సమగ్ర సర్వే వివరాల డేటా ఎంట్రీ కీలకం: భట్టి

  • డిజిటలైజేషన్​లో పొరపాట్లకు తావివ్వొద్దు
  • డోర్​ లాక్​, అందుబాటులో లేని వారి వివరాలు సేకరించండి
  • ఉన్నతాధికారులు, కలెక్టర్లతో డిప్యూటీ సీఎం భట్టి వీడియో కాన్ఫరెన్స్
  • ఇంటివద్ద ఎవరూ లేకుంటే ఫోన్​కాల్​ చేయండి
  • గురుకులాల్లో ఫుడ్​ పాయిజన్ పై అప్రమత్తంగా ఉండండి

హైదరాబాద్, వెలుగు : సమగ్ర ఇంటింటి కుల గణన సర్వే చివరి దశకు చేరుకున్నదని, ఆ వివరాలను కంప్యూటరైజ్​  చేయడం చాలా కీలకమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు. డిజిటలైజేషన్​లో ఎలాంటి పొరపాట్లకు అవకాశం ఇవ్వొద్దని అన్నారు. ఆదివారం జార్ఖండ్ రాజధాని రాంచీ నుంచి సమగ్ర ఇంటింటి సర్వేపై భట్టి విక్రమార్క వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఉన్నతాధికారులు, కలెక్టర్లకు పలు సూచనలు చేశారు.

సర్వే వివరాల సేకరణలో పట్టణ ప్రాంతాల్లో డోర్ లాక్, ఇంటి వద్ద అందుబాటులో లేకపోవడం వంటి కొన్ని సమస్యలు తలెత్తాయని తెలిపారు. కాబట్టి వారికి ఫోన్ కాల్​ చేసి సర్వే గురించి తెలియజేయడం ద్వారా వివరాలను క్రమబద్ధీకరించుకోవాలని సూచించారు.   గ్రామీణ ప్రాంతాల్లో వలస వెళ్లినవారి వివరాలను జాగ్రత్తగా నమోదు చేసుకోవాలని అన్నారు.  కొన్ని హాస్టల్స్​, రెసిడెన్షియల్ పాఠశాలల్లో ఫుడ్ పాయిజన్ కేసులు నమోదవుతున్నాయని తెలిపారు. ఈ పాఠశాలల్లో ఆహారం, పరిశుభ్రతపై  సీఎం రేవంత్​ రెడ్డి  ప్రత్యేక దృష్టి సారించారని, తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

అలాగే, ఇలాంటి సమస్యలు తలెత్తకూడదనే మెస్, కాస్మోటిక్​ చార్జీలను ప్రభుత్వం పెంచిందని అన్నారు. ఫుడ్ పాయిజన్, అపరిశుభ్రత వంటి అంశాలకు తావు లేకుండా కార్యాచరణ ప్రణాళిక రూపొందించడానికి సంబంధిత అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహిస్తామని చెపపారు.  వీడియో కాన్ఫరెన్స్​లో ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, జీహెచ్ఎంసీ కమిషనర్, అన్ని జిల్లాల కలెక్టర్లు పాల్గొన్నారు.

ఎన్నుకున్న ప్రజల కోసం కష్టపడి పనిచేయండి

జార్ఖండ్ కాంగ్రెస్ నేతలంతా తమను ఎన్నకున్న ప్రజల కోసం కష్టపడి పని చేయాలని ఏఐసీసీ పరిశీలకుడు, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సూచించారు. ఆదివారం ఉదయం సీఎం హేమంత్ సోరేన్ తో పాటు కాంగ్రెస్ కీలక నేతలతో ఆయన చర్చలు జరిపారు. ఆ తర్వాత ఇండియా కూటమి నేతలంతా కలిసి గవర్నర్​ను కలిసి సంఖ్యా బలాన్ని వివరించారు. ఈ సందర్భంగా కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలను భట్టి అభినందించారు.

అనంతరం రాంచీలోని హోటల్ చాణక్యలో నూతనంగా ఎన్నికైన కాంగ్రెస్ ఎమ్మెల్యేల సమావేశంలో డిప్యూటీ సీఎం ప్రసంగించారు. ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని వికృత పార్టీ చూస్తోందని ఆరోపించారు. అటువంటి విచ్ఛిన్నకర పార్టీని కాదని తమను ఎన్నుకున్న ప్రజల జీవితాల్లో మార్పులు తీసుకురావడానికి కృషి చేయాలని ఎమ్మెల్యేలను కోరారు. రాజకీయాల్లో పని చేయడం ఒక ఎత్తు అయితే కాంగ్రెస్ పార్టీలో పని చేయడం అదృష్టమని చెప్పారు.

ఈ పార్టీ దేశాన్ని వలస పాలన నుంచి విముక్తి చేసిందని, ప్రజాస్వామ్య పరిరక్షణకు అలుపెరగని పోరాటం చేస్తున్నదని  తెలిపారు. ఈ  కార్యక్రమంలో  కాంగ్రెస్ పార్టీ జార్ఖండ్ ఇన్ చార్జ్ సిరివెళ్ల ప్రసాద్, ఏఐసీసీ సెక్రటరీ గులాం అహ్మద్ మీర్, సీనియర్ పరిశీలకుడు, పీసీసీ ప్రెసిడెంట్ కేశవ్ మహా తదితరులు పాల్గొన్నారు.