కంపెనీలు పెట్టేందుకు యువత ముందుకొస్తే రుణాలిస్తాం

కంపెనీలు పెట్టేందుకు యువత ముందుకొస్తే రుణాలిస్తాం
  • పారిశ్రామికరంగ అభివృద్దికి ప్రభుత్వం కృషి
  • ఖమ్మం జిల్లాలో ఇండస్ట్రియల్‌‌‌‌‌‌‌‌ పార్క్‌‌‌‌‌‌‌‌ శంకుస్థాపనలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క

మధిర, వెలుగు : కంపెనీలు ఏర్పాటు చేసేందుకు యువత ముందుకు వస్తే లోన్లు ఇప్పిస్తామని, అవసరమైన అన్ని వసతులు కల్పిస్తామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క చెప్పారు. పారిశ్రామికరంగ అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం యండపల్లి గుట్ట వద్ద ఏర్పాటు చేయనున్న ఇండస్ట్రియల్‌‌‌‌‌‌‌‌ పార్క్‌‌‌‌‌‌‌‌కు సోమవారం ఆయన శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా నిర్వహించిన మీటింగ్‌‌‌‌‌‌‌‌లో భట్టి మాట్లాడుతూ స్వయం సహాయక సంఘాల మహిళలకు ప్రతి ఏడాది రూ.20 వేల కోట్ల వడ్డీ లేని లోన్లు మంజూరు చేస్తున్నట్లు చెప్పారు. మహిళలకు లోన్లు, మార్కెటింగ్‌‌‌‌‌‌‌‌ వసతులు కల్పించి వారు పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు ప్రోత్సాహం అందిస్తున్నామన్నారు. వ్యవసాయంతో పాటు పరిశ్రమలు, సేవారంగాల్లో అభివృద్ధి సాధిస్తేనే సమాజానికి మేలు జరుగుతుందన్నారు.

చదువుకున్న వాళ్లందరికీ ఉద్యోగాలు రావడం కష్టమని, పరిశ్రమల ఏర్పాటు ద్వారానే గ్రామీణ యువతకు ఉపాధి దొరుకుతుందన్నారు. మధిరలో ఇండస్ట్రియల్‌‌‌‌‌‌‌‌ పార్క్‌‌‌‌‌‌‌‌ చేయడం తన కల అని చెప్పారు. రూ. 45 కోట్లతో 55 ఎకరాల్లో ఈ పార్క్‌‌‌‌‌‌‌‌ను ఏర్పాటు చేస్తున్నామని, వెంటనే టెండర్లు పిలిచి వేగంగా పనులు ప్రారంభిస్తామన్నారు. ఈ పార్క్‌‌‌‌‌‌‌‌ను రాష్ట్రానికి రోల్‌‌‌‌‌‌‌‌మోడల్‌‌‌‌‌‌‌‌గా తీర్చిదిద్దాలని ఆఫీసర్లను ఆదేశించారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు తక్కువ రేటుకే ప్లాట్లు కేటాయిస్తామని, ఎస్సీ, ఎస్టీ, బీసీలతో పాటు మహిళలకు రిజర్వేషన్లు కల్పిస్తామన్నారు. కార్యక్రమంలో ఖమ్మం కలెక్టర్​ ముజమ్మిల్‌‌‌‌‌‌‌‌ ఖాన్‌‌‌‌‌‌‌‌, వివిధ శాఖల ఆఫీసర్లు పాల్గొన్నారు.