ఆరు గ్యారంటీలను వంద రోజుల్లో అమలు చేస్తామని తెలంగాణ ఉపముఖ్యమంత్రి భట్టీ విక్రమార్క అన్నారు. ఖమ్మం జిల్లాలో మంత్రులు మల్లు భట్టీ విక్రమార్క, పొంగులేటీ శ్రీనివాస రెడ్డి, తుమ్మల నాగేశ్వర రావులు డిసెంబర్ 10వ తేదీ ఆదివారం ఖమ్మం జిల్లాలో పర్యటించారు. మంత్రులుగా ప్రమాణం చేసిన తర్వాత తొలిసారిగా జిల్లాకు వచ్చిన మంత్రులకు కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. అనంతరం మంత్రులు మీడియా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి భట్టీ విక్రమార్క మాట్లాడుతూ.. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 10 స్థానాలకు 9 స్థానాలు కాంగ్రెస్‌కు ఇచ్చినందుకు జిల్లా ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఆరు గ్యారంటీలకు వారంటీ లేదని బీఆర్ఎస్ విమర్శించిందని... వారంటీ లేదన్న వారికి చెంపదెబ్బ తగిలేలా ప్రజలు బుద్ది చెప్పారని అన్నారు. అధికారం చేపట్టిన రెండు రోజుల్లోనే ఆరు గ్యారంటీల్లో రెండు గ్యారంటీలను ప్రారంభించామన్నారు.
మేనిఫెస్టోలో పెట్టిన ప్రతి హామీకి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని.. ప్రతి పథకాన్ని అమలు చేస్తామన్నారు. రాష్ట్రంలో ఉన్న వనరులను వాడుకుని సంపద సృష్టించి.. పేద ప్రజలకు పంచడమే కాంగ్రెస్ అజెండాగా చెప్పారు. రాష్ట్రంలో బహుళార్థక ప్రాజెక్టులు చేపడతామని.. ఐటీ రంగాన్ని మరింత అభివృద్ధి చేస్తామన్నారు. త్వరలోనే పోడు భూముల సమస్యలు పరిష్కరిస్తామని భట్టీ విక్రమార్క తెలిపారు.