- గత ప్రభుత్వ అప్పులు రూ.31 వేల కోట్లు రీషెడ్యూల్ చేయండి
- కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలకు డిప్యూటీ సీఎం భట్టి రిక్వెస్ట్
- పెండింగ్ నిధులు రూ.1,800 కోట్లు రిలీజ్ చేయాలని వినతి
న్యూఢిల్లీ, వెలుగు : గత పదేండ్లలో ఆనాటి బీఆర్ఎస్ సర్కార్ అడ్డగోలుగా తెచ్చిన అప్పులకు వడ్డీ రేట్లు తగ్గించాలని డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు శనివారం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ తో ఆయన భేటీ అయ్యారు. దాదాపు అరగంట సాగిన ఈ భేటీలో రాష్ట్రానికి సంబంధించిన ఎనిమిది ఆర్థికాంశాలను ఆమె దృష్టికి తీసుకెళ్లారు. తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర ఆర్థిక స్థితిగతులను కేంద్ర మంత్రికి వివరించి సాయం అందించాలని కోరినట్లు తెలిపారు.
కేంద్ర ప్రాయోజిత పథకాల నిధుల విడుదలతో పాటు విభజన చట్టం ప్రకారం రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి విజ్ఞప్తి చేశామన్నారు. గత బీఆర్ఎస్ సర్కార్ పెద్ద మొత్తంలో బడ్జెటేతర రుణాలు చేసిందన్నారు. ఇందులో రూ.31,795 కోట్ల మేర అధిక వడ్డీకి తెచ్చిన రుణాలు ఉన్నాయని చెప్పారు. జీతాల కంటే ఎక్కువ మొత్తం అప్పులపై వడ్డీకే కట్టాల్సి వస్తుందన్నారు. అలా ఈ అప్పులు రాష్ట్ర ఖజనాపై తీవ్ర రుణభారాన్ని మోపుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. అందువల్ల ఈ రుణాలను రీషెడ్యూల్ చేసి కొంత ఉపశమనం కలిగించాలని కేంద్ర మంత్రిని రిక్వెస్ట్ చేశారు.
దీంతో పాటు ఏపీ నుంచి తెలంగాణకి రావాల్సిన విద్యుత్బకాయి నిధుల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. విభజన చట్టం ప్రకారం.. తెలంగాణలో ఆ నాటి తొమ్మిది వెనకబడిన జిల్లాలకు రూ. 50 కోట్ల చొప్పున, ఏడాది రూ.450 కోట్లు రిలీజ్ చేయాల్సి ఉందన్నారు. అయితే నాలుగేండ్లుగా ఈ నిధులు ఇవ్వడం లేదని.. మొత్తం రూ. 1,800 కోట్ల బకాయి నిధుల్ని వెంటనే రిలీజ్ చేయాలని డిమాండ్ చేశారు. తమ విజ్ఞప్తులపై కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్ సానుకూలంగా స్పందించారని చెప్పారు. త్వరలోనే కేంద్ర, రాష్ట్ర ఉన్నతాధికారులతో సమావేశాన్ని ఏర్పాటు చేసి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారన్నారు. కాగా ఢిల్లీ పర్యటనలో భాగంగా శనివారం మరోసారి పార్టీ చీఫ్ ఖర్గేను భట్టి మర్యాదపూర్వకంగా కలిసారు. ఆయనతో పలు అంశాలపై చర్చించినట్లు తెలిసింది.