- జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు పెంచుతం: భట్టి
- సమగ్ర సర్వే వివరాలు దాచిపెట్టం.. పరిస్థితులను ప్రజలకు వివరిస్తం
- వ్యక్తిగత వివరాలు బయట పెట్టం.. విద్యుత్ కొనుగోళ్లపై జ్యుడీషియల్ కమిషన్
- నివేదికనూ ప్రజల ముందు పెడ్తామని వెల్లడి
హైదరాబాద్, వెలుగు: సమగ్ర కులగణన సర్వే తర్వాత జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లను పెంచుతామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు. అవసరమైతే రిజర్వేషన్లు 50 శాతం దాటుతాయని, సర్వే తర్వాత వచ్చిన వివరాల ఆధారంగా చర్చించి, నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వే చేసి.. ఆ వివరాలు బయటకు చెప్పలేదని, తాము కుల గణన సర్వే తర్వాత రాష్ట్రంలో ఎవరెవరి పరిస్థితులు ఎలా ఉన్నాయనే వివరాలు ప్రజల ముందు పెడ్తామని స్పష్టం చేశారు. వ్యక్తిగత డేటాను గోప్యంగా ఉంచుతామని, దానిపై ఏం చేయాలనేది నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.
బుధవారం ప్రజాభవన్‌లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడారు. సమాజంలోని సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ అవకాశాలను మెరుగుపర్చడానికి అవసరమైన ప్రణాళికలు రూపొందించి, వాటిని అమలు చేయడమే ఈ సమగ్ర కులగణన సర్వే ఉద్దేశమని వివరించారు. రేషన్ కార్డులు, సంక్షేమ పథకాలను తొలగించేందుకు ఈ సర్వే చేపట్టడం లేదని క్లారిటీ ఇచ్చారు.
కుట్రతోనే కుల గణనపై దుష్ప్రచారం
సంపదను దోచుకున్న కొందరు కుట్రతోనే కులగణనపై దుష్ప్రచారం చేస్తున్నారని భట్టి విక్రమార్క మండిపడ్డారు. సమాజంలో చీలికలు తెచ్చే ఉద్దేశంతో తాము సర్వే చేయడం లేదని చెప్పారు. కులగణన విషయంలో ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయన్నారు. తెలంగాణను కేటీఆర్, హరీశ్ రావు, కేసీఆర్ దోచుకున్నారని ఆరోపించారు. వాళ్లు పదేండ్ల కింద చేసిన సమగ్ర కుటుంబ సర్వే వివరాలు బయటకు చెప్పలేదని, వాళ్లు ఇప్పుడు మాట్లాడుతుంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టే ఉన్నదని ఎద్దేవా చేశారు. రూ.7 లక్షల కోట్లపైగా అప్పులు చేసి, ఆర్థిక వ్యవస్థను విచ్ఛిన్నం చేశారని తెలిపారు.
హరీశ్ రావుకు భారత రాజ్యాంగాన్ని అమలు చేయాలన్న ఆలోచన లేదని తెలిపారు. ఎన్యుమరేటర్లు సర్వేకు వచ్చినప్పుడు ఆధార్, ధరణి పాస్ బుక్, రేషన్ కార్డును దగ్గర ఉంచుకోవాలని, అప్పుడే సర్వే త్వరగా పూర్తవుతుందని వెల్లడించారు. సమాజంలో అన్ని వర్గాల నుంచి అభిప్రాయాలు తీసుకున్న తర్వాత సర్వేలో చేర్చాల్సిన ప్రశ్నావళి, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, విధివిధానాలపై సమాలోచనలు జరిపి, షెడ్యూల్‌ను ఖరారు చేసినట్టు విక్రమార్క తెలిపారు.
మొత్తం 75 ప్రశ్నలతో కుటుంబ సమాచారాన్ని సేకరిస్తున్నట్టు చెప్పారు. కులగణన కోసం ప్రైమరీ టీచర్లు, పలు ప్రభుత్వ శాఖ ఉద్యోగులను ఎన్యుమరేటర్లుగా ఎంపిక చేసినట్టు తెలిపారు. కులగణనలో వచ్చిన ఫలితాలను బట్టి తెలంగాణ సమాజం భవిష్యత్ నిర్మాణం ఉంటుందని వివరించారు. ఇక విద్యుత్ కొనుగోళ్లపై జ్యుడీషియల్ కమిషన్ రిపోర్ట్‌పై మీడియా ప్రశ్నించగా.. ఆ నివేదికను కూడా ప్రజల ముందు పెడుతామని చెప్పారు.
హైడ్రాపై ఆందోళన వద్దు
హైదరాబాద్, వెలుగు: -బ్యాంకర్లు హైడ్రా గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, భవనాల నిర్మాణాలకు ఆ సంస్థ ఎలాంటి అనుమతులు ఇవ్వదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. జీహెచ్ఎంసీ, టౌన్ ప్లానింగ్ వంటి ప్రభుత్వ విభాగాలు అన్ని అంశాలు పరిశీలించి నిర్మాణాలకు అనుమతులిస్తాయని, ఏ ప్రభుత్వమైనా వీటిని కొనసాగిస్తాయని వివరించారు. ట్రాఫిక్ నియంత్రణతో పాటు పార్కులు, చెరువులు, ప్రభుత్వ భూములు అక్రమార్కులు ఆక్రమించుకోకుండా హైడ్రా చూస్తుందని తెలిపారు.
బుధవారం ప్రజా భవన్‌లో ఏర్పాటు చేసిన స్టేట్ లెవెల్ బ్యాంకర్ల ప్రత్యేక సమావేశంలో ఆయన మాట్లాడారు. మహిళల ఆదాయాన్ని పెంచేందుకు ప్రభుత్వమే బస్సులు కొనుగోలు చేసి వారికి లీజుకు ఇవ్వాలని ఆలోచన చేస్తుందని తెలిపారు. అలాగే, స్వయం సహాయక సంఘాల ఆదాయం పెంచేందుకు అనేక కార్యక్రమాలు చేపడుతున్నామని చెప్పారు.
ప్రభుత్వంలోని కొన్ని శాఖలకు బ్యాంకుల నుంచి చేయూత అందించాలనే ఉద్దేశంతో ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేసుకోవడం అభినందనీయమన్నారు. భవిష్యత్తులోనూ ఈ సంప్రదాయాన్ని కొనసాగిద్దామన్నారు. ఈ సమావేశం ఏర్పాటుకు చొరవ చూపిన బ్యాంకర్లు, స్పెషల్ సీఎస్ రామకృష్ణారావును భట్టి అభినందించారు.
ప్రజల పట్ల కమిట్మెంట్‌తో ఉన్నాం..
తమది ప్రజా ప్రభుత్వం, ప్రజల పట్ల కమిట్మెంట్‌తో ఉన్నామని డిప్యూటీ సీఎం భట్టి అన్నారు. ఉచిత బస్సు ప్రయాణం మహిళలు ఊరికే తిరగడానికి అని కొంతమంది అనుకుంటారని.. అది వాస్తవం కాదన్నారు. కుటుంబాలకు ఆర్థికంగా చేయూత ఇవ్వాలనే ఉద్దేశంతోనే మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించామన్నారు. స్వయం సహాయక సంఘాలకు ఈ ఏడాది రూ. 20 వేల కోట్ల వడ్డీ లేని రుణాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందని, వీలైతే అంతకుమించి రుణాలు ఇస్తామని చెప్పారు. స్వయం సహాయక సంఘాల సభ్యులకు ఇచ్చిన రుణాల రికవరీ 98 శాతానికి పైగా ఉందన్నారు.
ఈ నేపథ్యంలో బ్యాంకర్లు మహిళా సంఘాలకు తక్కువ వడ్డీకి ఎక్కువ మొత్తంలో రుణాలు ఇవ్వాలని సూచించారు. గిరిజన ప్రాంతాల్లోని సంఘాలు రూ.200 కోట్ల వరకు తీసుకున్న రుణాలు చెల్లించలేని పరిస్థితిలో ఉన్నారని, వారు తీసుకున్న రుణాలు మాఫీ చేయడం లేదంటే వన్ టైం సెటిల్మెంట్ చేసే అవకాశాన్ని పరిశీలించాలన్నారు. వ్యవసాయం తర్వాత పెద్ద సంఖ్యలో ఉపాధి కల్పించేది ఎంఎస్‌ఎంఈలేనని.. రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో ఇండస్ట్రియల్ పార్కులు తీసుకొస్తున్నామని, ఇందుకోసం బ్యాంకర్లు సహకరించాలని కోరారు.
పన్ను ఎగవేతదారుల పట్ల అప్రమత్తంగా ఉండాలి
ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టే పన్ను ఎగవేతదారులపట్ల అప్రమత్తంగా ఉండాలని భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. సిమెంట్, స్టీల్, స్క్రాప్ ట్రేడర్స్ ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్నుల విషయంలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని సూచించారు. ప్రజాభవన్ లో రెవెన్యూ మొబిలైజేషన్ పై కమర్షియల్ ట్యాక్స్, ట్రాన్స్పోర్ట్, స్టాంప్స్ అండ్ రెవెన్యూ, టీజీఎండీసీ, ఎక్సైజ్ తదితర శాఖల ఉన్నతాధికారులతో భట్టి బుధవారం రివ్యూ మీటింగ్ నిర్వహించారు.
శాఖల వారీగా సాధించిన పురోగతి వివరాలు, రెవెన్యూ మొబిలైజేషన్ కోసం రూపొందించిన ప్రణాళికలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా డిప్యూటీ సీఎంకు అధికారులు వివరించారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడారు. ‘‘శాఖల వారీగా నిర్దేశించుకున్న ఆదాయ లక్ష్య సాధనలో ప్రతి నెలా పురోగతి సాధించాలి. రాష్ట్రంలో పలుచోట్ల ఉన్న ఐరన్ మైనింగ్స్ ను టీజీ ఎండీసీకి రిజర్వ్ చేయాలని కేంద్రానికి పంపిన ప్రతిపాదనలపై భూగర్భ గనుల శాఖ కార్యదర్శి సురేంద్రమోహన్ ఫాలో అప్ చేయాలి. ప్రతి మండల కేంద్రంలో ఇసుక మార్కెట్ యార్డులు ఏర్పాటు చేసి సమృద్ధిగా అందుబాటులో ఉంచడానికి కావాల్సిన చర్యలు తీసుకోవాలి. దళారుల బెడద లేకుండా నేరుగా ఇండ్లు నిర్మాణం చేసుకునే వారికి ఇసుక సరఫరా చేయాలి’’అని భట్టి ఆదేశించారు.