- టీఎస్ జెన్కో, సింగరేణి సహకారంతో ఏర్పాటు
- అతి త్వరలోనే విధానపరమైన నిర్ణయాలు
- పత్తిపాక రిజర్వాయర్ కోసం బడ్జెట్ కేటాయించాం
- ఎల్లంపల్లి భూనిర్వాసితుల పెండింగ్ సమస్యలు పరిష్కరిస్తం
- డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
గోదావరిఖని: రామగుండంలో 800 మెగావాట్ల సూపర్ క్రిటికల్ పవర్ ప్లాంట్ నిర్మాణం చేయాలని డిసైడయ్యామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. టీఎస్ జెన్కో, సింగరేణి సహకారంతో ప్లాంట్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. పెద్దపల్లి జిల్లా రామగుండం థర్మల్బీ పవర్ ప్లాంట్‌ను మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, ఎంపీ గడ్డం వంశీకృష్ణ, ఎమ్మెల్యేలు వివేక్ వెంకటస్వామి, విజయ రమణా రావు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, గడ్డం వినోద్, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, సింగరేణి సీఎండీ బలరాం పరిశీలించారు. ఈసందర్భంగా --డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ ‘రామగుండం సమస్యలపై ఎమ్మెల్యే రాజ్ఠాకూర్ఎప్పటికప్పుడు ప్రస్తావిస్తున్నారు. ఇక్కడ నెలకొల్పిన జెన్కో విద్యుత్కర్మాగారం జీవిత కాలం పూర్తయింది.
జెన్కో ప్లాంట్ తో ప్రజలకు విడదీయలేని బంధం ఉంది. నేను ఇక్కడ పాదయాత్ర చేసినప్పుడు ప్రజలు చెప్పిన సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చాను. అతిత్వరలోనే పవర్ప్రాజెక్ట్టెండర్లు పిలుస్తం. భూసేకరణపై ప్రతిపాదన త్వరగా పంపించాలని ఆఫీసర్లను కోరాం. ప్లాంట్ నిర్మాణం కోసం విధానపరమైన నిర్ణయాలు తీసుకుంటాం. పవర్ప్రాజెక్టుపై సీఎం రేవంత్‌రెడ్డితో సైతం చర్చించాను. అందరి కోరిక మేరకు బీ పవర్హౌస్పవర్ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్తాం. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం. ప్రజలకిచ్చిన మాట ప్రకారం పాలనా అందిస్తున్నం. సింగరేణి కార్మికులకు కోటి రూపాయల ప్రమాద బీమా సౌకర్యం కల్పించాం. నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రతి నియోజకవర్గ పరిధిలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ఏర్పాటు చేస్తం. పత్తిపాక రిజర్వాయర్ కోసం బడ్జెట్ కేటాయించాం. ఎల్లంపల్లి భూనిర్వాసితుల పెండింగ్ సమస్యలు పరిష్కరిస్తం’ అని భట్టి తెలిపారు.
విద్యుత్కార్మాగారం నెలకొల్పుతం –మంత్రి శ్రీధర్ బాబు
రామగుండంలో -విద్యుత్కార్మాగారం నెలకొల్పుతామని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. పవర్ ప్లాంట్ పునర్నిర్మాణం కోసం పూర్తిగా సహకరిస్తామని తెలిపారు. అప్పటి సీఎల్పీ నాయకుడిగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పాదయాత్ర చేసి ఇక్కడి సమస్యలు తెలుసుకున్నారని గుర్తుచేశారు. ప్రభుత్వపరంగా రామగుండంలో స్పోర్ట్స్ హబ్ గా పెద్దఎత్తున క్రీడా ప్రాంగణం ఏర్పాటు చేస్తామని చెప్పారు.
2 వేల మందికి ఉద్యోగాలు
–పెద్దపల్లి ఎంపీ వంశీ కృష్ణ
రూ.8 వేల కోట్లతో రామగుండం జెన్కో లో సూపర్ క్రిటికల్ పవర్ ప్లాంట్ ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందని ఎంపీ వంశీ కృష్ణ అన్నారు. దీని ద్వారా సుమారుగా 2 వేల మంది నిరుద్యోగులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దక్కుతాయని తెలిపారు. ప్లాంట్ నిర్మాణం కోసం నావంతు సహాయ సహకారాలు అందిస్తానని చెప్పారు. పార్లమెంట్ పరిధిలో అవసరం అయితే నూతన రైల్వే లైన్ ఏర్పాటు కృషి చేస్తామని పేర్కొన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్టాన్ని అప్పుల పాలు చేసిందని ఫైర్అయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం రైతులకు రుణమాఫీ చేసిందని గుర్తుచేశారు.
ఇవాళ పండుగ రోజు –ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్
రామగుండంలో నేడు పండుగ రోజు అని, నియోజకవర్గ ప్రజల గుండె చప్పుడు బీ పవర్ హౌస్ అని ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ అన్నారు. పవర్ హౌస్ నిర్మాణం చేసేందుకు సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. ‘పారిశ్రామిక ప్రాంతంలో ఉపాధి లేక ఇక్కడి ప్రజలు వలస పోతున్నారు. నియోజకవర్గ పరిధిలోని ప్రతి ఎకరాకు సాగు నీరు అందించేలా చర్యలు చేపట్టాలి. అంతర్గాం బర్మా కాందిశీకులకు పట్టాలు ఇవ్వాలి. రామగుండం కార్పొరేషన్ అభివృద్ధి కోసం ప్రత్యేక నిధులు కేటాయించాలి. సింగరేణిలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఏర్పాటు చేయాలి’ అని కోరారు.