చివరి ఆయకట్టు వరకు సాగు నీరందిస్తాం : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

చివరి ఆయకట్టు వరకు సాగు నీరందిస్తాం : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

మధిర, వెలుగు: చివరి ఆయకట్టు వరకు సాగునీటిని అందించేందుకు కృషి చేస్తున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ఆదివారం ఖమ్మం జిల్లా మధిర మండలంలో ఇన్‌‌‌‌చార్జి కలెక్టర్‌‌‌‌ పి.శ్రీజతో కలిసి పర్యటించారు. సిరిపురంలో చెక్ డ్యామ్, జూనియర్  కాలేజ్, ఐటీఐ, పాలిటెక్నిక్​ బిల్డింగ్​ పనులకు శంకుస్థాపన చేశారు. మహాదేవపురం ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించారు. రాయపట్నం ఎత్తిపోతల పథకానికి, మధిర, మొలుగుమాడు, నిధానపురం రోడ్డు విస్తరణ పనులకు శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ గత ప్రభుత్వం భారీగా అప్పులు చేసి పనులు చేసినప్పటికీ, ఆయకట్టు సృష్టించడంలో విఫలమైందని, ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తక్కువ ఖర్చుతో పనులు చేపట్టి ఎక్కువ ఆయకట్టు సాధించడమే లక్ష్యంగా పని చేస్తోందని తెలిపారు. పేదల సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను సమాంతరంగా చేపడుతుందన్నారు.

గత ప్రభుత్వం సృష్టించిన ఆర్థిక విధ్వంసాన్ని సరి చేస్తూ ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని తెలిపారు. మొదటి దశలో నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని తెలిపారు. ఇరిగేషన్  సీఈ ఓవీ రమేశ్ బాబు, విద్యుత్  శాఖ ఎస్ఈ శ్రీనివాసాచారి, ఆర్అండ్ బీ ఎస్ఈ యుగంధర్, ఇరిగేషన్  ఎస్ఈ జి.వాసంతి, ఖమ్మం ఆర్డీవో నర్సింహారావు, పీఆర్  ఈఈ వెంకట్ రెడ్డి పాల్గొన్నారు.