
- రూ.26వేల కోట్లతో రాజస్థాన్‌లో జాయింట్ వెంచర్
- సింగరేణి చరిత్రలో వ్యాపార విస్తరణకు నాంది పడిందని వ్యాఖ్య
- తెలంగాణతో ఒప్పందం చేసుకోవడం సంతోషంగా ఉన్నది: రాజస్థాన్ సీఎం భజన్‌లాల్
- జైపూర్‌లో ఒప్పందాలపై సంతకాలు
హైదరాబాద్, వెలుగు: రాజస్థాన్‌లో సింగరేణి ఆధ్వర్యంలో 3,100 మెగావాట్ల పవర్ ప్లాంట్ ఏర్పాటుకు ఒప్పందం కుదిరిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటించారు. రాజస్థాన్ విద్యుత్ శాఖతో కలిసి ప్లాంట్ నిర్మించనున్నట్లు తెలిపారు. 136 ఏండ్ల సింగరేణి చరిత్రలో వ్యాపార విస్తరణకు నాంది పడిందన్నారు. సింగరేణి, రాజస్థాన్ విద్యుత్ శాఖకు అనుబంధంగా ఉన్న నిగమ్ లిమిటెడ్ కంపెనీతో జాయింట్ వెంచర్ గా ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. రూ.26,200 కోట్లతో ఈ ప్లాంట్ నిర్మిస్తున్నట్లు ప్రకటించారు.
జైపూర్‌లో ఆ రాష్ట్ర సీఎం భజన్‌లాల్ శర్మ, విద్యుత్ శాఖ మంత్రి హీరాలాల్ సమక్షంలో సోమవారం సింగరేణి, రాజస్థాన్ విద్యుత్ ఉత్పాదన్ నిగమ్ లిమిటెడ్ అధికారులు ఒప్పందాలపై సంతకాలు చేశారన్నారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడారు. ‘‘సింగరేణి చరిత్రలో ఈ ఒప్పందం ఒక చరిత్రాత్మక ఘట్టం. త్వరలోనే ఇది కార్యాచరణలోకి వస్తుంది. సింగరేణి వ్యాపార విస్తరణ, సుస్థిర భవిష్యత్ కోసం ఈ డీల్ ఎంతో దోహదం చేస్తుంది.
అపారమైన బొగ్గు నిల్వలతో థర్మల్ విద్యుత్‌కు నిలయంగా తెలంగాణ ఉన్నది. అటు రాజస్థాన్ స్టేట్.. సోలార్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రంగా ఉన్నది. రెండు రాష్ట్రాలు దేశంలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నాయి. దేశ ఇంధన రంగంలో రెండు రాష్ట్రాలు విప్లవాత్మకమైన మార్పునకు శ్రీకారం చుట్టాయి. తెలంగాణ, రాజస్థాన్ విద్యుత్ అవసరాలు తీర్చడంలో ఈ ఒప్పందం కీలకంగా మారనున్నది. నిరంతర విద్యుత్ సరఫరాకు ఇది ఎంతో దోహదపడుతుంది’’అని భట్టి అన్నారు.
3,100 మెగావాట్ల ఒప్పందం వివరాలు ఇవే..
సింగరేణి ఆధ్వర్యంలో రాజస్థాన్‌లో 3,100 మెగావాట్ల పవర్ ప్లాంట్ల నిర్మాణం చేయనున్నారు. ఈ ఒప్పందం ప్రకారం.. 1,600 మెగావాట్ల (2x800 మెగావాట్ల) థర్మల్ విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుతో పాటు 1,500 మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్లాంట్ల నిర్మాణానికి రెండు రాష్ట్రాలు అంగీకరించాయి. మొత్తం పెట్టుబడిలో సింగరేణి సంస్థ 74 శాతం వాటాను, రాజస్థాన్ స్టేట్ విద్యుత్ ఉత్పాదన్ నిగమ్ లిమిటెడ్ 26 శాతం వాటాను చెల్లించనున్నాయి.
రాజస్థాన్ ప్రభుత్వం తన వాటా కింద చెల్లించాల్సిన 26 శాతం ధనాన్ని సోలార్, థర్మల్ విద్యుత్ ప్లాంట్లకు అవసరమైన స్థలాలు, మౌలిక సదుపాయాల రూపంలో కాగా, సింగరేణి తన వాటాగా అంగీకరించిన 74 శాతాన్ని ధన రూపంలో చెల్లించనున్నది. ప్లాంట్లు ఏర్పాటు చేసేందుకు అవసరమైన స్థలాన్ని అన్ని రకాల అనుమతులతో సింగరేణికి రాజస్థాన్ ప్రభుత్వం
అప్పగించనున్నది.
సింగరేణితో ఒప్పందం సంతోషకరం: రాజస్థాన్ సీఎం భజన్‌లాల్ శర్మ
బొగ్గు ఉత్పత్తి, థర్మల్ పవర్ జనరేషన్లో ఎంతో అనుభవం ఉన్న సింగరేణితో కలిసి పనిచేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని రాజస్థాన్ సీఎం భజన్ లాల్ శర్మ అన్నారు. తమ రాష్ట్ర విద్యుత్ శాఖ కోల్ ఇండియా అనుబంధ సంస్థలతో మాత్రమే ఇలాంటి ఒప్పందాలు చేసుకున్నదని తెలిపారు. ఇప్పుడు కోల్, థర్మల్, సోలార్ విద్యుత్ రంగాల్లో అనుభవం ఉన్న సింగరేణితో ఒప్పందం కుదుర్చుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు.
భవిష్యత్తులో సింగరేణితో కలిసి మరిన్ని కొత్త ప్రాజెక్ట్‌లు చేపడ్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాజస్థాన్ ఇంధన శాఖ అడిషన్ చీఫ్ సెక్రటరీ అలోక్, తెలంగాణ ఎనర్జీ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా, ట్రాన్స్ కో సీఎండీ కృష్ణ భాస్కర్, సింగరేణి సీఎండీ ఎన్.బలరామ్, సింగరేణి డైరెక్టర్ డి.సత్యనారాయణ రావు పాల్గొన్నారు.