- దేశంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే భర్తీ చేస్తాం: భట్టి విక్రమార్క
- రైతులకు చట్టబద్ధంగా మద్దతు ధర కల్పిస్తామని వెల్లడి
- పంజాబ్ ఎన్నికల ప్రచారంలో డిప్యూటీ సీఎం
హైదరాబాద్, వెలుగు:
ఇండియా కూటమి అధికారంలోకి రాగానే రైతులకు చట్టబద్ధంగా కనీస మద్దతు ధరను అందిస్తామని, వారి కష్టానికి తగిన ఫలితం రాబోయే రోజుల్లో దక్కనుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఆదివారం పంజాబ్‌లోని ఫరీద్ కోట్ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని మొగ అసెంబ్లీ నియోజకవర్గంలో ఆయన ఎన్నికల ప్రచారంలో మాట్లాడారు. దేశంలో వరి, పత్తి, చెరుకు రైతులకు మద్దతు ధర లభించడం లేదని ఆరోపించారు.
ప్రధాని మోదీ రైతు చట్టాలు తెచ్చి.. వారి ధనాన్ని లాక్కోవడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. నిరుద్యోగుల కోసం అప్రెంటిషిప్ హక్కు కల్పిస్తూ కొత్త చట్టాన్ని తీసుకొస్తామని, ఇందులో గ్రాడ్యుయేట్స్, డిప్లొమా చేసిన వారిని అర్హులుగా చేస్తామని తెలిపారు. పబ్లిక్, ప్రైవేటు సెక్టార్లలో సుమారు 30 లక్షల ఉద్యోగ ఖాళీలు ఉన్నాయని, వీటిని కూడా భర్తీ చేస్తామని భట్టి వెల్లడించారు. గవర్నమెంట్ ఆఫీసులు, యూనివర్సిటీలు, కాలేజీలు, స్కూళ్లు, హాస్పిటళ్లలో నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తామని చెప్పారు. ఉపాధి హామీ కూలీని రూ.250 నుంచి రూ.400కు పెంచుతామన్నారు. ఆశ, అంగన్వాడీ మహిళల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని చెప్పారు.
ప్రజలను లక్షాధికారుల్ని చేస్తాం..
గత పదేండ్లలో మోదీ ప్రభుత్వం 25 మంది బడా వ్యాపారులకు సంబంధించిన రూ.16 లక్షల కోట్ల రుణాలను మాఫీ చేసిందని భట్టి విక్రమార్క ఆరోపించారు. ఈ మాఫీ డబ్బులతో 24 ఏండ్ల పాటు ఉపాధి హామీ పథకాన్ని అమలు చేయొచ్చన్నారు. బీజేపీ ప్రభుత్వం 25 మందిని కుబేరులను చేస్తే.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే కోట్ల మంది దేశ ప్రజల్ని లక్షాధికారులని చేస్తుందని చెప్పారు. మోదీ, అమిత్ షా ఆందోళనలో ఉన్నారని, వీరిద్దరు అభివృద్ధిని చూసి ఓటు వేయమని అడగడం లేదన్నారు. మటన్, మందిర్, మంగళసూత్రం, మైనార్టీ లాంటి అంశాలపైనే వీరు మాట్లాడుతున్నారని ఆరోపించారు.
కాంగ్రెస్‌ను చూసి బీజేపీ భయపడుతోందని, అందుకే తమ పార్టీ నేతలను టార్గెట్ చేసి మోదీ విమర్శలు చేస్తున్నారన్నారు. ఆలిండియా సర్వీసెస్ అధికారుల్లో ఎస్సీ, ఎస్టీలు ఎంతమంది ఉన్నారో కేంద్ర ప్రభత్వం చెప్పడం లేదని విమర్శించారు. ఇండియా కూటమి అధికారంలోకి రాగానే రిజర్వేషన్ ప్రకారం పోస్టులు ఇస్తామని, మహిళలకు 50 శాతం జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పిస్తామని ఆయన వెల్లడించారు.