ఫార్మర్ మరమ్మతుల గురించి ఆరా తీశారు. ఈ పనులకు సంబంధించి టెండర్లు పిలిచామని, పనులు పురోగతిలో ఉన్నాయని భట్టికి అధికారులు వివరించారు. విద్యుత్తు ఉత్పత్తికి ఆటంకం కలగకుండా ఉండేందుకు మరో జనరేటర్ ట్రాన్స్‌ఫార్మర్ కొనుగోలు చేస్తున్నామని, దీనికి కూడా టెండర్ పిలిచామన్నారు. జెన్‌కో పరిధిలోని పవర్ ప్లాంట్‌లలో టెక్నికల్ సమస్యలతో ఉత్పత్తి నిలిచిపోతే వేగంగా పునరుద్ధరించేందుకు డైరెక్టర్, చీఫ్ ఇంజినీర్ అధికారులతో త్రీమెన్ కమిటీ వేయాలని అధికారులను భట్టి ఆదేశించారు.
రైల్వే లైన్ పనులపై ఆరా..
భద్రాద్రి ప్లాంటు పనితీరు, వర్షాకాలంలో బొగ్గు నిల్వ చేయడానికి కావాల్సిన షెడ్డు నిర్మాణ పనులు, సింగరేణి మైనింగ్ నుంచి భద్రాద్రి పవర్ ప్లాంట్ వరకు బొగ్గు రవాణా చేయడానికి ఏర్పాటు చేస్తున్న రైల్వే లైన్ పనులపై అధికారులను భట్టి అడిగి తెలుసుకున్నారు. వర్షాకాలంలో తడి బొగ్గుతో కరెంట్ ఉత్పత్తి చేయడంతో నష్టం వస్తుందని అధికారులు తెలుపగా.. బొగ్గు నిల్వ చేసేందుకు షెడ్డు నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు.
అలాగే, 18.67 కిలోమీటర్ల పొడవున రైల్వే లైన్ నిర్మాణ పనులకు 201.30 ఎకరాలు భూసేకరణ జరుగుతున్నదని చెప్పారు. భద్రాద్రి ప్లాంట్‌లో ఏ చిన్న సంఘటన జరిగిన పవర్ ప్లాంటు చీఫ్ ఇంజనీర్ పూర్తి బాధ్యత వహించడంతో పాటు వెంటనే ఆ విషయాన్ని తనతో పాటు సీఎండీ దృష్టికి తేవాలన్నారు. పవర్ ప్లాంటులో పని చేయడానికి కావాల్సిన నాన్ టెక్నికల్ కార్మికులను ఐటీడీఏ ప్రాజెక్టు డైరెక్టర్ ద్వారా స్థానిక గిరిజనులను నియమించాలని సూచించారు.
విద్యుత్తు ఉత్పత్తికి వాడుతున్న బొగ్గు నుంచి వస్తున్న బూడిదను వినియోగంలోకి తేచ్చేందుకు ఆలోచన చేస్తున్నట్టు వివరించారు. ఇందిరమ్మ ఇండ్లకు బూడిదతో ఇటుకలు తయారు చేసుకునే వెసులుబాటును స్థానిక ట్రైబల్ యువతకు ఇస్తే లాభం చేకూరుతుందన్నారు. ఈ సమావేశంలో ఎనర్జీ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా, జెన్‌కో డైరెక్టర్లు ఆజయ్, సచ్చిదానందం, లక్ష్మయ్య, చీఫ్ ఇంజినీర్లు శ్రీనివాస్ రావు, రత్నాకర్ రావు, పీవీ శ్రీనివాస్, జేవా కుమార్, రాంప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.