
- ఇచ్చిన మాట నిలబెట్టుకున్నం
- యాదాద్రి ప్లాంట్ నిర్వాసితులకు ఉద్యోగాలిచ్చాం: డిప్యూటీ సీఎం భట్టి
- గత బీఆర్ఎస్ సర్కార్ పట్టించుకోలే
- ప్రజా ప్రభుత్వమే యువతకు అండగా ఉన్నదని వ్యాఖ్య
- 112 మందికి నియామక పత్రాలు
హైదరాబాద్, వెలుగు: యాదాద్రి థర్మల్ ప్లాంట్ భూ నిర్వాసితులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నామని డిప్యూటీ సీఎం భట్టి అన్నారు. గత బీఆర్ఎస్ సర్కార్ నిర్వాసితులను పట్టించుకోలేదని మండిపడ్డారు. యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ భూ నిర్వాసితుల కోటాలో ఉద్యోగాలు పొందిన 112 మందికి భట్టి విక్రమార్క హైదరాబాద్‌లోని సైబర్ గార్డెన్లో శుక్రవారం నియామక పత్రాలు అందజేశారు.
ఈ సందర్భంగా భట్టి మాట్లాడారు. ‘‘జూనియర్ అసిస్టెంట్, జూనియర్ ప్లాంట్ అటెండెన్స్, ఆఫీస్ సబ్ ఆర్డినేట్, హౌస్ కీపర్స్ తో పాటు టీజీపీఎస్సీ ద్వారా ఆర్థిక శాఖలో కొత్తగా నియామకమైన డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్స్‌కు నియామక పత్రాలు అందజేశాం. గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా నిర్వాసితులు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
జాబ్‌లు ఇస్తామని చెప్పి చాలా ఏండ్లుగా ఇవ్వకపోవడంతో వయసు దాటిపోయి చాలా మంది ఉద్యోగ అవకాశం కోల్పోయారు. నిరుద్యోగ యువతీ, యువకుల ఆశలు నిజం చేయడానికి ప్రజా ప్రభుత్వం అండగా ఉంటుంది. నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించినప్పుడే కొట్లాడి తెచ్చుకున్న రాష్ట్రానికి అర్థం ఉంటది. అదే ఆలోచనతో ప్రజాప్రభుత్వం ముందుకు వెళ్తున్నది. మేము అధికారంలోకి వచ్చినప్పటి నుంచి 59వేల మందికి ఉద్యోగ నియామకపత్రాలు ఇచ్చాం. ప్రజలకు సేవ చేసే అవకాశం ఇందిరమ్మ ప్రభుత్వం కల్పించింది’’అని భట్టి విక్రమార్క అన్నారు.
యువత కోసం రాజీవ్ యువ వికాసం పథకం
ఉద్యోగ అవకాశాలు పొందలేని యువత కోసం రూ.9వేల కోట్లతో రాజీవ్ యువ వికాసం పథకాన్ని ప్రారంభించామని భట్టి విక్రమార్క అన్నారు. ‘‘రూ.9వేల కోట్లు స్వయం ఉపాధికి కేటాయించడం రాష్ట్ర చరిత్రలో ఇదే మొదటిసారి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం మాదిరిగా ప్రకటన చేసి వదిలేయలేదు. రాజీవ్ యువ వికాస స్కీమ్ ప్రకటనకు ముందే దరఖాస్తుల ప్రక్రియ, లబ్ధిదారుల ఎంపిక, సాంక్షన్, గ్రౌండింగ్ చేసే వరకు క్యాలెండర్ ఫిక్స్ చేసినం.
ప్రైవేటు రంగంలో యువతకు ఉపాధి కల్పించడానికి హైదరాబాద్ నగరంలో ఐటీ సెక్టార్, నాలెడ్జ్ వ్యవస్థలను ప్రజా ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నది. నాడు కొండలు గుట్టలతో ఉన్న ప్రాంతంలో హైటెక్ సిటీ నెలకొల్పేందుకు ఆ నాటి కాంగ్రెస్ సీఎం నేదురుమల్లి జనార్దన్ రెడ్డి పునాదులు వేశారు. ఆ తర్వాత వచ్చిన సీఎంలు ఐటీ సెక్టార్ ను అభివృద్ధి చేయడంతో ఈ రోజు హైదరాబాద్ గ్లోబల్ సిటీగా మారింది’’అని భట్టి అన్నారు.
అభివృద్ధిని అడ్డుకునేందుకు కొందరు కుట్రలు
హైదరాబాద్‌ను విస్తరించడానికి ఫ్యూచర్ సిటీని నిర్మించి అందులో స్కిల్, స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటుకు ప్రాధాన్యత ఇస్తున్నామని భట్టి విక్రమార్క తెలిపారు. ‘‘యువతకు ఉపాధి కల్పించడానికి సీఎం రేవంత్ రెడ్డి దావోస్ కు వెళ్లి రూ.1.84 లక్షల కోట్ల పెట్టుబడులకు ఎంవోయూ చేసుకున్నారు. ఔటర్, రీజినల్ రింగ్ రోడ్ మధ్య చేయాల్సిన అభివృద్ధి పట్ల ప్రత్యేక ప్లాన్‌తో ప్రభుత్వం ముందుకు వెళ్తున్నది.
ప్రజా ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని అడ్డుకునేందుకు చేస్తున్న కొందరి కుట్రల పట్ల యువత అప్రమత్తంగా ఉండాలి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వదిలేసిన యాదాద్రి థర్మల్ ప్లాంట్‌పై ప్రజాభిప్రాయ సేకరణ చేయించాం. ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ తీసుకొచ్చాం. నిర్మాణ పనులపై క్యాలెండర్ ఫిక్స్ చేసి సమీక్షలు జరిపాం.
మొత్తం పనులు పూర్తి చేయించి సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించుకున్నాం’’అని భట్టి తెలిపారు. ప్లాంట్ ప్రారంభోత్సవం సందర్భంగా భూములు, ఇండ్లు కోల్పోయిన నిర్వాసితులకు ఉద్యోగాలివ్వాలని తీసుకున్న నిర్ణయాన్ని నిజం చేశామని అన్నారు.
ఉద్యోగుల పెండింగ్ బిల్లులు త్వరలో రిలీజ్
పెండింగ్‌లో ఉన్న ఉద్యోగుల బిల్లులు త్వరలోనే విడుదల చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. పెండింగ్ బిల్లులు వెంటనే విడుదల చేయాలని కోరుతూ శుక్రవారం ప్రజాభవన్‌లో తెలంగాణ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ వి.లచ్చిరెడ్డి ఆధ్వర్యంలో జేఏసీ ప్రతినిధులు భట్టిని కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను డిప్యూటీ సీఎంకు లచ్చిరెడ్డి వివరించారు. ఇందులో ప్రధానంగా ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన పెండింగ్ బిల్లుల క్లియరెన్స్ తో పాటు రాష్ట్ర స్థాయిలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల పెండింగ్ బిల్లుల క్లియరెన్స్ గురించి ను వివరించారు. ఈ మేరకు భట్టి సానుకూలంగా స్పందించినట్లు లచ్చిరెడ్డి తెలిపారు. త్వరలోనే పెండింగ్ బిల్లులకు మోక్షం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. డిప్యూటీ సీఎంను కలిసిన వారిలో డిప్యూటీ కలెక్టర్ల అసోసియేషన్ జనరల్ సెక్రటరీ రామకృష్ణ, టీజీటీఏ రాష్ట్ర అధ్యక్షుడు రాములు, జనరల్ సెక్రటరీ రమేశ్ పాక తదితరులు ఉన్నారు.